Monday, December 23, 2024

సివిల్స్‌లో తెలుగు వెలుగులు

- Advertisement -
- Advertisement -

యశ్వంత్ రెడ్డి 15వ ర్యాంకు

పూసపాటి సాహిత్య (24), కొప్పిశెట్టి కిరణ్‌మై (56), శ్రీపూజ (62), గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి (69), పక్షవాతంతో కాలు, చేయి పనిచేయలేకపోయినా తల్లి సహాయంతో పరీక్ష రాసి
676 ర్యాంకు సాధించిన బచ్చు స్మరణ్‌రాజ్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఫలితాలలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. యశ్వంత్‌కుమార్‌రెడ్డి అఖిలఆలిండియా 15వ ర్యాంకు సాధించగా, పూసపాటి సాహిత్య 24వ ర్యాంకు, కొప్పిశెట్టి కిరణ్మయి 56వ ర్యాంకు, శ్రీపూజ 62వ ర్యాంకు దక్కించుకున్నారు. అలాగే గడ్డం సుధీర్‌కుమార్‌రెడ్డి (69), ఆకునూరి నరేశ్ (117), అరుగుల స్నేహ (136), బి.చైతన్యరెడ్డి (161), ఎస్.కమలేశ్వరరావు (297), విద్యామరి శ్రీధర్ (336), దిబ్బడ ఎస్వీ అశోక్ (350), గుగులావత్ శరత్ నాయక్ (374), నల్లమోతు బాలకృష్ణ (420), ఉప్పులూరి చైతన్య (470), మన్యాల అనిరుధ్ (564), బిడ్డి అఖిల్ (566), రంజిత్‌కుమార్ (574), పాండు విల్సన్ (602), బాణావత్ అరవింద్ (623), బచ్చు స్మరణ్‌రాజ్ (676) ర్యాంకులు సాధించారు.

ఈ మేరకు సివిల్ సర్వీసెస్-2020 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసింది. ఈసారి అఖిల భారత సర్వీసులకు మొత్తం 685 మంది ఎంపిక కాగా.. జనరల్ కోటాలో 244 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 73, ఓబీసీ 203, ఎస్సీ 105, ఎస్టీ విభాగం నుంచి 60 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్‌కు 180, ఐపీఎస్‌కు 200, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కేటగిరీకి 242 మంది ఎంపిక కాగా.. మరో 90 మంది గ్రూప్ బీ సర్వీసులకు ఎంపికైనట్లు యూపీఎస్‌సీ ప్రకటించింది.

కాలు, చేయి పనిచేయకపోయినా పరీక్ష రాసి 676 ర్యాంకు సాధించిన స్మరన్‌రాజ్

పక్షవాతంతో కుడి కాలు, కుడి చేయి పనిచేయకపోయినా తన తల్లి సహకారంతో పరీక్ష రాసిన బచ్చు స్మరన్ రాజ్ సివిల్స్‌లో 676వ ర్యాంకు సాధించారు. హైదరాబాద్‌కు చెందిన రమేష్‌కుమార్, నాగమణి దంపతుల కుమారుడు బచ్చు స్మరన్‌రాజ్ మద్రాస్ ఐఐటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. విద్యానగర్‌లో నివాసం ఉంటున్నారు. తండ్రి న్యాయవాది కాగా, డిగ్రీ చదివిన తల్లి గృహిణి. గత కొంతకాలంగా పక్షవాతం కుడి కాలు, కుడి చేయి పనిచేయకపోవడంతో వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా న్యాయవాది అయిన తన తండ్రి సలహా మేరకు సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నారు.అందుకు కోచింగ్ కూడా తీసుకున్నారు.

అయితే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల సమయానికి కూడా తన కుడి చేయి, కుడి కాలు పనిచేయలేదు. దాంతో తన తల్లిని స్ర్కైబ్‌గా నియమించుకుని పరీక్షలు రాసి సివిల్స్‌లో సత్తా చాటారు. పొలిటికల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆప్షన్‌గా ఎంపిక చేసుకుని కఠోర శ్రమ, ఎంతో ఆత్మవిశ్వాసంతో చదివి సివిల్స్‌లో అద్భుతం సృష్టించారు. తన తండ్రి సలహా మేరకు సివిల్స్ రాయాలని నిర్ణయించుకుని, తనకు ఆరోగ్యం సహకరించకపోయినా తన తల్లి సహకారంతో సివిల్స్ రాశానని స్మరన్‌రాజ్ తెలిపారు.కోచింగ్,తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం తన విజయానికి తోడ్పడ్డాయని పేర్కొన్నారు. అన్ని అంశాలపై అవగాహన పెంచుకుని ఆత్మవిశ్వాసంతో ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో.. ఇంటర్వ్యూకు హాజరయ్యానని తెలిపారు.

డాక్టర్ నుంచి సివిల్స్‌కు

సివిల్స్‌లో ఆలిండియా 56వ ర్యాంకు వచ్చిన కొప్పిశెట్టి కిరణ్మయి స్వస్థలం హైదరాబాద్. ఎంబిబిఎస్, ఎంఎస్ పూర్తి చేసిన కిరణ్మయి నాలుగోసారి సివిల్స్‌లో ఉత్తమ ర్యాంకు సాధించారు. ఇప్పటివరకు నాలుగు సార్లు సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసిన ఆమె, మూడు సార్లు ర్యాంకు సాధించారు.

సత్తా చాటిన జగిత్యాల జిల్లా వాసి

సివిల్స్ ఫలితాల్లో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన గుగులావత్ శరత్ నాయక్ ఆలిండియా 374 ర్యాంకు సాధించారు. తండ్రి భాష్య నాయక్ రైతు కాగా, తల్లి యమున మినీ అంగన్వాడీ టీచర్. వెటర్నరీ డాక్టర్ అయిన శరత్ నాయక్ సివిల్స్ తొలి ప్రయత్నంలోనే ఆలిండియా 374వ ర్యాంకు దక్కించుకున్నారు. సివిల్ సర్వీసెస్‌కు ఎంతో కష్టపడి చదినానని శరత్ నాయక్ పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్ధేశంతోనే సివిల్స్ రాయాలని అనుకున్నానని తెలిపారు.

పొరపాట్లను సరిదిద్దుకుని ర్యాంకు సాధించా : రంజిత్‌కుమార్

వరంగల్ జిల్లాకు చెందిన రంజిత్‌కుమార్ సివిల్స్ మూడో ప్రయత్నంలో 574వ ర్యాంకు సాధించారు. తల్లి కృష్ణంరాజు వ్యాపారి, తల్లి మాధవి గృహిణి. రంజిత్‌కుమార్ ఎన్‌ఐటీ రాయ్‌పూర్ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తాను మొదటి సారి నేను క్వాలిఫై కాలేదని, రెండో సారి ఇంటర్య్యూ వరకు వెళ్లానని చెప్పారు. మూడవ ప్రయత్నంలో సివిల్స్‌లో 574వ ర్యాంకు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తాను ఫెయిల్ అయినప్పుడు.. కొన్ని తప్పులు కనిపించాయని,వాటిని సరిదిద్దుకుని తాను పొరపాట్లను అధిగమించడం వల్ల ఈసారి ర్యాంకు సాధించగలిగానని అన్నారు. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ను ఆప్షనల్‌గా ఎంచుకున్నానని, ప్రణాళిక బద్ధంగా చదవడం వల్లనే ర్యాంకు పొందగలిగానని తెలిపారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు. మూడు ఒకటే.. కానీ చదివే విధానం వేరుగా ఉంటుందని చెప్పారు. గత పరీక్ష పేపర్లును పరిశీలిస్తూ స్టాండర్డ్ బుక్స్‌ను చదివానని అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి

మాది ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా గోనవరం గ్రామం. అమ్మానాన్న పెద్ద రామసుబ్బారెడ్డి, రమాదేవి. వ్యవసాయ కుటుంబం. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదివాను. సివిల్స్ పరీక్షను 4వ సారి రాసి ఆలిండియా స్థాయిలో 69వ ర్యాంక్ సాధించాను. అత్యంత కష్ట తరమైన సివిల్స్ పరీక్షను ఒకటో సారి, రెండో సారి మాత్రమే రాసి ఫలితం రాలేదని నిరుత్సాహానికి గురికావద్దు. సివిల్స్ వచ్చాకా, రిలాక్స్‌గా అనిపిస్తోంది. నిరతంతరం చదవుతూనే ఉండాలి. ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తాను.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News