Friday, November 22, 2024

వచ్చే మార్చి నాటికల్లా అన్ని అర్బన్ ఫారెస్టు పార్కులను పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

అధికారులను ఆదేశించిన అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

Urban forest park work completed march end

మన తెలంగాణ/హైదరాబాద్ : అవాంతరాలను అధిగమించి వచ్చే మార్చి కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులను పూర్తి చేయాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతికుమారి ఆదేశించారు. శుక్రవారం అరణ్యభవన్ నుంచి అన్ని జిల్లాల అటవీ శాఖ అధికారులు, అర్బన్ పార్కుల అభివృద్దిలో పాల్గొంటున్న ఇతర శాఖల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో కొంత భాగాన్ని మాత్రమే కనీస సౌకర్యాలతో అర్బన్ పార్కుగా అభివృద్ది చేయాలన్నారు.

మిగతా ప్రాంతం అంతటినీ కన్జర్వేషన్ జోన్లుగా తీర్చిదిద్దాలని సూచించారు. సామాజిక బాధ్యతలో భాగంగా పార్కుల అభివృద్దికి, ప్లాంటేషన్ లో భాగం అయ్యేందుకు ముందుకు వచ్చే కార్పోరేట్ సంస్థల సహకారాన్ని తీసుకోవాలని తెలిపారు. జిల్లాల వారీగా ఎక్కడ ఏఏ ఫారెస్ట్ పార్కు ఉంది? ప్రస్తుత దశ, రానున్న రోజుల్లో పూర్తి చేయాల్సిన పనులపై ఈ సందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆరా తీశారు. అర్బన్ పార్కుల ఫోటోలు, వీడియోలు, పవర్ పాయింట్ ప్రజంటేషన్ లను చూస్తూ, అధికారులకు తగిన సలహాలు, సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేసి, ప్రజలకు వచ్చే మార్చి కల్లా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చుట్టుపక్కల హెచ్‌ఎండిఎ పరిధిలో 59 పార్కులు ఉండగా, వివిధ జిల్లాల్లో 50 పార్కులు ఉన్నాఏయి. వీటిల్లో 53 పార్కులు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. మరో 52 పార్కుల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మిగతా నాలుగింటి పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉందన్నారు. పార్కుల వారీగా పనుల పురోగతిని సమీక్షించిన శాంతి కుమారి, ఖచ్చితమైన కార్యాచరణ, ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

కాగా న్యాయపరమైన చిక్కులు ఉన్నా, మిగతా శాఖలతో సమన్వయం అవసరం ఉన్నా, వెంటనే తమ దృష్టికి తేవాలని వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్) ఆర్.శోభను కోరారు. ప్రతి పార్కులో కూడా చిక్కగా మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని, పర్యావరణ హితంగా మలిచి, సందర్శకులకు అహ్లాదం పంచేలా ఉండాలన్నారు. ఒక్కో పార్కులో ఐరన్ మెష్‌తో కూడిన రక్షణ గోడ (సీత్రూ వాల్), ఎంట్రీ గేటు, వాకింగ్ ట్రాక్, యోగా షెడ్, టాయిలెట్ల తప్పనిసరిగా ఉండాలన్నారు. సందర్శకులు ఎక్కువగా ఉండే పార్కుల్లో అవసరాన్నిబట్టి మిగతా సౌకర్యాల కల్పన అటవీ చట్టాలకు లోబడి జరగాలన్నారు. కనీస సౌకర్యాలను కల్పిస్తూ, పర్యావరణ పరంగా అటవీ ప్రాంతాలకు రక్షణ, పునరుద్దరణకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని శాంతి కుమారి సూచించారు. ఈ సమావేశంలో పిసిసిఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డోబ్రియల్, వివిధ సర్కిళ్లకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లాల అటవీ అధికారాలు, జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, ఫారెస్ట్ కార్పోరేషన్, టిసిఐఐసి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News