Monday, December 23, 2024

ప్రాంతీయ పక్షాల హవా

- Advertisement -
- Advertisement -

Plea In Supreme Court To Enforce Fundamental Duties

రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్రాన్ని ఎదురులేని రీతిలో పాలిస్తున్న పార్టీ ఒకటి కాగా, అనేక జయాపజయాల తర్వాత నూతన చైతన్యంతో పగ్గాలు చేపట్టిన నేత సారథ్యంలో విశేష ఆధిక్యతతో రాష్ట్రాధికారాన్ని సాధించుకున్న పార్టీ మరొకటి. రెండూ ఈ మధ్య జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాలను నామరూపాల్లేకుండా ఓడించి అఖండ విజయాలు చూరగొనడం విశేషం. వీటిలో ఒకటి ఒడిశా పాలక పక్షం బిజూ జనతాదళ్ కాగా, మరొకటి తమిళనాడు అధికార పక్షం డిఎంకె. తమిళనాడులో పట్టణ స్థానిక సంస్థలకు, ఒడిశాలో గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. తమిళనాడులో ఈ నెల 19న జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో డిఎంకె కూటమి దిగ్విజయ భేరీ మోగించింది. మొత్తం 1373 మునిసిపల్ కార్పొరేషన్ వార్డుల్లో డిఎంకె సొంతంగా 946 వార్డులను చేజిక్కించుకున్నది. అలాగే 3842 మునిసిపాలిటీ వార్డుల్లో 2360 డిఎంకె కైవసమయ్యాయి. 7605 పట్టణ పంచాయతీ వార్డుల్లో 4388 దానికి సొంతమయ్యాయి. డిఎంకె కూటమిలోని దాని ప్రధాన సహచర పక్షం కాంగ్రెస్ 73 మునిసిపల్ కార్పొరేషన్ వార్డులను, 131 మునిసిపల్ వార్డులను, 368 పట్టణ పంచాయతీ వార్డు స్థానాలను గెలుచుకున్నది. డిఎంకె ఇతర మిత్ర పక్షాలైన లెఫ్ట్ పార్టీలు, తదితర చిన్నచితక పక్షాలు గెలుచుకున్న స్థానాలను కలుపుకుంటే డిఎంకె కూటమి మూడింట రెండు వంతులకు మించిన అద్భుత విజయాన్ని చవిచూసింది. ప్రధాన ప్రత్యర్థి పక్షం మాజీ పాలక పార్టీ అఖిల్ భారత అన్నా డిఎంకె కంచుకోట అనిపించుకున్న పశ్చిమ తమిళనాడును డిఎంకె పూర్తిగా సొంతం చేసుకున్నది. డిఎంకె గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొంది అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఎఐఎడిఎంకె కీలక స్థావరమైన పశ్చిమ తమిళనాడుపై దృష్టి కేంద్రీకరించి దానిని గెలుచుకోడం విశేషం. స్టాలిన్ నాయకత్వంలో పీడిత ప్రజానీకానికి అతి చేరువగా వుండి పని చేసే పాలక పక్షంగా డిఎంకె కొత్త పుంతలు తొక్కుతున్నది. అన్ని రంగాల్లోనూ సామాజిక న్యాయ సాధనే ధ్యేయంగా అడుగులు వేస్తున్నది. రాజకీయ శత్రుత్వాలను పెంచుకోకుండా పాలనపైనే దృష్టి పెట్టి ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నది. ఆ పద్ధతి దానికి, దాని మిత్రపక్షాలకు పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలను కట్టబెట్టింది. ఒడిశా విషయానికి వస్తే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆ రాష్ట్రానికి మారుపేరుగా స్థిరపడిపోయారు. 74 ఏళ్ల నవీన్ పట్నాయక్ 22 సంవత్సరాలుగా ఒడిశాను విరామం లేకుండా పరిపాలిస్తున్నారు. 1997లో తండ్రి బిజూ పట్నాయక్ మరణానంతరం ఆయన ఖాళీ చేసిన లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన నవీన్ పట్నాయక్ ఆ తర్వాత బిజూ జనతాదళ్ పార్టీని నెలకొల్పి తిరుగులేని నేతగా రుజువు చేసుకుంటున్నారు. సోమవారం నాడు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిజెడి అసాధారణ విజయాలను చూరగొంటున్నది. మొత్తం 853 జిల్లా పరిషత్తు వార్డుల్లో 851కి ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెల్లడైన 315 జిల్లా పరిషత్తు వార్డుల్లో 90 శాతం అనగా 281 బిజెడి కైవసమయ్యాయి. ప్రతిపక్షాలు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు వరుసగా 15, 14 స్థానాల్లో మాత్రమే గెలుపొందాయి. దాదాపుగా మొత్తం 30 జిల్లాల పరిషత్తులనూ బిజెడి గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక విషయాల్లో పాలక పక్షాన్ని ఎండగడుతూ ప్రతిపక్షాలు విశేష ప్రచారం చేసినప్పటికీ అవి సఫలీకృతం కాలేకపోయాయి. ఒడిశా ప్రజలు బిజూ పట్నాయక్‌ని ఆరాధించిన దానికంటే ఎక్కువగా నవీన్ పట్నాయక్ నాయకత్వాన్ని ఇష్టపడుతున్నట్టు రుజువవుతున్నది. ఈ విజయ రహస్యం ఆయన పాలనా విధానంలో, తుపానుల వంటి ప్రకృతి వైపరీత్యాల్లో ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గరగా వుంచి ఆదుకునే తీరులో ఇమిడి వున్నదని స్పష్టపడుతున్నది. ప్రాంతీయ పార్టీలు ప్రజలకు అత్యంత చేరువగా వుండి వారి ఆకాంక్షలను నెరవేర్చగలవనడంలో సందేహించవలసిన పని లేదు. బిజెడి గాని, డిఎంకె గాని ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఏ ప్రాంతీయ పార్టీయైనా ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకున్నట్టయితే అక్కడ జాతీయ పార్టీలు నెగ్గుకు రావడం సులభసాధ్యం కాదు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ విషయంలోనూ ఇది పదేపదే రుజువవుతున్నది. తెలంగాణను పరిపాలిస్తున్న టిఆర్‌ఎస్ నానాటికీ మరింతగా బలపడుతూ ప్రజల పక్షంగా నిరూపించుకోడానికి అది ప్రజల మనసెరిగి పరిపాలిస్తుండడమే కారణం. జాతీయ పాలక పక్షం బిజెపి మతతత్వ విధానాలతో అపరిపక్వ పాలనారీతులతో దేశ ప్రజలకు దూరమవుతున్నది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ క్రమక్రమంగా కనుమరుగయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల పక్షాలన నిలబడే ప్రాంతీయ పక్షాలకే దేశాన్ని చక్కదిద్దే బాధ్యత సంక్రమించగలదు.

Urban Local Elections 2022 in Tamil Nadu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News