పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రాజెక్టులకు ఆటంకాలు
పర్యావరణ మంత్రుల సదస్సులో ప్రధాని మోడీ ఆరోపణ
అహ్మదాబాద్: పర్యావరణానికి హాని చేస్తుందని దుష్ప్రచారం చేస్తూ గుజరాత్‌లో నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని రాజకీయ అండ గల ”అర్బన్ నక్సల్స్, ప్రగతి నిరోధక శక్తులు” అనేక సంవత్సరాల పాటు అడ్డుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. అటువంటి అర్బన్ నక్సల్స్ ఇప్పటికీ చురుకుగా ఉన్నారని, పర్యావరణ పరిరక్షణ పేరుతో వివిధ సంస్థల మద్దతుతో అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ప్రధాని ఆరోపించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదా ఈజ్ ఆఫ్ లైఫ్ తీసుకురావాలన్న లక్షంతో చేపట్టిన ప్రాజెక్టులు అనవసర కారణాలతో ఆగిపోకుండా చూడాలని ఆయన వివిధ రాష్ట్రాలక పర్యావరణ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గుజరాత్‌కు చెందిన నర్మదా జిల్లాలోని ఏక్తా నగర్ వద్ద జాతీయ పర్యావరణ మంత్రుల సమావేశాన్ని ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అటువంటి శక్తుల కుట్రలను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ అనుమతులు మంజూరు చేయడంలో సమతుల విధానాన్ని అనుసరించాలని ప్రధాని కోరారు. సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని నిలిపివేయడం వల్ల ఏర్పడిన జాప్యానికి భారీ మొత్తంలో ప్రజాధనం వృథా అయిందని, డ్యాం నిర్మాణం ఇప్పుడు పూర్తి కావడంతో అర్బన్ నక్సల్స్, ప్రగతి నిరోధక శక్తుల ప్రచారం ఎంత బూటకమైనదో తేలిపోయిందని ఆయన అన్నారు. పర్యావరణానికి ఈ ప్రాజెక్టు హాని చేస్తుందని వారు చేసిన ప్రచారానికి భిన్నంగా ఇప్పుడు డ్యాం పరిసర ప్రాంతాలు తీర్థ క్షేత్రంగా మారిపోయాయని ఆయన చెప్పారు.