‘చేపలతో చెరువు నిండినట్లు ఈ నగరం మనుషులతో కళకళలాడాలి’ అన్నాడట హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తున్నప్పుడు అప్పటి రాజు. తన కవిత ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్‌లో సరోజినీ నాయుడు జీవం తొణికిసలాడే నగర వీధుల్ని అద్భుతంగా వర్ణిస్తుంది. హైదరాబాద్ నగరం చేతులు చాచి ఆహ్వానిస్తుంది కాబట్టే, జీవితాన్ని వెతుక్కుంటూ గత 400 సంవత్సరాలుగా ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వచ్చి ప్రజలు స్థిరపడ్డారు. ఇప్పుడు హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే అత్యున్నతమైన మెట్రో పాలిటిన్ సిటీగా గుర్తించబడింది.
బహుళ సంస్కృతులకు, భాషలకు, జీవన విధానాలకు చోటు ఇచ్చిన నగరం కాబట్టే బతుకుతెరువుకి, అవకాశాలకి, నివాసానికి యోగ్యమైనది కాబట్టే, హైదరాబాదు దాని చుట్టుపక్కల గ్రామాలను తనలో కలుపుకుంటూ అనూహ్యరీతిలో విస్తరణతో శరవేగంతో ముందుకు సాగుతూ ఉంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకి అంతర్గతంగా వలస రావడం ఒకటైతే, తమ సొంత రాష్ట్రాలలో ఉపాధి దొరకక తెలంగాణకు, ముఖ్యం గా హైదరాబాద్ నగరానికి వలస రావడం నగర జనాభా పెరుగుదలకు కారణం. అంతేకాదు, ఇక్కడి వాతావణం అనుకూలంగా వుండటంతో వివిధ రకాల పరిశ్రమలకి, సాఫ్ట్‌వేర్ వంటి రంగానికి నగరం కేంద్రం కావడం అన్నది కూడా ఈ పెరుగుదల వున్నా మరో ముఖ్య పరిణామం. హైదరాబాద్ నగరంలో 1.75 లక్షలు, రాష్ట్రం మొత్తం కలిపి 3.35 లక్షల మంది వలసకూలీలు ఉన్నట్లుగా ప్రభుత్వం చెబుతున్నా, అనధికారికంగా ఈ సంఖ్య ఆరు లక్షలకు తక్కువగా ఉండదు.
జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఒడిశా, బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఇలా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళ సంఖ్య ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా ఉంది. చాలా మంది, నగరంలో పని చేస్తూ, మెల్లిగా ఇక్కడే స్థిరపడడం జరుగుతూ వుంది. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న, పది జిల్లాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడివడి, 10 జిల్లాలతో ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఆనాటికే, గుర్తింపబడిన ప్రధానమైన పట్టణ ప్రాంతాలుగా ఉన్నాయి. నిజానికి దేశంలోని అనేక ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ పట్టణీకరణలో ఎంతో ముందు ఉంది. కుతుబ్‌షాహీల వంశంలోని ఐదవ సుల్తాన్, కులీకుతుబ్ షా 1591 సంవత్సరంలో హైదరాబాద్ నగర నిర్మాణానికి పునాదులు వేశాడు. నగరం ఏర్పడి 400 సంవత్సరాలు గడిచినా అవిచ్ఛిన్నంగా, ఇంతై వటుడింతై అన్నట్లుగా శరవేగంగా అది నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. ఆ తరువాత అనేక మంది చేతులు మారి అధికారం చివరికి, అసఫ్‌జాహీలకి దక్కి హైదరాబాద్ రాష్ట్రం వారి పాలనలోకి వచ్చింది.
స్వాతంత్య్రానంతరం, 1948లో హైదరాబాదు రాష్ట్రం ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది.171 సంవత్సరాల కుతుబ్ షాహీల పాలనలో, సుమారు 224ఏళ్ల అసఫ్‌జాహీల పాలనలోనూ హైదరాబాదు రాష్ట్రం వ్యాపారపరంగా, సాంకేతికపరంగా, నిర్మాణపరంగా ఇతర రాష్ట్రాల కన్నా ఆనాడే ఎంతో అగ్రగామిగా ఉండేది. అద్భుతమైన భవనాలు, నీటిపారుదల, పారిశుద్ధ్య వ్యవస్థలు, విద్య, వైద్య సంస్థలు ఏర్పాట్లతో పాటూ, వందేళ్ళ ముందు చూపుతో నగరానికి అవసరమైనటువంటి రహదారుల నిర్మాణం చేపట్టిన వాళ్ళు అప్పటి పాలకులు. నైజాం కాలం నాటికే నగరం ఒక మెట్రోపాలిటన్ సిటీ.
ఇండో పర్షియన్, ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలులే కాక సాహిత్యం, బహుళ సంస్కృతి, భాషలకు నగరం నిలయంగా ఉండింది. పర్షియన్, తెలుగు, ఉర్దూ తదితర భాషలు మాట్లాడే ప్రజలు, వివిధ సంస్కృతులు ఆచరించే ప్రజలు, దేశం నలుమూలల నుంచి వచ్చి నగరంలో స్థిరపడ్డారు. ఆనాటికే నగరంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. 1869 నాటికే సర్ సాలార్‌జంగ్ -1, మున్సిపల్ అండ్ రోడ్ మెయింటెనెన్స్ మున్సిపల్ కమిషనర్‌గా నియమించబడ్డాడు. అప్పటికి హైదరాబాద్ 55 చదరపు కిలోమీటర్లు, 3.5 లక్షల జనాభాతో ఉండేది. దేశంలోని పట్టణ జనాభా జాతీయ సగటు మొత్తం జనాభాలో 31.16 శాతం ఉండగా, తెలంగాణలో 46.8 శాతంగా నమోదైనదని నీతిఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది. 2025 నాటికి తెలంగాణ పట్టణ జనాభా 50 శాతానికి చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు.
పట్టణ ప్రాంతాలలో పెరుగుతున్న విద్య, ఉపాధి అవకాశాలు, జీవన స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు ప్రజలు, యువత నగరాల వైపుకి ఆకర్షించబడడానికి కారణం అవుతున్నాయి. గత ఆరేళ్ళుగా జీవన నాణ్యత సూచికలో భారత దేశంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. అంతేకాదు, కొనుగోలు శక్తి, భద్రత, ఆరోగ్య సంరక్షణ, జీవనవ్యయం సూచికలలో, ఆస్తి ధర నుండి ఆదాయ నిష్పత్తి సూచిక, ట్రాఫిక్ ప్రయాణ సమయం, వాతావరణ సూచికలో వరుసగా హైదరాబాద్ నగరం అగ్రస్థానంలో ఉంది. నాణ్యత, ఆర్థిక పోటీతత్వాన్ని సాధించడానికి ప్రపంచంలోని 30 ప్రధాన నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది. ప్రపంచంలోనే మొత్తం జనాభాలో సగభాగం మంది 2030 సంవత్సరానికల్లా నగరాల్లోనే స్థిర నివాసాన్ని ఏర్పరచుకోనున్నారు అని ఐక్యరాజ్యసమితి చెబుతూ ఉంది. నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి అంచనాల ప్రకారం 1.8 కోట్ల ప్రజలు 2023 నాటికి పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
2036 నాటికి 2.3 కోట్ల మంది అంటే 57.3% పట్టణాల్లో నివసించబోనున్నారు.
జాతీయస్థాయిలో కూడా పట్టణాలలో నివసించబోయే వారి సంఖ్య 2023లో 35.1% ఉండగా, ఇది 2036 నాటికి 39.1 శాతానికి పెరగనుంది. 1917 సంవత్సరంలో అర్బన్ ప్రాంతాల్లో సుమారు 13 శాతం మంది ప్రజలు జీవిస్తూ ఉంటే, అది 1950 నాటికి 29 శాతానికి పెరిగింది. ఇప్పుడు 50 శాతానికి పెరిగింది. ఈ నగరీకరణలో భాగంగా కొత్త, కొత్త పేర్లను పట్టణాలకు, నగరాలకు పెడుతున్నారు. సస్టైనబుల్ సిటీస్, స్మార్ట్ సిటీస్, ఎకోసిటీస్, నాలెడ్జ్ సిటీస్, లో కార్బన్ సిటీస్, మెగా సిటీస్ ఇలా ఆయా పేర్లను వాటి ప్రత్యేకతలను బట్టి పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఒకప్పటి హైదరాబాద్ టోపోగ్రాఫీ పూర్తిగా మారిపోయింది ఇప్పుడు. 250 కోట్ల సంవత్సరాల క్రితం రూపొందిన, దక్కన్ పీఠభూమికే తలమానికం అయిన రాతికొండల సంపద నగర విస్తరణలో, క్వారేలుగా తవ్విపోసి సర్వనాశనం చేశారు.
హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలలో 140కి పైగా చిన్న, పెద్ద చెరువులు, కుంటలు వున్నాయి. అడ్డగోలుగా సాగుతున్న నగరీకరణలో ఇష్టం వచ్చినట్లు, చెరువులను, వాటి కాచ్ మెంట్ ఏరియాలను జంకుగొంకు లేకుండా కబ్జాలు చేసి, భవన నిర్మాణాలను చేపట్టిన కారణంగా, నీటి పరీవాహక ప్రాంతాలను అడ్డుకుంటూ రోడ్డు నిర్మించడం వలన, కోటికి పైగా చేరుకున్న నగర జనాభా అవసరాలకు తగిన డైనేజీ, వర్షపు నీటిపారుదల, తదితర మౌలిక సదుపాయాల వ్యవస్థల ఏర్పాటులో వైఫల్యాలు వంటి అంశాలు, వాటి కారణంగా నగరంలో చిన్న వర్షం కురిసినా రోడ్లు, ఇళ్ళు జలమయం అవుతున్న పరిస్థితి వుంది. నగరం చుట్టూ ఉన్న పరిశ్రమల కాలుష్యం నీటి వనరులను, వాతావరణాన్ని నాశనం చేస్తున్నాయి. ఈ రకపు దురాక్రమణలకు పాల్పడిన రాజకీయ నాయకులను, సమాజంలో ప్రముఖులుగా చలామణి అవుతున్న ధనవంతులను, అలాగే అన్ని నియమ నిబంధనలనూ తుంగలోకి తొక్కి వారికి అనుమతులను ఇచ్చిన ప్రభుత్వ అధికారులను నిజంగా, పూర్తిస్థాయిలో శిక్షించగలిగిన చిత్తశుద్ధి ప్రభుత్వానికి వుందా?
హైడ్రా, నగర దురాక్రమణదారుల అనకొండల తోక చివరి కొస కనీసం అంగుళం అన్నా కత్తిరించక ముందే గగ్గోలు పెద్ద ఎత్తున మొదలైంది. హైదరాబాద్ నగరంలో నోటిఫేడ్ మురికివాడలు 775 వున్నాయి. ప్రతి వంద మంది హైద్రాబాదీయులలో 23 మంది దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తూ ఈ బస్తీలలో వుంటున్నారు. వీటిల్లో నివసించే పట్టణ పేదలు అత్యంత దారుణమైన ఆర్థిక, సామాజిక పరిస్థితుల మధ్య, మౌలిక వసతులేమీ లేకుండా జీవిస్తునారు. నగరాన్ని నందనవనం చేయడంలో సంపన్నులకు వివిధ రకాల సేవలను అందించడంలోనే వీరి బతుకు తెల్లారుతున్నది. మూసీ సుందరీకరణ, ప్రక్షాళణ పేరిట గతంలోనూ, ఇప్పుడూ కూడా ఆ ప్రాంతంలో మరో దారి లేక బతుకుతున్న పేదల ఆవాసాలను కూల్చివేసే ప్రయత్నాలు నిరంతరం సాగాయి. ఇప్పుడు కూడా సమాజపు అంచులలో జీవించే, ఎలాంటి బలమూ లేని ఈ పేదలే హైడ్రా కత్తివేటుకు సులభంగా బలి కానున్నారు. వీరికి ప్రత్యామ్నాయాలు చూపకుండా ఇళ్ళ నుండి వెళ్ళగొట్టే చర్య క్షంతవ్యం ఎంత మాత్రం కాదు.
హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 2.1 లక్షల అప్లికేషన్లు భవన నిర్మాణాల కోసం అనుమతించబడ్డాయి.
ఇంకా అనేకం పెండింగ్‌లో ఉన్నాయి. దీని చుట్టూ అనేక రకాల ఆర్థిక కార్యకలాపాలు కూడా జరుగుతూ ఉంటాయి. పట్టణీకరణ అనేక రకాల ఉపాధులకు, ఆర్థిక కార్యకలాపాలకు పట్టణీకరణ దోహదపడుతుంది కూడా. నగరం చుట్టూ వంద కిలోమీటర్ల పరిధిలో కొత్త నగరపు ఏర్పాటుకై ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పట్టణీకరణ గతం నుండీ వుండి నటువంటి ఆర్థిక తారతమ్యాలను మరింత దుర్మార్గంగా పెంచుతూ వుంది. ఒకప్పుడు జంట నగరాలూ అనే వాళ్ళం. అది భౌగోళికమైనది. ఇప్పుడు వెలుగు ధగధగలతో మెరిసిపోతున్న మహానగరం ఒకటైతే, ఆ నగర సంపదల, వెలుగుల సృష్టికర్తలు నివసించే దీపపు నీడల కింద మరో నగరం. హైదరాబాద్ నగరపు ఆత్మను పట్టుకున్న మన అద్భుత కవి మఖ్దుమ్ మోహినుద్దీన్ ఏ షహర్ అప్నా అజబ్ షహర్ హై కే, రాతో మేం సడక్ పే చలేతో సర్గోషియాం సీ కర్తా హై, ఓ లాకే జక్మ్ దిఖాతా హై అంటాడు. హృదయం ఉన్న మానవులుగా ఆ గాయాలను కూడా మనం చూడగలగాలి.
బహుముఖం
విమల