హైదరాబాద్: ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం అలంపూర్ పట్టణంలోని హాజ్రత్ సయ్యద్ షా ఆలీ పహెల్వాన్ దర్గాను ఎద్దుల బండిపై భారీ ర్యాలీతో దర్శించారు. జోగుళాంబ బాలబ్రహ్మేశరస్వామి ఆలయ ప్రాంగణంలోని దర్గాలో మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధ్మాత్మిక భారతావనిలో ఉర్సు ఉత్సవాలు హిందూ,ముస్లిం మతసామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయన్నారు.దర్గా నిర్వాహకులు ఆయనను శాలువలతో,పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
భూమిలేని ప్రతి కుటుంబానికి ఎకరం భూమి పంచుతాం :
బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే భూమి లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరం భూమి పంచుతామన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మానవపాడు మండలంలోని జల్లాపురంలో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి పదేళ్ళైనా నడిగడ్డ ప్రజల కన్నీళ్లు తుడచడంలో గత పాలకులు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి ఉన్నత చదువుల వైపు అడుగులు వేసేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈకార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎంసీ కేశవరావు,జిల్లా ఇన్చార్జ్ ఎంజీ కృష్ణ,నియోజకవర్గం అధ్యక్షుడు తిరుపాల్, నియోజకవర్గం ఇంచార్జులు మధు గౌడ్,కనకం బాబు తదితరులు పాల్గొన్నారు.