Sunday, December 22, 2024

భగ్గుమన్న పశ్చిమాసియా

- Advertisement -
- Advertisement -

బీరూట్/జెరూసలెం: హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ అంతం పంతంతో సాగుతోన్న ఇజ్రాయెల్ భీకర దాడులు పశ్చిమాసియాలో కల్లోలానికి దారితీశాయి. ఓ వైపు తమ ప్రత్యర్థి శక్తులు హమాస్ మిలిటెంట్లు పాలస్తీనియా గాజాస్ట్రిప్ ప్రాంతాలలో కేంద్రీకృతం కావడం. మరో వైపు లెబనాన్ పరిధిలోనే మరో శత్రువర్గం హెజ్‌బొల్లా తిష్ట వేసుకుని ఉండటంతో , ఈ రెండింటి అంతానికి ఇజ్రాయెల్ అనివార్యపు యుద్ధం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రగులుతున్న నరిణామాలకు పరాకాష్టగా మారాయి. ఐరాస వేదిక నుంచి ఇజ్రాయెల్ ప్రదాని నెతన్యాహూ సభ్య దేశాల సమక్షంలోనే తాము తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుని తీరుతామని ప్రకటించారు. పైగా ఉగ్రమూకలకు సహకరిస్తోన్న ఇరాన్‌కు ఘాటైన హెచ్చరికలు వెలువరించారు. ఇరాన్‌లోని సుదూర ప్రాంతాలు కూడా తమ సైనిక శక్తుల రాడార్ పరిధిలో ఉన్నాయని, తమ టార్గెట్‌ను తప్పించుకుని ఇరాన్‌లోని ఏ ప్రాంతం సురక్షితంగా లేదని కూడా ఆయన హెచ్చరించారు. పనిలో పనిగా ఆయన ఐరాస తీరు తెన్నులను, శాంతివచనాలకు దిగుతున్న అమెరికా, మిత్రదేశాలను కూడా దునుమాడాడు.

ఐరాసలో ఆయన ఘాటైన ప్రసంగం ముగిసిన వెంటనే అంతకు ముందే అంతా సిద్ధం చేసుకుని ఉంచిన దాడుల ప్లాన్ మేరకు ఇజ్రాయెల్ అత్యంత భీకర స్థాయిలో బీరూట్‌లోని హెజ్‌బొల్లా కంచుకోటను దెబ్బతీసింది. ఇక్కడ జరిపిన దాడులు అత్యంత శక్తివంతమైనవి. టన్నుల కొద్ది బరువు ఉండే బాంబులను వందలాది ప్రయోగించడంతో హెజ్‌బొల్లా కీలక స్థావరం కుప్పకూలింది. శిథిలాలలో హెజ్‌బొల్లా అధినేత, వారికి ఆయువుపట్టు నస్రల్లా , ఆయన కూతురు మృతి చెందారు. ఇదే దాడిలో ఇరాన్‌కు చెందిన పారా మిలిటరీ బలగాల అధినేత జనరల్ ఒకరు హతులయ్యారు. హెజ్‌బొల్లా స్థావరంలో ఆయన కీలక సమావేశం నిర్వహిస్తూ ఉండగా , ఇజ్రాయెల్‌పై దాడులకు వ్యూహాలు పన్నుతుండగా ఇజ్రాయెల్‌కు సమాచారం అందింది. అదీ కూడా ఇరాన్‌కు చెందిన గమ మనిషి స్పై నుంచి దక్కిన వార్తతోనే గురి చూసి ఈ స్థావరాన్ని పేల్చేసింది. దీనితో ఇప్పుడు ఇరాన్ నుంచి తీవ్ర స్పందన వెలువడింది. తాము కూడా ఇజ్రాయెల్‌పై నేరుగా దాడులకు దిగుతామని హెచ్చరించింది. అయితే వెనువెంటనే ఇజ్రాయెల్‌పై ఇరాన్ నేరుగా దాడికి దిగే అవకాశాలు పెద్దగా లేవు. ఈ లోగానే ఇప్పుడు ఇజ్రాయెల్ జరిపిన దాడులలో హెజ్‌బొల్లాకు చెందిన మరో కీలక నేత నబిల్ కౌక్ హతుడు అయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. హెజ్‌బొల్లా సెంట్రల్ కమాండ్‌లో ఆయన ఉపదళపతిగా ఉన్నాడు. తాజాగా ఇజ్రాయెల్ సేనలు హౌతీ రెబెల్స్ స్థావరాలను కూడా తుదముట్టించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు అమెరికా పత్రికలు పేర్కొన్నాయి. పనిలో పడ్డాయి.

నస్రల్లాను పసిగట్టడంలో ఇజ్రాయెల్ చాకచక్యం
తమ ప్రత్యర్థి వర్గం ఆంతరంగికులను తమ వైపు మచ్చిక చేసుకుని వారిద్వారానే లోగుట్టు లాగడం ఇజ్రాయెల్ వేగు సంస్థ మొస్సాద్‌కే సొంతం. ఈ సంస్థ ఈ మధ్యలోనే ఏకంగా ఇరాన్‌కు చెందిన ఓ కీలక నేతను వారి ప్రధాన స్థావరంలోనే హతమార్చింది. ఇప్పుడు ఇరాన్‌కు చెందిన వేగు నుంచి హెజ్‌బొల్లా నేత కదలికల సమాచారం తీసుకుని దాడికి దిగినట్లు వెల్లడైందని ఫ్రాన్స్ పత్రిక ఓ వార్త వెలువరించింది. బీరూట్ శివార్లలోని దహియాలో హెజ్‌బొల్లా భూగర్భ స్థావరం ఉందని, అక్కడనే నస్రల్లా తన కీలక అనుచరులతో సమావేశం అవుతుంటారని తెలుసుకుంది. దాదికి దిగింది. ఈ స్థావరాన్ని ధ్వంసం చేసింది. అయితే ఇప్పుడీ ఘటన ఈ ప్రాంతంలో మరింత ఘర్షణకు దారితీసింది. అయితే ఇదే సమయంలో ఇరాన్ నుంచి కీలక ప్రత్యక్ష సహకారంతో హెజ్‌బొల్లా కూడా ఎదురుదాడులకు దిగుతుందని, ఇదే జరిగితే ఇరాన్ పట్ల ఇజ్రాయెల్ మరింత పదునైన వ్యూహంతో వెళ్లుతుందని , ఏకంగా అణ్వాయుధాల వాడకానికి కూడా వెనుకాడకపోవచ్చునని ఆందోళన వ్యక్తం అవుతోంది. హెజ్‌బొల్లా కూడా తక్కువ అంచనావేయడానికి స్థితిలో ఉంది. కీలక నేతలు , ఏ ప్రైవేటు సంస్థకు లేనన్ని అత్యధిక ఆయుధాలతో ఎటువంటి దాడులకు అయినా సిద్ధం అయ్యే యోధులతో బలం సంతరించుకుంది. తమ అధినేత నస్రల్లా హతంతో సంస్థ షాక్‌కు గురైంది. అయితే ఎదురుదాడికి పెద్ద ఎత్తున వ్యూహాలు రూపొందిస్తోందని, ఈ క్రమంలోనే ఇప్పుడు ఇజ్రాయెల్‌పై స్వల్పస్థాయిలో దాడులకు దిగుతోందని వెల్లడైంది. ఇకపై బీకర దాడులకు రంగం సిద్ధం చేసుకుంటుందని స్పష్టం అవుతోందని మీడియా తెలిపింది.

రంగంలోకి హెజ్‌బొల్లా షాడో యూనిట్
ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి తమకు తగిలిన షాక్‌నుంచి తేరుకుంటున్న హెజ్‌బొల్లా ఇప్పుడు తన రహస్య యుద్ధతంత్రానికి సిద్ధం అవుతోంది. ఇజ్రాయెల్, అమెరికా ఇతర దేశాలలో అత్యవసరం అయినప్పుడు రంగంలోకి దిగే విధంగా హెజ్‌బొల్లా అంతర్గతంగా ఓ యూనిట్‌ను సిద్ధం చేసుకుని ఉంచుకుందని వెల్లడైంది. ఈ యూనిట్‌ను బ్లాక్ యూనిట్ లేదా షాడో యూనిట్ అని పిలుస్తారని తేలింది. ఈ దళం తాము ఎంచుకునే ప్రాంతాల్లో మెరుపుదాడులకు దిగుతుందనే విషయాన్ని పసిగట్టిన ఇజ్రాయెల్ ఇప్పుడు తమ దేశ నగరాలలో పట్టణాలలో హై అలర్ట్ ప్రకటించింది. మరో వైపు లెబనాన్‌పై దాడుల క్రమాన్ని చైనా ఖండించింది. మరో దిక్కు ఇరాన్‌కు తద్వారా ఇతర శక్తులకు పరోక్ష సాయాన్ని అందించే దిశలో రష్యా సిద్ధం అవుతోందనే వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ శాంతి ఇప్పుడు మరోసారి పెను ముప్పు దశకు చేరిందని ఆందోళన వ్యక్తం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News