వాషింగ్టన్ : మనుష్యుల మాదిరిగానే విశ్వంలో మరోచోట ప్రత్యేకించి ఆకాశంలో వేరే జీవులు ఉన్నారా? గ్రహాంతరవాసి లేదా ఎలియన్స్ ఉనికి నిజమేనా అనేది తరాలుగా సాగుతున్న భూగోళ ఖగోళ అంశం అయింది. గ్రహాంతరవాసుల ఉనికి గురించి అమెరికా సైనిక దళ మాజీ పైలట్ అలెక్స్ కొలియర్ సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. తాను ఇద్దరు ముగ్గురు గ్రహాంతరజీవులతో మాట్లాడినట్లు, అంతేకాదు వారు తనను వారి ఎలైన్ మాతృనౌకలోకి ఆహ్వానించారని, ఇందులో మూడు నెలలు గడిపానని ఈ పైలట్ ఇప్పుడు తెలియచేశారు. సంబంధిత వార్తా కథనాన్ని ఎక్స్‌ప్రెస్ . కో. యుకె తాజాగా వెలువరించింది. మానవుడు ఇప్పుడు గ్రహాంతరజీవుల కోసం అన్వేషిస్తున్నారు. వీరికి త్వరలోనే అత్యంత ప్రాచీనమైన ఎలియన్స్ అవశేషాల జాడ దొరుకుతుందని తెలిపారు. తాను విసేయిస్, మోరోఅని పేర్లున్న గ్రహాంతర జీవులను కలిసినట్లు , వారు తనకు కన్పించడమే కాకుండా తనను వారి స్పేస్‌షిప్‌లోకి తీసుకువెళ్లారని వివరించారు. వారు సమకూర్చిన ఓ ప్రత్యేక బెల్టు సాయంతో తాను మాట్లాడినట్లు, వారి వైఖరిని, అభిప్రాయాలను మూడు నెలల పాటు తెలుసుకున్నానని తెలిపారు.
తనకు గ్రహాంతరవాసులతో జరిగిన ఎన్‌కౌంటర్ ఎప్పుడు జరిగిందనే విషయం గురించి మాట్లాడుతూ ఆయన రెండు సందర్బాలను ప్రస్తావించారు. తన చిన్నతనంలో తాతయ్య ఇంటి బయట పడుకున్నప్పుడు విచిత్రమైన అనుభూతికి లోనయ్యానని, లేచిచూస్తే తాను ఓ చీకటి గదిలో ఉన్నట్లు తేలిందని చెప్పారు. ఇది గ్రహాంతర జీవుల వ్యోమనౌక అయి ఉంటుందని, వారితో తాను మూడు నెలలు గడిపినట్లు భూమి సంబంధిత కాలంలో ఇది మూడు నెలలు అయినప్పటికీ భూమి కాలానికి సంబంధించిన వేరే కోణంలో చూస్తే 18నిమిషాల నిడివికి వస్తుందని తెలిపారు. ఈ క్రమంలో తాను వారితో మాట్లాడినప్పుడు తమ వంటి జీవులు ఉన్నారని చెప్పినట్లు పేర్కొన్నారు. విశ్వంలో మానవుడు ఒక్కడే కాడు, ఇతర గ్రహాంతర జీవులు తెగలుతెగలుగా ఉన్నారని వారు స్పష్టం చేసినట్లు ఈ పైలట్ తెలిపారు. విశ్వం విస్తారితం . ఇప్పుడిప్పుడే మనిషి అంతరిక్ష , ఖగోళ యాత్రకు బయలుదేరాడు. ఈ క్రమంలో ఎంతో దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఈ పయనం క్రమంలో మనిషికి ప్రతి చోటా అంతరిక్షంలో అనేకానేక వేరే జీవుల అవశేషాలు దొరుకుతాయి. దీనితో గ్రహాంతర జీవుల ఉనికి , పరిణామక్రమంపై స్పష్టత వస్తుందని తెలిపారు. అయితే తాను ఏ దశలో గ్రహాంతర వాసులతో కలిసిన విషయంపై ఆయన వివరణలో స్పష్టత లేదు.