ప్రజాస్వామ్యానికి ప్రాణదాతనని చెప్పుకొనే అమెరికాలో మానవీయత, శాంతి కాముకతలు నేతిబీరలో నెయ్యివంటివేనని మరోసారి రుజువైంది. తన రాజకీయ స్వప్రయోజనాల ముందు మిగతావేవీ దానికి పట్టవని కూడా ఇంకోసారి స్పష్టపడింది. పసిపిల్లల ప్రాణార్తనాదాలు, ముష్కర బలాల దాడులకు నిత్యం నిస్సహాయంగా బలైపోతున్న ఒక ప్రాంతం అంతులేని విషాద ఘోష అమెరికాకు చెవికెక్కవనే చేదు వాస్తవం కళ్ళకు కడుతున్నది. ఇజ్రాయెల్‌కు హమాస్ సంస్థకు గాజాలో సాగుతున్న యుద్ధంలో తక్షణ మానవతాయుత కాల్పుల విరమణను పాటించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రతిపాదించిన తీర్మానాన్ని వీటో అస్త్రం ద్వారా అమెరికా నిర్వీర్యం చేసిందన్న సమాచారం అత్యంత ఆందోళనకరమైనది. రెండు మాసాలుగా సాగుతున్న ఈ యుద్ధం ప్రపంచ శాంతికి ప్రమాదకరంగా మారుతున్నదని హెచ్చరిస్తూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు.
అత్యంత మానవ విషాదాన్ని అరికట్టడానికి సమితి అరుదుగా ప్రయోగించే నిబంధన కింద ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. 15 మంది సభ్యులు గల భద్రతా మండలిలో తీర్మానానికి అనుకూలంగా 13 మంది ఓటు వేశారు. బ్రిటన్ గైర్హాజరైంది. అమెరికా ఒక్కటే వీటోను ప్రయోగించి తీర్మానం అమలుకు నోచుకోకుండా చేసింది. ఈ తీర్మానం అమలైతే హమాస్‌కే మేలు జరుగుతుందనే వితండవాదదను అమెరికా, ఇజ్రాయెల్‌లు చేస్తున్నాయి. వారి దృష్టిలో హమాస్ ఒక ఉగ్రవాద సంస్థ. అటువంటప్పుడు దాని స్థావరాలెక్కడున్నాయో గుర్తించి దాడులు జరపాలే గాని మొత్తం గాజా ప్రాంతంపై బాంబుల వర్షం కురిపించి వరుస కాల్పులు జరిపించడంలోని ఔచిత్యం ఏమిటి? గాజాను తగులబెట్టి అక్కడి పిల్లాదికుటుంబాలను హతమార్చడంలోని నీతి ఏమనుకోవాలి? ఇజ్రాయెల్ సేనల దాడుల్లో ఇప్పటి వరకు గాజాలోని దాదాపు 20 వేల మంది అమాయక జనం మృతి చెందినట్టు వార్తలు చెబుతున్నాయి.
వారిలో అత్యధికులు మహిళలు, పిల్లలే. ఈ మారణకాండ ఇప్పట్లో ఆగదని అర్థమవుతున్నది. గాజా వాసులకు మానవతా సహాయం అందేలా చేయడానికి తన వంతు కృషి తాను చేస్తున్నానని అటువంటప్పుడు భద్రతా మండలిలో తీర్మానాన్ని ఆమోదించడం సమంజసం కాదని ఐక్యరాజ్య సమితిలోని అమెరికా డిప్యూటీ రాయబారి రాబర్ట్ ఉడ్ సెలవిచ్చారు. ఐక్యరాజ్యసమితిని ఉత్సవ విగ్రహం చేయడమే తన ఉద్దేశమని అమెరికా పదే పదే చాటుతున్నది. గాజాలో ఏదైనా మానవీయమైన మార్పు చోటు చేసుకొంటే అది తన వల్లనే జరగాలి తప్ప ఆ ఖ్యాతి సమితికి చెందకూడదనేది దాని ఆంతర్యంగా బోధపడుతున్నది. పోనీ అదైనా సత్వరమే జరగాలి కదా, ఇంకెన్ని వేల మంది హతమైన తర్వాత అమెరికా మేలుకొని గాజాలో శాంతిని నెలకొల్పుతుంది? తాను చేయదు, ఇంకొకరిని చేయనివ్వదు. ఇజ్రాయెల్ పాలకుడు నెతనాహు రక్త దాహం తీరే వరకు గాజా ఈ దాడులను భరించాలని అమెరికా కోరుకొంటోంది.
గత అక్టోబర్ 7న హమాస్ బాంబులు, గ్రనేడ్లతో ఇజ్రాయెల్‌పై జరిపిన దాడిలో 1700 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ సమయంలో హమాస్ కొంత మంది ఇజ్రాయెలీలను బందీలుగా తీసుకు వెళ్ళింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రారంభించిన ప్రతీకార దాడుల్లో గాజాలో సాధారణ జనం బలైపోడం మొదలైంది. ఖతార్, ఈజిప్టు చొరవతో అమెరికా అయిష్టంగానే సాధించిన యుద్ధ విరామం గట్టిగా వారం రోజులు సాగిందో లేదో తిరిగి ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. ఈ మొత్తం దారుణంలో నెపం హమాస్ మీద పెట్టి గాజా నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా ఖాళీ చేయించే కుట్ర సాగుతున్నది. 1967లో జరిగిన వారం రోజుల యుద్ధంలో తూర్పు జెరూసలెం సహా జోర్డాన్ నది పశ్చిమ తీరం, గాజా ప్రాంతం ఇజ్రాయెల్ స్వాధీనమైపోయాయి. ఈ రెండు ప్రాంతాల్లోని పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దయాదాక్షిణ్యాల మీదనే బతుకుతున్నారు. వారికి గుర్తింపు పొందిన సొంత భూభాగమంటూ లేదు.
ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాలు రెండూ ఇరుగుపొరుగున శాంతియుత సహజీవనం సాగించేలా ఏర్పాటు జరగాలనే ప్రతిపాదన వున్నప్పటికీ అందుకు అమెరికా సహకరించడం లేదు. ఏదో నెపం చూపి పాలస్తీనియన్లను రాచిరంపాన పెట్టడమే పనిగా ఇజ్రాయెల్ పాలకులు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హమాస్ అవతరించి గాజా భూభాగంలోని పాలస్తీనియన్ల మద్దతును పొందుతున్నది. అమెరికాలో అధికారంలోకి ఎవరు వచ్చినా అక్కడి యూదు ఓట్ల పరంగానూ, అరబ్ దేశాలను అణచి వుంచే దుర్మార్గం కోసం, అంతర్జాతీయ రాజకీయాల్లో పైచేయి కోసం వారు స్వతంత్ర పాలస్తీనా వ్యతిరేక వైఖరినే తీసుకొంటూ ఇజ్రాయెల్ కోరలను పదును పెడుతున్నారు.