Monday, March 10, 2025

అటు ఇటు సుంకాలు తగ్గుతాయా?

- Advertisement -
- Advertisement -

ఏప్రిల్ 2 నుంచి భారత్‌పై అమెరికా విధిస్తున్న భారీ సుంకాల భారాన్ని తగ్గించుకోడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికాపై సుంకాల తగ్గింపునకు భారత్ అంగీకరించిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడం చెప్పుకోదగిన పరిణామం. అమెరికా ఉత్పత్తులు భారత్‌లో విక్రయించడానికి వీలు లేనంత భారంగా ఉన్నాయని తప్పుపట్టడంతో సుంకాలను తగ్గించడానికి భారత్ అంగీకరించిందని ట్రంప్ వివరించారు. ఈ సుంకాల తగ్గింపు ఏయే దిగుమతులపై ఉంటుందో ఇంకా వివరాలు బయటపడలేదు. గత వారం రోజులుగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వాషింగ్టన్ డీసీలో మకాం పెట్టి అమెరికా వాణిజ్య అధికార వర్గాలతో చర్చలు జరుపుతున్నారు.

గురువారం బహుళ వాణిజ్య ద్వైపాక్షిక ఒప్పందాన్ని అమెరికా ముందుకు తీసుకువచ్చారు. ఈ ఒప్పందం సంగతి ఎలా ఉన్నా భారీ స్థాయిలో వాణిజ్య లావాదేవీలు జరగాలని, ఆ మేరకు అమెరికా దిగుమతులపై భారత్ భారీ సుంకాల విధింపు బాగా తగ్గాలని అమెరికా కాంక్షిస్తోంది. ఉత్పత్తుల వారీగా కాకుండా అన్నిటితోపాటు వ్యవసాయ ఉత్పత్తులను కూడా చేర్చాలని అమెరికా షరతు పెట్టడం భారత్‌కు అగ్నిపరీక్షే. వ్యవసాయ ఉత్పత్తుల సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపు కల్పించినా స్వదేశీ వ్యవసాయదారులకు నష్టాలే తప్ప ప్రయోజనం ఉండబోదని భారత్ తర్జనభర్జన పడుతోంది. అమెరికాకు మనం ఎగుమతి చేస్తున్న వ్యవసాయ ఉత్పత్తులపై దాదాపు 37.66 శాతం వరకు సుంకాలు విధిస్తున్నాం.

అదే అమెరికా నుంచి మన దేశానికి దిగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులపై కేవలం 2.59 శాతం మాత్రమే అమెరికా సుంకం విధిస్తోంది. ఈ తేడా 32 శాతం వరకు ఉండడం అమెరికాకు అసంతృప్తి కలిగిస్తోంది. అందుకనే వ్యవసాయ ఉత్పత్తులపై భారీగా సుంకాలు తగ్గించాలని అమెరికా పట్టుబడుతోంది. 2022లో భారత్ ఉత్పత్తులపై అమెరికా సుంకాల విధింపు 3.83 శాతం వరకు ఉండగా, అదే సమయంలో భారత్ 15.3 శాతం సుంకాలను విధించడం గమనార్హం. లగ్జరీ కార్లు, కెమికల్స్, ఎలక్ట్రానిక్స్‌పై 125 శాతం, మద్యంపై 150 శాతం భారత్ సుంకాలు విధిస్తోంది. అందుకనే భారత్ టారిఫ్ కింగ్, బిగ్ అబ్యూజర్ అని ట్రంప్ పదేపదే భారత్‌పై నిందారోపణలు చేయడం తెలిసిందే.

భారత్‌లో అమెరికా వాణిజ్య లోటు 100 బిలియన్ డాలర్ల (రూ. 8.70 లక్షల కోట్లు) వరకు ఉందని, ఈ లోటును తగ్గించాల్సిందేనని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ కార్ల దిగుమతిపై 110% సుంకాలు విధిస్తోంది. ప్రపంచం లోనే కార్లపై అత్యధిక సుంకాలు విధించే దేశంగా భారత్‌ను టెస్లా అధినేత ఎలాన్‌మస్క్ తీవ్రంగా ధ్వజమెత్తారు కూడా.ఇప్పుడు మస్క్ సంస్థను సుంకాలు లేకుండా భారత్‌లో ప్రవేశపెట్టడానికి, అమెరికా నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను పూర్తిగా తొలగించేలా చర్చలు జరుగుతున్నాయి. ఈ విధమైన భారం అమెరికాకు భారత్ నుంచి ఉండరాదని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ స్పష్టం చేస్తున్నారు. అప్పుడే భారత్ అమెరికా సంబంధాలు బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికా నుంచి భారత్‌కు కొన్ని ఆంక్షలు ఎదురయ్యాయి.

ఆయుధాల కోసం రష్యాపై ఆధారపడకూడదు. దీనికి ప్రత్యామ్నాయంగా అధునాతన అమెరికన్ రక్షణ వ్యవస్థలు భారత్‌కు సమకూరుతాయి. డాలర్‌కు బదులుగా కొత్త కరెన్సీని చెలామణి లోకి తీసుకురాడానికి బ్రిక్స్ ప్రయత్నించరాదు. ఈ ఆంక్షల నేపథ్యంలో అమెరికాపై సుంకాల తగ్గింపునకు భారత్ అంగీకరించడం అమలులోకి వస్తే అమెరికా ప్రతీకార సుంకాల విధింపులో కాస్త వెనక్కు తగ్గుతుందని భారత్ భావిస్తోంది. ప్రత్యేకంగా స్టీల్, అల్యూమినియంపై 25 శాతం ప్రతీకార సుంకం మార్చి 12 నుంచి అమలవుతుందని అమెరికా ప్రకటించింది. ఇందులో ఎంతవరకు వెసులుబాటు లభిస్తుందో గమనించాలి. అమెరికాపై విధిస్తున్న సుంకాల తగ్గింపునకు భారత్ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.

భారత్‌లో అనేక వస్తువులు ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోలు, బైక్‌లపై సుంకాలు తగ్గిస్తే భారత పారిశ్రామిక రంగంపై అంతగా ప్రభావం ఉండదని చెబుతున్నారు. ఏయే వస్తు ఉత్పత్తులపై సుంకాలు తగ్గించవచ్చునో వాటిని గుర్తించడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఇటీవలి బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ దిగుమతులపై ప్రకటించిన 15 16 శాతం సుంకాల నుంచి అమెరికాను మినహాయించడానికి సిద్ధమైంది. అదే విధంగా వైద్య పరికరాలు, లగ్జరీ మోటార్ సైకిళ్లు వంటి అనేక అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించే చర్యలు చేపట్టింది. అమెరికాకు అతిపెద్ద ఎగుమతిదారుల్లో భారత్ ఒకటి. 2024లో అమెరికాకు 87.4 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేసింది.

అదే సమయంలోఅమెరికా నుంచి 41.8 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను మాత్రమే భారత్ దిగుమతి చేసుకుంది. ఈ వాణిజ్య లోటుపైనే ట్రంప్ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో గతనెల భారత ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయినప్పుడు వాణిజ్య లోటును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా నుంచి రక్షణ, చమురు తదితర ఉత్పత్తుల దిగుమతులను భారీగా పెంచేందుకు అంగీకారం కుదిరింది కూడా. సుంకాల విషయంలో దిద్దుబాటు చర్యలేవీ తీసుకోకుంటే 25 బిలియన్ డాలర్ల విలువైన భారత్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడవచ్చు. అయితే మన జిడిపిలో అమెరికా ఎగుమతుల వాటా కేవలం 2.2 శాతమే కాబట్టి భారత్ అంతగా భయపడనక్కర లేదని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News