Sunday, March 30, 2025

2వేల వీసా దరఖాస్తులు రద్దు

- Advertisement -
- Advertisement -

మోసాల కారణంగా భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం 2 వేలకు పైగా వీసా దరఖాస్తులను రద్దు చేసింది. అపాయింట్ మెంట్ ల విషయంలో అక్రమాలు, ప్రధానంగా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి ఆ దరఖాస్తులను సస్పెండ్ చేసినట్లు బుధవారంనాడు తెలిపారు.ఏజెంట్లు, దళారీలు చేసిన సుమారు 2 వేల వీసా అపాయింట్ మెంట్ లను భారతదేశంలోని అమెరికా కాన్సలేట్ ల అధికారులు రద్దుచేశారని యుఎస్ పేర్కొంది. అమెరికా విధానాలను, నిబంధనలను ఉల్లంఘించే ఏజెంట్లు, మధ్యవర్తుల విషయంలోనిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామని అమెరికా రాయబార కార్యాలయం ఒక పోస్ట్ లో తెలిపింది. అమెరికా కాన్సలేట్ లు తీసుకున్న నిర్ణయాలు తక్షణం అమలులోకి వస్తాయని, ఆ అపాయింట్ మెంట్ లను రద్దు చేస్తున్నామని రాయబారకార్యాలయం తెలిపింది.వ్యాపారం, టూరిజానికి సంబంధించిన బి1, బి2 వీసాలకు సంబంధించిన దరఖాస్తులు ఈ మధ్య కాలంలో చాలా వరకూ పెండింగ్ లో ఉన్నాయి.

2022-2023 నుంచీ వాణిజ్య పరమైన, టూరిజానికి సంబంధించిన వీసాల కోసం నిరీక్షించే గడువు 800 నుంచి 1000 రోజులు అంటే దాదాపు మూడేళ్ల వరకూ ఉంటోంది.వీసాల జారీ విషయంలో జరుగుతున్న జాప్యంపై 2022లోనే విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కు భారత ఆందోళనను వివరించారు. అప్పట్లో ఆయన వీసాల జారీలో జాప్యానికి కోవిడ్ -19 ను సాకుగా చూపారు. ఈ జనవరిలో ట్రంప్ రెండో సారి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా జైశంకర్ వీసాల జారీలో జాప్యంపై అమెరికా అధికారులను సంప్రదించారు. బిజినెస్, టూరిస్ట్ వీసాలే కాదు. స్టూడెంట్ వీసా దరఖాస్తుల తిరస్కరణలు కూడా పెరిగాయి. అమెరికా ఆర్థిక సంవత్సరం 2023 అక్టోబర్ -2024 నవంబర్ మధ్య అమెరికాలో విద్యాభ్యాసం కోసం ఎఫ్ -1 వీసాల కోసం 6లక్షల 79 వేల మంది భారతీయ విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే, 2 లక్షల 79 వేల అప్లికేషన్లను తిరస్కరించారు. అంటే 41 శాతం దరఖాస్తులను తిరస్కరించారన్న మాట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News