Wednesday, January 22, 2025

యెమెన్‌పై కొనసాగుతున్న క్షిపణుల దాడులు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలతో అట్టుడుకుతున్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్న హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి.యెమెన్‌లోని హౌతీల స్థావరంపై అమెరికా శనివారం మరోసారి దాడులు జరిపింది. కాగా యెమెన్ రాజధాని సనాలో భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లోని యెమెన్ తీర ప్రాంతాల వైపు రావొద్దని అమెరికన్ జెండాలతో ఉన్న వాణిజ్య నౌకలను నేవీ శుక్రవారం రాత్రి హెచ్చరించింది. మరో 72 గంటలపాటు ఆ మార్గంలో వెళ్లొద్దని అమెరికా నేవీ సూచించింది.

ఆ తర్వాత కొద్ది గంటలకే యెమెన్‌లోని హౌతీ కేంద్రంపై క్షిపణి దాడి జరిగింది. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ‘ హౌతీలు మరిన్ని భీకర దాడులను ఎదుర్కోవలసి ఉంటుంది’ అని హెచ్చరించారు. దీన్ని బట్టి ఎర్రసముద్రంలో ఉద్రిక్తతలు ఇప్పుడప్పుడే చల్లారే సూచనలు కనిపించడం లేదు. శుక్రవారం తెల్లవారుజామున యెమెన్‌లోని హౌతీ స్థావరాలపై అమెరికా, బ్రిటన్ సైన్యాలు ప్రతీకార దాడులు చేపట్టిన విషయం తెలిసింది. ఈ సాయుధ ముఠాకు చెందిన స్థావరాలను లక్షంగా చేసుకుని క్షిపణుల వర్షం కురిపించాయి. రాజధాని సనా సహా 28 ప్రాంతాల్లోని 60కి పైగా లక్షాలను ధ్వంసం చేశాయి.ఈ దాడులు ఆందోళనలకు దారి తీశాయి. అమెరికా, బ్రిటన్ దాడులను నిరసిస్తూ సనా ప్రాంతంలో హౌతీ మద్దతుదారులు నిరసనలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News