వాషింగ్టన్ : భారత్‌పై విధించిన ప్రయాణ ఆంక్షలను అమెరికా కాస్త వెసులుబాటు చేసింది. ప్రయాణ సూచనల అత్యున్నత 4 వ స్థాయి నుంచి 3 స్థాయికి తగ్గించింది. 4 వ స్థాయి అంటే ప్రయాణాలు చేయరాదని అర్థం. 3 వ స్థాయి అంటే ప్రయాణికులు తిరిగి ఆలోచించుకుని తగిన నిబంధనలతో ప్రయాణించ వచ్చని అర్థం. భారత్‌లో కొవిడ్ కేసులు, మరణాలు తగ్గడమే దీనికి కారణం. అలాగే పాకిస్థాన్‌పై విధించిన 4 వ స్థాయి ఆంక్షలను 3 వ స్థాయికి తగ్గించింది.
ఈమేరకు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) 3 వ స్థాయి ట్రావెల్ హెల్త్ నోటీసు సోమవారం భారత్‌కు జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణానికి ప్లాను చేసే ముందు వ్యాక్సినేషన్‌కు సంబంధించి సిడిసి సిఫార్సులను సమీక్షించుకోవాలని సూచించింది. భారత్‌కు వెళ్ల నున్న ప్రయాణికులు కొవిడ్ కారణంగా పునస్సమీక్షించుకోవాలని అలాగే నేరాలు, ఉగ్రవాదం పెరుగుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిడిసి హెచ్చరించింది. గత మే నెలలో భారత్‌ను అమెరికా నాలుగో కేటగిరీ ట్రావెల్‌లో ఉంచింది. ఇప్పుడు ఆ కేటగిరీ స్థానంలో మూడో కేటగిరిని చేర్చింది.
US eases travel restrictions on India