Thursday, December 19, 2024

అమెరికా వీసా అపాయింట్‌మెంట్లలో కొత్త నిబంధనలు

- Advertisement -
- Advertisement -

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు అగ్రరాజ్యం మరో శుభవార్త చెప్పింది. వీసా ఇంటర్వూ అపాయింట్‌మెంట్ కోసం నెలల తరబడి నిరీక్షించే పరిస్థితిని తగ్గించేందుకు వీలుగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం షెడ్యూలింగ్, రీషెడ్యూలింగ్‌లో కొత్త నిబంధనలు తీసకొస్తోంది. ఇకపై ఎలాంటి అదనపు ఫీజు లేకుండా ఒకసారి అపాయింట్‌మెంట్ ను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పించనుంది. జనవరి 1,2025 అంటే నూతన సంవత్సరం నుంచి ఈ కొత్త రూల్స్‌ను అమలు చేయనున్నట్టు భారత్ లోని అమెరికా దౌత్య కార్యాలయం వెల్లడించింది. ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా వీసా ఇంటర్వూ అపాయింట్‌మెంట్లు కల్పించాలి. వెయిటింగ్ సమయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తున్నాం. జనవరి 1,2025 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు మీకు నచ్చిన లొకేషన్‌లో ఇంటర్వూ అపాయింట్‌మెంట్ కు తొలి షెడ్యూల్ చేసుకోవచ్చు.

ఒకవేళ ఏ కారణం చేతనైనా, మీరు రీషెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఒకసారి షెడ్యూల్‌ను మార్చుకోవచ్చు. ఆ తర్వాత ఒకవేళ మీరు అపాయింట్‌మెంట్‌ను మిస్ అయినా, లేదా రెండవసారి రీషెడ్యూల్ చేసుకోవాలనుకున్నా కొత్త అపాయింట్‌మెంట్ కింద బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు మళ్లీ అప్లికేషన్ రుసుము చెల్లించాలి ” అని ఎంబసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అపాయింట్‌మెంట్ ప్రక్రియను సులభతరం, వేగవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు దౌత్య కార్యాలయం తెలియజేసింది. దరఖాస్తుదారులు షెడ్యూల్ చేసుకున్న సమయంలో ఇంటర్వూలకు హాజరవ్వాలని సూచించింది. గత కొంతకాలంగా భారతీయులు అమెరికా వీసా అపాయింట్ మెంట్ల కోసం నెలల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీ1/బీ2 విజిటర్ వీసా కోసం ఇంటర్వూ అపాయింట్‌మెంట్ కావాలంటే ముంబైలో 438 రోజులు ఎదురు చూడాలి.

హైదరాబాద్‌లో అయితే ఈ సమయం 429 రోజులుగా ఉంది. ఇక స్టూడెంట్ వీసా అపాయింట్‌మెంట్‌కైతే హైదరాబాద్‌లో 115 రోజులు వేచి చూడాలి. ఇదిలా ఉండగా ఇప్పటికే హెచ్1బి వీసా నిబంధనలను అమెరికా సరళతరం చేసింది. ఎఫ్1 విద్యార్థి వీసాలను సులభంగా హెచ్1 బి వీసాలుగా మార్చుకునే వెసులుబాటునూ కల్పించింది. దీంతో గతం లోనే హెచ్1బి వీసా కోసం ఆమోదం పొందిన వారి దరఖాస్తులిక వేగంగా ప్రాసెస్ అవుతాయి. ఈ నిబంధనలు జనవరి 17 నుంచి అమలులోకి రానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News