ఉన్నత చదువుకు చలో అమెరికా
భారతీయ విద్యార్థులకు 82000 వీసాలు
ఈ వేసవిలో రికార్డు స్థాయిలో జారీ
విదేశీ విద్యార్థుల్లో ఇండియన్లు 20 శాతం
యుఎస్ ఎంబసీ అధికార ప్రతినిధి వెల్లడి
న్యూఢిల్లీ /న్యూయార్క్: విద్యార్థులకు వీసాల జారీలో అమెరికా ఈసారి భారతదేశానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది. ఈ ఏడాది వేసవిలో 82000 మంది భారతీయ విద్యార్థులకు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి వీసాలు మంజూరు చేసినట్లు అమెరికా ఎంబసీ వర్గాలు గురువారం తెలిపాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఈ సంఖ్యలో వీసాలను భారతదేశానికి మంజూరు చేయడం రికార్డుగా మారింది. ఏ ఇతర దేశానికి భారత్ మాదిరిగా ప్రాధాన్యతను ఇవ్వలేదని అమెరికా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి పాట్రిసియా లాసినా వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతానికి, అంతర్జాతీయ భాగస్వామ్యానికి భారతీయ ప్రతిభావంతులైన విద్యార్థుల అవసరం ఎంతైనా ఉందని, ఈ క్రమంలో వారిని ప్రోత్సహించేందుకు వీసాల సంఖ్యలో భారత్‌కు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు.
అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే ఇతర దేశాల విద్యార్థులలో భారతదేశానికి చెందిన వారు 20 శాతంగా నమోదు అవుతూ వస్తున్నారు. ఈ సారి ఈ వేసవిలోనే అత్యధిక వీసాలను భారతీయ విద్యార్థులకు వచ్చేలా చేయడం వీరిలో అత్యధికులు ఇప్పటికే అమెరికాలో ఉన్నత విద్యాకోర్సులలో చేరడం జరిగిందని లాసినా తెలిపారు. ఢిల్లీలోని అమెరికా ఎంబస్సీ, చెన్నై, హైదరాబాద్, కొల్‌కతా, ముంబైలలోని నాలుగు అమెరికా కాన్సూలేట్స్ ద్వారా వెలువరించిన వీసాలలో విద్యార్థుల వీసా దరఖాస్తులకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ ఏడాది మే నెల నుంచి ఆగస్టు వరకూ అత్యధిక సంఖ్యలో అర్హులైన విద్యార్థుల ఈ వీసా దరఖాస్తులను పరిశీలించడం స్టాంపింగ్ జరగడం వంటి ప్రక్రియలు జోరుగా సాగాయి. ఇంతకు ముందు మాదిరిగానే ఈసారి ఏడాది కూడా 20 శాతం విద్యార్థులు భారతదేశానికి చెందిన వారే అమెరికాలో ఉన్నత చదువుకు వచ్చారు. గత రెండు మూడేళ్లుగా కొవిడ్ మహమ్మారి, తదనంతర పరిణామంగా తలెత్తిన లాక్‌డౌన్లతో వీసాల ప్రక్రియ నిలిచింది.
ఇప్పుడు దీనిని వేగవంతం చేసిన క్రమంలో భారతీయ విద్యార్థులు అమెరికా మజిలీకి ఈ వీసాలతో చేరుకున్నారు. అత్యధిక సంఖ్యలో ఇక్కడి విద్యార్థులకు వీసాలు జారీ చేయడం తమకు ఆనందదాయకంగా మారిందని ఎంబస్సీ ప్రతినిధి తెలిపారు. కొవిడ్ దశలో అమెరికాలో పలు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాలకు అంతరాయాలు ఏర్పడ్డాయి. అయితే ఈ జాప్యం ఇప్పుడు తొలిగింది. అత్యధిక సంఖ్యలో భారతీయ కుటుంబాలు తమ పిల్లల ఉన్నత చదువులకు, ఆ తరువాత తగు ఉద్యోగాలకు అమెరికాను కేంద్రంగా ఎంచుకుంటున్నారు. దీనిని గుర్తించి భారతీయులకే వీసాల జారీలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడైంది. అమెరికాలో జీవితకాల బంధం నెలకొల్పుకునే దిశలో ఉన్న భారతీయుల వైఖరిని అంతర్జాతీయ ప్రగతి దిశలో ప్రత్యేకించి అమెరికా సర్వతోముఖాభివృద్ధి కోసం భారతీయులకు పెద్ద పీట వేస్తున్నారని స్పష్టం చేశారు. గడిచిన ఏడాది అంటే 202021లో 1,67,582 మంది భారతీయ విద్యార్థులు అమెరికాకు వెళ్లారని ఓపెన్ డోర్స్ నివేదిక తెలిపింది. ఇప్పుడు ఈ వేసవిలోనే 82వేల మంది భారతీయ విద్యార్థులకు ఈ వీసాలు రావడంతో మిగిలిన రెండు మూడు నెలల వ్యవధిలో ఇంతకు ముందటి ఏడాది రికార్డు స్థాయి వీసాలు అధిగమించడం జరుగుతుందని వెల్లడైంది.
US Embassy Issues Visas to 82k Indian Students