Sunday, April 13, 2025

ఉగ్ర తోడేళ్ల మారణ కాండ

- Advertisement -
- Advertisement -

భారతదేశ చరిత్రలో అతిపెద్ద, ఘోరమైన ఉగ్రదాడిగా, నెత్తుటి ఏరులను పారించే విషాద ఘట్టంగా గుర్తుండిపోయిన ముంబై ఉగ్రదాడులు జరిగి ఇప్పటికి పదిహేడేళ్లు కావస్తోంది. దాడుల సూత్రధారుల్లో ఒకరైన తహవ్వుర్ రాణాను ఎట్టకేలకు అమెరికా భారత్‌కు అప్పగించింది. మరో నేరస్థుడు డేవిడ్‌కోల్మన్‌హెగ్డే ఇంకా భారత్‌కు రావలసి ఉంది. తహవ్వుర్ రాణా అమెరికా నుంచి భారత్‌కు గురువారం చేరుకున్నాడు. చట్టం ముందు అతడిని నిలబెట్టేందుకు ఏళ్ల తరబడి నిరంతర సమష్టి ప్రయత్నాలు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ప్రకటించింది. మరో కీలక సూత్రధారి డేవిడ్ హెడ్లీని భారత ప్రభుత్వం ఎప్పుడు తీసుకువస్తుందన్న ప్రశ్న ఎదురవుతోంది. ముంబై దాడులకు ముందు కుట్రకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న డేవిడ్ కొల్మన్ హెడ్లీ ముంబైలో రెక్కీ నిర్వహించాడు.

అతడికి రాణా సహకరించినట్టు చెబుతున్నారు. అయితే హెడ్లీని అప్పగించడానికి అమెరికా సుముఖంగా లేదని తెలుస్తోంది. అందుకు కొన్ని చట్ట, దౌత్య, వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. భారత్, పాక్, డెన్మార్క్‌కు తనను అప్పగించవద్దని 2010లోనే అమెరికాతో హెడ్లీ ఒక ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. ముంబై దాడుల్లో ప్రమేయం, లష్కరే తొయిబా, పాకిస్తాన్ ఐఎస్‌ఐతో సంబంధాల గురించి హెడ్లీ అంగీకరించడంతో అమెరికా దర్యాప్తు సంస్థలకు అతను కీలకంగా మారినట్టు తెలుస్తోంది. 2016లో ముంబై ప్రత్యేక కోర్టు విచారణలో ఉగ్రదాడికి రాణా రెక్కీ నిర్వహించినట్టు బయటపెట్టడంతో రాణా వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది.

రాణా అప్పగింతపై యావద్భారత దేశం భావోద్వేగాలకు గురైంది. ఇది భారత్‌కు అతిపెద్ద దౌత్యవిజయంగా స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ దాడుల్లో అమరులైన సైనిక కుటుంబాలతో పాటు, బాధితురాలు, ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను గుర్తించడంలో కీలక సాక్షిగా ఉన్న దేవికా రోటావన్ భావోద్వేగానికి గురయ్యారు. దాడులు జరిగిన సమయంలో ఆమె వయస్సు పదేళ్లే. కసబ్‌ను చూపించినప్పుడు తనకెవరైనా తుపాకీ ఇస్తే కాల్చేద్దామని అనుకున్నానని ఆమె తీవ్రంగా స్పందించారు. రాణాను అప్పగించడం భారత్‌కు దౌత్యపరమైన విజయం మాత్రమే కాదని, సాధారణ ప్రజల ప్రతీకారం కూడా అని ఈ దాడుల్లో అమరుడైన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండ్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తండ్రి కె. ఉన్నికృష్ణన్ భావోద్వేగం వెలిబుచ్చారు. కేవలం రాణాను అప్పగించడంతో సంతృప్తి చెందలేమని, ఆ దాడుల్లో కీలక కుట్రదారుడైన డేవిడ్ కోల్మన్ హెడ్లీని కూడా తిరిగి భారత్‌కు తీసుకురావాలని సూచించారు.

తాజ్‌హోటల్‌లో ఉగ్రవాదుల చెరనుంచి బందీలను విడిపించే ఆపరేషన్‌కు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నాయకత్వం వహించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సందీప్ తన సహచరులు వారిస్తున్నా వినకుండా ఎదురెళ్లి వీరోచితంగా పోరాడి అమరులయ్యారు. ఆయన ధైర్యసాహసాలకు అత్యున్నత శౌర్యపురస్కారం అశోకచక్ర లభించింది. తన కుమారుడు సందీప్ ఉగ్రదాడి బాధితుడు కాడు. మరణాన్ని ఎదుర్కొంటూ కర్తవ్యాన్ని వీరోచితంగా నిర్వర్తించిన సాహససైనికుడు అని కె. ఉన్నికృష్ణన్ శ్లాఘించారు. ఉగ్రవాది కసబ్‌ను సజీవంగా పట్టుకున్న ఆనాటి పోలీస్ ఆఫీసర్ హేమంత్ భవదంకర్ దాడులకు పాల్పడిన నేరస్థులందరికీ ఉరిశిక్ష విధిస్తేనే న్యాయం చేసినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. ముంబై ఉగ్రదాడులు 2008 నవంబర్ 26న జరిగాయి. ఇప్పటికి 17 ఏళ్లు అవుతున్నాయి.

ఈ దాడిలో 18మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోగా, 308 మంది వరకు గాయపడ్డారు. దేశంలోని అత్యంత సురక్షితమైన ప్రదేశాల్లో ఒకటైన తాజ్‌మహల్ హోటల్‌ను లక్షంగా చేసుకుని ఉగ్రవాదులు మన భద్రతా వ్యవస్థను కూడా భగ్నం చేశారు. పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి 10 మంది ఉగ్రవాదులు బోటులో సముద్ర మార్గం ద్వారా ముంబైలో ప్రవేశించారు. భారత నావికాదళాన్ని తప్పించుకోడానికి దారిలో ఒక భారతీయ పడవను హైజాక్ చేసి అందులో ఉన్న వారందరినీ చంపేశారు. రాత్రి 8 గంటల సమయంలో కొలాబా సమీపంలోని చేపల మార్కెట్‌లో దిగారు. కొలాబా నుండి ఉగ్రవాదులు ఒక్కొక్కరు నాలుగు బృందాలుగా టాక్సీలను తీసుకొని వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వేస్టేషన్‌కు ఉగ్రవాదుల బృందం చేరుకుంది.

అందరి చేతుల్లో ఎకె 47 రైఫిల్స్ ఉండడంతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో ఉగ్రవాది అజ్మల్ కసబ్ కూడా ఉన్నాడు. భద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్నవారిని ఉరితీయడమైంది. ఆ రాత్రి ఉగ్రవాదులు ముంబైలోని పలు ప్రముఖ ప్రదేశాలను టార్గెట్ చేశారు. ముంబైలోని ప్రపంచస్థాయి హోటళ్లలో ఒకటైన తాజ్‌హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, నారిమన్ హౌస్‌లపై దాడులు జరిగాయి. షా ఆఫ్ ముంబై అని పిలవబడే తాజ్‌హోటల్‌ను ఉగ్రవాదులు పూర్తిగా ధ్వంసం చేశారు. మూడు రోజులుగా భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. పోలీస్‌లు, సైన్యం కార్యకలాపాలు కూడా విఫలమైనట్టు కనిపించడంతో ఎన్‌ఎస్‌జి కమాండోలు రంగంలోకి దిగి ఉగ్రవాదులందరినీ హతమార్చారు. వారి ధైర్యసాహసాలతో భారత దేశానికి ఎదురైన విపత్తు తప్పింది. ఉగ్రవాద దాడులకు అజామ్ ఛీమా కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. ఉగ్రవాదులకు అజామ్ శిక్షణ ఇచ్చినట్టు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాది కసబ్‌ను సజీవంగా పట్టుకున్నారు. కోర్టు ఉరి శిక్షవిధించడంతో 2012 నవంబర్ 21న పుణెలోని ఎరవాడ జైలులో ఉరి తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News