చండీగఢ్ : 119 మంది అక్రమ వలసదారులతో ఒక యుఎస్ విమానం శనివారం అమృత్‌సర్ విమానాశ్రయంలో దిగవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం క్రితం నెల బాధ్యతలు చేపట్టిన తరువాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించిన తరువాత అక్కడి నుంచి తిరిగి పంపుతున్న రెండవ బృందం అది. అధికార వర్గాల సమాచారం ప్రకారం, రెండవ విమానం శనివారం రాత్రి సుమారు 10 గంటలకు విమానాశ్రయంలో దిగవచ్చు. 119 మంది భారతీయ అక్రమ వలసదారుల్లో 67 మంది పంజాబ్‌కు, హర్యానాకు 33 మంది, గుజరాత్‌కు ఎనిమిది మంది, ఉత్తర ప్రదేశ్‌కు ముగ్గురు చెందిన వారు కాగా గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి ఇద్దరు వంతున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారని ఆ వర్గాలు తెలియజేశాయి.
అక్రమ వలసదారులతో మరొక యుఎస్ విమానం ఆదివారం దిగవచ్చు. 104 మంది అక్రమ భారతీయ వలసదారులతో ఒక యుఎస్ మిలిటరీ విమానం క్రితం వారం అమృత్‌సర్ విమానాశ్రయంలో దిగిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంటున్నది. పంజాబ్‌కు చెందిన తిరిగివచ్చిన అక్రమ వలసదారుల్లో చాలా మంది తమ కుటుంబాలకు మెరుగైన జీవితం అందించే లక్షంతో తాము యుఎస్‌కు వలస వెళ్లాలని అనుకున్నట్లు తెలియజేశారు. అయితే, తమను యుఎస్ సరిహద్దులో పట్టుకుని, సంకెళ్లు వేసి తిరిగి తీసుకురావడంతో తమ కలలు కల్లలయ్యాయని వారు వాపోయారు. డొనాల్డ్ ట్రంప్ యుఎస్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత యుఎస్ శాంతి భద్రతల సంస్థలు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపసాగాయి.
లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అమెరికాలోకి ప్రవేశించడానికి వలసదారులు ఉపయోగించే అక్రమ, ముప్పు కలిగించే మార్గంలో లేదా ఇతర అక్రమ మార్గాల ద్వారా యుఎస్‌లోకి ప్రవేశించిన పంజాబ్, కొన్ని ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మందిని ఇప్పుడు తిప్పిపంపబోతున్నారు. కాగా, అమృత్‌సర్‌లో యుఎస్ విమానం దిగడాన్ని పంజాబ్‌లో పలువురు రాజకీయ నాయకులు ప్రశ్నించారు. ‘బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌ను అపఖ్యాతి పాల్జేయాలని కోరుకుంటోంది. ఆ విమానం గుజరాత్‌లో లేదా హర్యానాలో లేదా ఢిల్లీలో దిగలేదు?’ అని పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రి హర్పాల్ సింగ్ చీమా గురువారం ఒక ప్రశ్నకు ఆ విధంగా సమాధానం ఇచ్చారు. యుఎస్‌నుంచి పంజాబ్‌కు చెందిన భారతీయ పౌరులను తిప్పిపంపిన నేపథ్యంలో మనుషుల అక్రమ రవాణా అంశాన్ని దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పంజాబ్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసింది.