ఇక అమెరికా వీసా మరింత భారం
హెచ్ 1బి వీసా దరఖాస్తు ధర 780 డాలర్లకు పెంపు
దరఖాస్తు ఫీజులను భారీగా పెంచాలని యుఎస్‌సిఐఎస్ నిర్ణయం
త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం
వాషింగ్టన్: అమెరికా వెళ్లాలనుకునే భారతీయుల కల ఇక మరింత భారం కానుంది. ఇమ్మిగ్రేషన్ ఫీజులను భారీగా పెంచుతూ బైడెన్ సర్కార్ ప్రతిపాదనలు చేసింది. దీంతో హెచ్ 1బి సహా పలు రకాల వీసా దరఖాస్తు ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఈ ప్రతిపాదనలను త్వరలోనే అమలులోకి తెచ్చే అవకాశం ఉంది. ఇమ్మిగ్రేషన్ ఫీజుల పెంపు ప్రతిపాదనలను అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యుఎస్‌సిఐఎస్) విభాగం బుధవారం తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. దాని ప్రకారం హెచ్1బి వీసా దరఖాస్తు ధరను 460 డాలర్లనుంచి 780 డాలర్లకు పెంచింది. ఎల్1 వీసా ధరను 460 డాలర్లనుంచి ఏకంగా 1,385 డాలర్లకు పెంచింది. అలాగే ఒ1వీసా ధరను 460 డాలర్లనుంచి 1,055 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించింది. ఇక హెచ్2 బి వీసా ధరనుకూడా 460 డాలర్లనుంచి 1,080 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను 60 రోజుల పాటు వెబ్‌సైట్‌లో ఉంచి ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తారు.
తర్వాత దీన్ని అమలు చేస్తారని తెలుస్తోంది. ఖర్చు భారాన్నితగ్గించుకోవడంలో భాగంగానే ఫీజుల ధరలను పెంచుతున్నట్లు యుఎస్‌సిఐఎస్ తెలిపింది. అంతేకాకుండా ఈ నిర్ణయంతో పెండింగ్ వీసాల సంఖ్య కూడా తగ్గుతుందని పేర్కొంది. ఈ ఏజన్సీకి 96 శాతం నిధులు వీసా దరఖాస్తు ఫీజుల రూపంలోనే లభిస్తాయి. 2020 లో కొవిడ్ కారణంగా వీసా దరఖాస్తులు భారీగా తగ్గాయి. దీంతో ఏజన్సీకి ఆదాయం 40 శాతానికి పైగా తగ్గిపోయింది. నిధుల లేమి కారణంగా ఏజన్సీలో నియామకాలను నిలిపివేవారు.సిబ్బందిని సైతంతగ్గించి వేశారు. దీంతో సెండింగ్ వీసాల సంఖ్య బాగా పెరిగిపోయింది. కాగా ఈ వీసా కేటగిరీల ఫీజులను పెంచడం వల్ల దేశంలోకి చట్టబద్ధంగా ఎక్కువ మంది వర్కర్లు రావాలన్న విధానకర్తల ఆకాంక్షలకు భిన్నంగా అలాంటి వారు రావడం తగ్గిపోతారనే విషయాన్ని ఆర్థికవేత్తలు గుర్తుంచుకోవాలని ఫోర్బ్ ఒక వార్తా కథనంలో పేర్కొంది.