Friday, December 20, 2024

చైనాకు అమెరికా టారిఫ్‌ల రిస్కు

- Advertisement -
- Advertisement -

చైనా తయారీ వస్తువులపై అమెరికా అత్యధికంగా టారిఫ్స్(సుంకాలు) విధించడంతో భారత్ వంటి ఇతర దేశాల మార్కెట్ల వైపు చైనా దృష్టి కేంద్రీకరిస్తుందని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. దీంతో భారత్ మార్కెట్లలోకి చైనా నుంచి వివిధ వస్తువుల డంపింగ్‌ఎక్కువవుతుందని దేశంలోని పారిశ్రామిక ఉత్పత్తి దారులు ఆందోళన చెందుతున్నారు. చైనా తయారు చేసే సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, లిథియమ్ ఐయాన్ బ్యాటరీలు, సిరంజీలు, స్టీల్ వస్తువుల దిగుమతులపై అమెరికా భారీగా సుంకాలు విధించింది. సెప్టెంబర్ 27 నుంచి ఈ టారిఫ్ విధింపు అమలులోకి వచ్చింది. ఈ పరిస్థితి భారత మార్కెట్లకు సవాలుగా మారుతుంది. చైనాతో ఏయే వస్తువుల విషయంలో మార్కెట్‌తో తీవ్రంగా పోటీపడవలసి వస్తోందో ఆయా తయారీ వస్తువులతోనే ఇప్పుడు భారత్ గట్టిగా పోటీపడక తప్పదు.

ఈ పరిస్థితుల్లో మన కేంద్ర ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖ కూడా చైనా డంపింగ్‌ను నివారించడానికి బేసిక్ కస్టమ్స్ డ్యూటీని వంద శాతం పెంచాలని ఆకాంక్షిస్తోంది. దీని వల్ల ప్రస్తుత కస్టమ్స్ డ్యూటీ 7.5% నుంచి 15 శాతానికి పెరుగుతుంది. చైనా నుంచి నౌకల ద్వారా భారత్‌కు అయ్యే దిగుమతుల్లో 33% స్టీల్ వస్తువులేనని ఉక్కు మంత్రిత్వశాఖ తన సమీక్షలో నిర్ధారించింది. అమెరికా వంటి ఐరోపా యూనియన్ దేశాల్లో ఏ విధంగా చైనా వస్తువులపై టారిఫ్‌లు విధించారో మన దేశంలో కూడా ఆ విధానాన్నే అమలులోకి తీసుకురావాలని ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఉక్కు మంత్రిత్వశాఖ సిఫారసు చేసింది. చైనా నుంచి స్టీల్ అత్యధికంగా డంపింగ్ అవుతోందని ఉక్కు మంత్రిత్వశాఖ మొట్టమొదటిసారి గుర్తించింది. ఈ డంపింగ్ వల్ల స్వదేశీ పరిశ్రమలు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటాయని పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందడంతో ప్రభుత్వం టారిఫ్‌లను అత్యధికంగా చైనా వస్తువులపై విధించడానికి సన్నద్ధమవుతోంది. చైనా చవకగా ఉత్పత్తులను భారత్ మార్కెట్‌కు డంపింగ్ చేయడం గత కొన్నేళ్లుగా పరిపాటిగా వస్తోంది.

ఇప్పుడు అమెరికా టారిఫ్‌ల భారంతో డంపింగ్ ఇంకా ఎక్కువ కావచ్చు. ఈ పరిస్థితుల్లో చైనా నుంచి భారీగా డంపింగ్ అయ్యే ఉత్పత్తులను రోజువారీ పర్యవేక్షించడానికి వాణిజ్య విభాగంలో ‘వార్ రూమ్’ను ఏర్పాటు చేయడం అవసరమని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చి ఇనీషియేటివ్ సంస్థాపకులు అజయ్ శ్రీ వాస్తవ సూచించారు. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సందర్భంగా బైడెన్ ప్రభుత్వం చైనా ఉత్పత్తులపై బిలియన్ల డాలర్ల టారిఫ్‌లను విధించింది. ఈ టారిఫ్‌ల భారం 7.5% నుంచి 100% స్థాయికి అమాంతంగా పెరిగిపోయింది. అయితే చైనా లేదా మరే దేశం నుంచైనా ఉత్పత్తుల డంపింగ్‌ను నియంత్రించడానికి మన దేశంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డిజిటిఆర్)వ్యవస్థ ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా తమ వస్తువులను డంపింగ్ చేయాలనుకుంటే దీన్ని పరిశీలించడానికి వ్యవస్థాపరమైన యంత్రాంగం ఉందని తెలిపారు. చైనా ఇప్పటికే స్టీల్‌ను భారత్‌కు అత్యధికంగా డంపింగ్ చేస్తోందని, ఇప్పుడు అమెరికా టారిఫ్‌ల ప్రభావంతో ఈ డంపింగ్ మరింత అత్యధిక స్థాయిలో జరగవచ్చని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ అలోక్ సహాయ్ పేర్కొన్నారు. గత ఏడాది చైనా నుంచి భారత్‌కు స్టీల్ ఉత్పత్తుల దిగుమతులు 91% వరకు పెరిగాయి. అదే విధమైన ట్రెండ్ ఈ ఏడాది కూడా కొనసాగుతుందని అలోక్ సహాయ్ సూచించారు.

ఈ ఏడాది స్టీల్‌ను వినియోగించే దేశాలన్నీ చైనా స్టీల్‌కు ఆంక్షలు విధించాయి. భారత్ వంటి కొన్ని దేశాల్లో మాత్రం అలాంటి ఆంక్షలు అంతగా లేవు. అందుకనే భారత్‌కు ఎగుమతులపై ఎక్కువగా చైనా దృష్టి కేంద్రీకరిస్తోంది. భారత్ లో యాంటీ డంపింగ్ డ్యూటీ విధించడం అన్నది సుదీర్ఘ కాల ప్రక్రియ. ఇదే విషయమై వాణిజ్య ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. గత ఆగస్టు డేటా ప్రకారం చైనాకు భారత్ నుంచి ఎగుమతులు 22.4 శాతం వరకు అంటే 1 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు తగ్గిపోగా, చైనా నుంచి దిగుమతులు మాత్రం 15.5 శాతం అంటే 10.8 బిలియన్ డాలర్ల వరకు పెరిగాయని డేటా వెల్లడించింది. దీన్ని బట్టి చైనాపై భారత్ ఆధారపడడం కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. ఎలెక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్‌పై టారిఫ్‌లు అమెరికా పెంచడం భారత్ వంటి దేశాలకు ఏ మాత్రం ప్రయోజనం కలగదని సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ రీసెర్చి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డి.ధనురాజ్ అభిప్రాయం వెలిబుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News