న్యూఢిల్లీ : ప్రపంచ శక్తిగా పెరుగుతున్న భారత్ జి20 సదస్సుకు అధ్యక్షత వహించడం సరైన గుర్తుంపు అని, దీని పర్యవసానంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్య దేశంగా ఉండవలసిన ఆవశ్యకత ఉందని భారత సంతతికి చెందిన అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంట్ )సభ్యుడు రో ఖన్నా పేర్కొన్నారు. భారత్‌లో పర్యటన సందర్భంగా ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ రష్యాతో భారత్‌కు గల చారిత్రక సంబంధాన్ని పరిగణన లోకి తీసుకొని ఉక్రెయిన్‌లో కేవలం శాంతిని పునరుద్ధరించడంలో భారత్ సహాయక పాత్ర వహించగలదని ఆయన సూచించారు.
భారత్‌తో సరిహద్దుల భద్రతను చైనా గౌరవించాలని , ఈ విషయంలో భద్రతాపరంగా భారత్ ఏవైనా సవాళ్లను ఎదుర్కొంటే అమెరికా గట్టిగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. భారత సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని, అందుకే భారత సరిహద్దును చైనా గౌరవించాలని సూచించారు. భారత్ అమెరికా సంబంధాలు చాలా పటిష్టంగా ఉండడమే కాక, రక్షణ, ఆర్థిక , సాంకేతిక రంగాల్లోనూ , వాతావరణ పరిరక్షణ లోనూ ఈ సంబంధాలు విస్తృతమయ్యాయని పేర్కొన్నారు.