నవంబర్ 8నుంచి అమలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా తమ దేశానికి వచ్చే విదేశీయులకు తీపి కబురు అందించింది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను అమెరికా తాజాగా ఎత్తివేసింది. నవంబర్ 8నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని శ్వేత సౌధం అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీ కెవిన్ మునోజ్ ఒక ట్వీట్లో ఈ విషయం తెలియజేశారు. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న విదేశీయులు అమెరికా రావచ్చని, విమానం ఎక్కే ముందు దాని తాలూకు సర్టిఫికెట్ చూపిస్తే సరిపోతుందని సోమవారం వైట్‌హౌస్ ప్రకటించింది. అలాగే వ్యాక్సినేషన్ 10 శాతం కంటే తక్కువగా ఉన్న దేశాలనుంచి వచ్చే ప్రయాణికులకు కూడా ఈ ఆంక్షలనుంచి మినహాయింపు ఇచ్చింది. తాజా నిర్ణయంతో భారత్, చైనా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, బ్రెజిల్‌తో పాటుగా 26 యూరోపియన్ దేశాలకు చెందిన రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్త యిన ప్రయాణికులు అమెరికాక వెళ్లవచ్చు. కరోనా కట్టడికోసం 2020 మార్చినుంచి ఈ దేశాలనుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం కొనసాగుతోంది.