Wednesday, January 22, 2025

మధ్యప్రాచంలో బలమైన శక్తిగా ఎదిగిన భారత్

- Advertisement -
- Advertisement -

మధ్యప్రాచంలో బలమైన శక్తిగా ఎదిగిన భారత్
గత దశాబ్ద కాలంలో చోటు చేసుకున్న అత్యంత ఆసక్తికర పరిణామం ఇదే
అమెరికా ప్రముఖ మ్యాగజైన్ విశ్లేషణ

న్యూఢిల్లీ: భారత దేశం మధ్య ప్రాచ్యంలో ఓ ప్రముఖ శక్తిగా ఎదగడం ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న అత్యంత ఆసక్తికరమైన పరిణామంగా అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మ్యాగజైన్ విదేశీ విధానానికి చెందిన ఓ వ్యాసంలో పేర్కొంది. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా ఈ ప్రాంతంలోని ప్రధాన దేశాలతో భారత దేశానికి బలపడుతున్న, పెరుగుతున్న సంబంధాలు ఈ ప్రాంతంలో భారత దేశ స్థానం, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు నిదర్శనమని ఆ వ్యాసం పేర్కొంది. ఈ పరిణామం విషయంలో అమెరికా చేయగలిగింది ఏమీ లేదని, ఒక విధంగా చెప్పాలంటే దీనివల్ల పరోక్షంగా లాభపడే అవకాశం ఉందని ఈ వ్యాస రచయిత స్టీవెన్ ఎ కుక్ అభిప్రాయపడ్డారు. ఒక వేళ మధ్యప్రాచ్యంలోని అమెరికా భాగస్వాములు గనుక ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నట్లయితే భారత్ ఒక చాయిస్‌గా ఉంటుంది.ఈ ప్రాంతంలో అమెరికా ఇక ఎంతమాత్రం పెద్దన్నగా ఉండబోదు.

అంతేకాదు భారత్ మధ్యప్రాచ్యంలో తన ఉనికిని విస్తరించినంతకాలం రష్యా కానీ, చైనా కానీ ఆ పాత్రను పొందలేవు’ అని కూడా కుక్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రచయిత పదేళ్ల క్రితం తన భారత పర్యటనను ప్రస్తావిస్తూ, భారతీయులు మధ్యప్రాచ్యంలో ప్రధానపాత్ర పోషించడానికి ఇష్టపడడం లేదని అప్పట్లో తనకు అనిపించిందన్నారు. అయితే ఈ పదేళ్ల కాలంలో పరిస్థితులు మారిపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ మధ్యప్రాచ్యంలో చైనా ప్రభుత్వం చేసే ప్రతి దౌత్య చర్యను, పెట్టే ప్రతిపెట్టుబడినీ అనుమానంగా చూడడంలోనే అమెరికా అధికారులు నిమగ్నమయ్యారని, ఫలితంగా మధ్యప్రాచ్యంలో ఒక ప్రధాన శక్తిగా భారత్ అవతరించడమనే ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా చోటు చేసుకొంటున్న అత్యంత ఆసక్తికరమైన భౌతిక రాజకీయ పరిణామాన్ని అమెరికా అధికారులు పట్టించుకోలేదని కుక్ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. గల్ఫ్ విషయానికి వస్తే ఈ ప్రాంతంలోని ప్రధాన దేశాలయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలు భారత్‌తో తమ సంబంధాలను విస్తరించుకోవడానికి మార్గాలను చురుగ్గా అన్వేషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇది చెప్పుకోదగ్గ పరిణామమమని, ఎందుకంటే ఈ రెండు దేశాలు చాలా కాలంగా పాకిస్థాన్‌కు దగ్గరగా ఉండేవని ఆ వ్యాసం పేర్కొంది. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలన్న ఉమ్మడి లక్షం ఈ దేశాలు భారత్‌కు దగ్గర కావడానికి కొంత కారణమయితే ఆర్థిక ప్రయోజనాలే ప్రధాన కారణమని ఆ వ్యాసకర్త అభిప్రాయపడ్డారు. భారత్, ఈ రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక సంబంధాలే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌తో భారత్ బలమైన సంబంధాలు కలిగి ఉండడాన్ని ప్రస్తావిస్తూ ఈ ప్రాంతంలో అత్యంత అభివృద్ధి చెందిన సంబంధాల్లో ఇదొకటని ఆ రచయిత పేర్కొన్నారు. కాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈజిప్టులో ఇటీవల జరిపిన రెండు రోజుల పర్యటనను ప్రస్తావిస్తూ చైనాలాగానే భారత్ కూడా ఈజిప్టును తమ వస్తువులను ఆఫ్రికా, యూరప్‌లకు పంపడానికి ముఖద్వారంగా భావిస్తోందని రచయిత అభిప్రాయపడ్డారు. కాగా నరేంద్ర మోడీ గత నెలలో జరిపిన అమెరికా పర్యటన కూడా ఇరుదేశాల మధ్య ఉన్న ప్రేమకు ఓ నిదర్శనమని కుక్ అంటూ అయితే అమెరికా కోరుకొంటున్నట్లుగా వ్యూహాత్మక భాగస్వామిగా భారత్ ఉండకపోవచ్చని కూడా అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News