యూఎస్ ఓపెన్.. జకోవిచ్, బార్టీ శుభారంభం
జ్వరేవ్, క్విటోవా ముందంజ
న్యూయార్క్: ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్‌లు నొవాక్ జకోవిచ్ (సెర్బియా), ఆశ్లే బార్టీ (ఆస్ట్రేలియా) శుభారంభం చేశారు. మరోవైపు కిందటి రన్నరప్ అలెగ్జాండర్ జ్వరేవ్(జర్మనీ), పదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్) కూడా తొలి రౌండ్‌లో విజయం సాధించారు. ఇక కెరీర్ గ్రాండ్‌స్లామ్‌పై దృష్టి పెట్టిన సెర్బియా యోధుడు జకోవిచ్ తొలిరౌండ్‌లో డెన్మార్క్ ఆటగాడు హోల్గర్ రూనేను ఓడించాడు. నాలుగు సెట్ల సమరంలో జకోవిచ్ 61, 67, 62, 61 తేడాతో రూనేను ఓడించి ముందంజ వేశాడు. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ జ్వరేవ్ అలవోక విజయంతో రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. తొలి రౌండ్‌లో జ్వరేవ్ 64, 75, 62తో అమెరికా ఆటగాడు శామ్ కెరీను ఓడించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జ్వరేవ్ వరుసగా మూడు సెట్లు గెలిచి రెండో రౌండ్‌లో ప్రవేశించాడు. మరోవైపు ఏడో సీడ్ డెనిస్ షపొవలొవ్ (కెనడా) కూడా తొలి రౌండ్‌లో విజయం సాధించాడు. అర్జెంటీనా ఆటగాడు ఫెడ్రికొతో జరిగిన మ్యాచ్‌లో 62, 62, 62తో జయకేతనం ఎగుర వేశాడు.
బార్టీ ముందుకు..
మరోవైపు మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఆశ్లే బార్టీ తొలి రౌండ్‌లో విజయం సాధించింది. రష్యా క్రీడాకారిణి వెరా జొనరెవాతో జరిగిన పోరులో బార్టీ 61, 76తో జయభేరి మోగించింది. తొలి సెట్‌లో అలవోకగా రాణించిన బార్టీకి రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే టైబ్రేకర్ వరకు వెళ్లిన సెట్‌లో బార్టీ గెలిచి ముందంజ వేసింది. మరో మ్యాచ్‌లో ఏడో సీడ్ స్వియాటెక్ విజయం సాధించింది. అమెరికా క్రీడాకారిణి లొయెబ్‌తో జరిగిన పోరులో స్వియాటెట్ 63, 64 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. మరో పోటీలో పదో సీడ్ పెట్రా క్విటోవా గెలుపొందింది. హర్కాబ్‌తో జరిగిన మ్యాచలో క్విటోవా 61, 62తో జయభేరి మోగించింది.
US Open 2021: Djokovic wins in 1st round