Saturday, December 28, 2024

యూఎస్ ఓపెన్ 2023: షెల్టన్ సంచలనం..

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అమెరికా యువ సంచలనం బెన్ షెల్టన్ పెను ప్రకంపనలు సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో విభాగంలో షెల్టన్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 20 ఏళ్ల షెల్టన్ క్వార్టర్ ఫైనల్లో అమెరికాకు చెందిన పదో సీడ్ ఫ్రాన్సెస్ టియోఫొయ్‌ను మట్టికరిపించాడు. మరో పోటీలో అగ్రశ్రేణి ఆటగాడు, రెండో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) క్వార్టర్ ఫైనల్ పోరులో విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన పదో సీడ్ కరోలినా ముచోవా సెమీ ఫైనల్‌కు చేరుకుంది.

ఫ్రాన్సెస్ ఇంటికి..
ఇక పురుషుల సింగిల్స్‌లో అమెరికా స్టార్ ఆటగాడు ఫ్రాన్సెస్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. తన దేశానికే చెందిన యువ ఆటగాడు బెన్ షెల్టన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో ఫ్రాన్సెస్ ఓటమి పాలయ్యాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో షెల్టన్ 63, 36, 76, 62 తేడాతో ఫ్రాన్సెస్‌పై సంచలన విజయం సాధించాడు. ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగింది. తొలి సెట్‌ను షెల్టన్ దక్కించుకోగా రెండో సెట్‌లో ఫ్రాన్సెస్ జయకేతనం ఎగుర వేశాడు. అయితే తర్వాత జరిగిన రెండు సెట్లలో గెలిచిన షెల్టన్ సెమీ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో జకోవిచ్ 61, 64, 64 తేడాతో అమెరికాకు చెందిన తొమ్మిదో సీడ్ టెలర్ ఫ్రిట్జ్‌ను ఓడించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జకోవిచ్ వరుసగా మూడు సెట్లు గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లాడు.

సొరానా ఔట్..
మహిళల సింగిల్స్ విభాగంలో పదో సీడ్ కరోలినా ముచోవా సెమీస్‌కు చేరుకుంది. ఏకపక్షంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో ముచోవా 60, 63 తేడాతో రుమేనియాకు చెందిన 30వ సీడ్ సొరానా కిర్‌స్టియాను ఓడించింది. ఆరంభం నుంచే ముచోవా దూకుడుగా ఆడింది. తొలి సెట్‌లో ప్రత్యర్థికి ఒక్క గేమ్‌ను కూడా గెలిచే అవకాశం ఇవ్వలేదు. అలవోకగా సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో కిర్‌స్టియా కాస్త పోటీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు దూకుడుగా ఆడిన ముచోవా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ముందంజ వేసింది.

సెమీస్‌లో బోపన్న జోడీ..
పురుషుల డబుల్స్ విభాగంలో ఆరో సీడ్ రోహన్ బోపన్న (భారత్), మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జంట సెమీ ఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ 76, 61 తేడాతో అమెరికాకు చెందిన 15వ సీడ్ లమోన్స్‌విథ్రో జంటను ఓడించింది. తొలి సెట్‌లో పోరు ఆసక్తికరంగా సాగింది. టైబ్రేకర్ వరకు వెళ్లిన సెట్‌లో బోపన్న జంట విజయం సాధించింది. ఇక రెండో సెట్‌లో బోపన్న జంటకు ప్రత్యర్థి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. చివరి వరకు దూకుడుగా ఆడిన బోపన్న జోడీ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో క్వార్టర్ ఫైనలో రెండో సీడ్ క్రాజిసెక్ (అమెరికా), డొగిగ్ (క్రొయేషియా) జంట విజయం సాధించింది. మొనాకోకు చెందిన తొమ్మిదో సీడ్ నీస్‌జిలిన్‌స్కితో జరిగిన పోరులో క్రాజిసెక్ జంట 64, 26, 63తో గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News