Monday, December 23, 2024

అల్కరాజ్ ఆశలు గల్లంతు

- Advertisement -
- Advertisement -

అల్కరాజ్ ఆశలు గల్లంతు
ఫైనల్లో జకోవిచ్, మెద్వెదేవ్
న్యూయార్క్: ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ యువ సంచలనం, టాప్ సీడ్ కార్లొస్ అల్కరాజ్ సెమీ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. రష్యాకు చెందిన మూడో సీడ్ డానిల్ మెద్వెదేవ్‌తో జరిగిన పోరులో అల్కరాజ్‌కు పరాజయం ఎదురైంది. మరో సెమీ ఫైనల్లో రెండో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) విజయం సాధించాడు. సోమవారం జరిగే ఫైనల్లో మెద్వెదేవ్‌తో జకోవిచ్ తలపడుతాడు. అల్కరాజ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో మెద్వెదేవ్ 76, 61, 36, 63 తేడాతో విజయం సాధించాడు. తొలి సెట్‌లో పోరు ఆసక్తికరంగా సాగింది. ఇటు మెద్వెదేవ్ అటు అల్కరాజ్ ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. ఇందులో చివరి వరకు నిలకడైన ఆటను కనబరిచిన డానిల్ సెట్‌ను దక్కించుకున్నాడు.

రెండో సెట్‌లో మాత్రం అల్కరాజ్ పూర్తిగా చేతులెత్తేశాడు. ఏ దశలోనూ డానిల్‌కు కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయాడు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన డానిల్ అలవోకగా సెట్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ మూడో సెట్‌లో అల్కరాజ్ అనూహ్యంగా పుంజుకున్నాడు. తన మార్క్ షాట్లతో మెద్వెదేవ్‌ను హడలెత్తించాడు. దూకుడుగా ఆడుతూ సునాయాసంగా సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే నాలుగో సెట్‌లో మళ్లీ విఫలమయ్యాడు. వరుస తప్పిదాలకు పాల్పడి చేజేతులా సెట్‌తో పాటు మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. కాగా, చివరి వరకు నిలకడైన ఆటను కనబరిచిన మెద్వెదేవ్ సునాయాస విజయంతో టైటిల్ పోరుకు దూసుకెళ్లాడు.

జకో అలవోకగా..
మరోవైపు అమెరికా యువ సంచలనం బెన్ షెల్టన్‌తో జరిగిన మరో సెమీఫైనల్లో అగ్రశ్రేణి ఆటగాడు జకోవిచ్ విజయం సాధించాడు. దూకుడగా ఆడిన జకోవిచ్ వరుసగా మూడు సెట్లు గెలిచి ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన నొవాక్ 63, 62, 76తో షెల్టన్‌ను ఓడించాడు. తొలి రెండు సెట్లలో జకోవిచ్‌కు ప్రత్యర్థి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. తన మార్క్ ఆటతో అలరించిన జకోవిచ్ వరుసగా రెండు సెట్లు సాధించాడు. కానీ మూడో సెట్‌లో జకోవిచ్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయినా చివరి వరకు నిలకడైన ఆటను కనబరిచిన జకో టైబ్రేకర్‌లో సెట్‌ను గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News