Wednesday, January 22, 2025

సబలెంకా, అల్కరాజ్ ముందంజ

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: ప్రతిష్ఠాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ కార్లొస్ అల్కరాజ్(స్పెయిన్), మూడో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ అరినా సబలెంకా (బెలారస్), 25వ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్) తొలి రౌండ్‌లో విజయం సాధించారు. అయితే 12వ సీడ్ బార్బోరా క్రెజ్సికొవా(చెక్) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఇటలీ క్రీడాకారిణి లూసియాతో జరిగిన హోరాహోరీ పోరులో బార్బోరా పరాజయం చవిచూసింది. ఆసక్తికరంగా సాగిన పోరులో లూసియా 64, 76 తేడాతో క్రెజ్సికొవాను ఓడించింది.

మరో మ్యాచ్‌లో ప్లిస్కోవా సునాయాస విజయాన్ని అందుకుంది. రుమేనియాకు చెందిన ఎలెనా రూసెతో జరిగిన తొలి రౌండ్‌లో ప్లిస్కోవా 61, 64తో జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే ప్లిస్కోవా దూకుడును ఆడింది. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తొలి సెట్‌ను దక్కించుకుంది. అయితే రెండో సెట్‌లో రూసె కాస్త పోటీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. రష్యా క్రీడాకారిణి అనస్తాసియా పావ్లిచెంకొవా కూడా రెండో రౌండ్‌కు చేరుకుంది. అమెరికాకు చెందిన ఫియోనా క్రావ్లితో జరిగిన తొలి రౌండ్‌లో పావ్లిచెంకొవా 62, 64తో జయకేతనం ఎగుర వేసింది. రెండో సీడ్ సబలెంకా కూడా అలవోక విజయంతో ముందంజ వేసింది. మొదటి రౌండ్‌లో సబలెంకా 63, 62తో బెల్జియం క్రీడాకారిణి మరినాను ఓడించింది. ఇతర పోటీల్లో ఎలినా స్విటోలినా (ఉక్రెయిన్), 13వ సీడ్ కసట్కినా (రష్యా), సురెంకో (ఉక్రెయిన్), కయా కనెపి (ఇస్టోనియా) తదితరులు విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

అల్కరాజ్ ముందుకు..
ఇక పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ అల్కరాజ్ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. జర్మనీ ఆటగాడు కొయెఫర్‌తో జరిగిన మొదటి రౌండ్‌లో అల్కరాజ్‌కు వాకోవర్ లభించింది. అల్కరాజ్ 62, 32 ఆధిక్యంలో ఉన్న సమయంలో గాయంతో కొయెఫర్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. దీంతో అల్కరాజ్‌కు విజయం వరించింది. మరో మ్యాచ్‌లో ఆరో సీడ్ జన్నిక్ సిన్నర్ ఇటలీ అలవోక విజయాన్ని అందుకున్నాడు. జర్మనీ ఆటగాడు హన్ఫ్‌మాన్‌తో జరిగిన తొలి రౌండ్‌లో సిన్నర్ 63, 61, 61తో జయభేరి మోగించాడు. మరో మ్యాచ్‌లో మూడో సీడ్ మెద్వెదేవ్ 61, 61, 60తో అట్టిలా బలాజ్స్ (హంగేరి)ను ఓడించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఇతర పోటీల్లో 17వ సీడ్ హుర్కాజ్, స్టాన్ వావ్రింకా (స్విట్జర్లాండ్), ఎవాన్స్ (బ్రిటన్), నోరి (బ్రిటన్) తదితరులు విజయం సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News