116 మందితో వచ్చిన అమెరికా మిలిటరీ విమానం
157 మందితో వస్తున్న మరో విమానం
అమృత్‌సర్/ చండీగఢ్ : 116 మంది భారత అక్రమ వలసదారులను తీసుకువచ్చిన అమెరికా మిలిటరీ విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దిగింది. భారత అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరించడం ఇది రెండవ సారి. ఈ నెల 5న 104 మందితో వచ్చిన విమానం కూడా ఇదే విమానాశ్రంయలో దిగిన విషయం విదితమే. తాజాగా భారతీయులతో వచ్చిన ఎసి17 విమానం శనివారం రాత్రి 90 నిమిషాలు ఆలస్యంగా 11.35 గంటలకు అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. ఇక వచ్చిన 116 మందిలో 60 మందికి పైగా పంజాబ్‌కు చెందినవారే ఉండడం గమనార్హం. 30 మందికి పైగా హర్యానాకు చెందినవారు.
గుజరాత్, ఉత్తర ప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌కుచెందిన వారు ఇద్దరేసి ఉండగా, జమ్మూ కాశ్మీర్‌కు చెందినవారు ఒకరు ఉన్నారు. వారిలో కొందరి కుటుంబాలు వారికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయం చేరుకున్నారు. పంజాబ్ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధలివాల్, విద్యుత్ శాఖ మంత్రి హర్భజన్ సింగ్ తిరిగివచ్చిన అక్రమ వలసదారుల్లో కొంత మందిని విమానాశ్రయంలో కలుసుకున్నారు. మరి 157 మందితో మరొక విమానం చేరుకోవలసి ఉన్నది. వారిలో 59 మంది హర్యానాకు, పంజాబ్‌కు చెందినవారు 52 మంది, గుజరాత్‌కు చెందినవారు 31 మంది ఉన్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న 487 మంది భారతీయులను అమెరికా గుర్తించిందని, వారు త్వరలోనే భారత్‌కు చేరుకుంటారని భారత ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.