అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించేదెవరు? రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంపా లేక డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిసా? అమెరికన్లకే కాదు, యావత్ ప్రపంచానికీ ఉత్కంఠ గొలుపుతున్న ప్రశ్న ఇది. ఇద్దరిలో ఎవరు గెలిచినా అది చారిత్రాత్మకమే అవుతుందనడంలో సందేహం లేదు. తెంపరితనానికి మారుపేరుగా, ప్రజాస్వామ్య విలువల పట్ల ఏమాత్రం గౌరవం లేని వ్యక్తిగా పేరొందిన ట్రంప్‌కు ప్రజలు మరోసారి పట్టంగడితే అది రికార్డే. అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారానికి దూరమైన గత నాలుగేళ్లలోనూ ట్రంప్ మూటగట్టుకున్న అపఖ్యాతి అంతా ఇంతా కాదు. ఆర్థికపరమైన కేసులతోపాటు, అక్రమ సంబంధాల విషయంలోనూ ఆయన కావలసినంత చెడ్డ పేరు సంపాదించుకున్నారు.
అయినా రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలోకి దిగి, ప్రత్యర్థికి సమవుజ్జీగా నిలిచారంటే అందుకు ఆయన దూకుడుతనం, అమెరికాను గొప్పగా నిలబెడతానంటూ ఆయన తలకెత్తుకున్న నినాదం, జాతీయవాదం పేరిట అమెరికన్లను రెచ్చగొట్టిన విధానం కారణం. కమలా హారిస్ గెలిస్తే, అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించిన మొట్టమొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టిస్తారు. అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా అమెరికా వినుతికెక్కినా, స్వతంత్ర దేశంగా అవతరించాక గత రెండున్నర శతాబ్దాల చరిత్రలో ఇప్పటివరకూ ఒక్క మహిళ కూడా దేశాధ్యక్షురాలిగా ఎన్నిక కాకపోవడం విచిత్రమే. 2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ అధ్యక్ష పదవికి పోటీపడినా, ఆమెపై ట్రంప్ విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండొనేసియా, మయన్మార్, పాకిస్తాన్, ఇండియా వంటి వర్ధమాన దేశాలు ఏనాడో మహిళలకు అగ్రతాంబూలమిచ్చి గౌరవించాయి. ప్రస్తుతం ప్రపంచంలోని 21 దేశాల్లో మహిళలే మహరాణులుగా వెలుగొందుతున్నారు. అయినా అమెరికన్లు మాత్రం ఒక మహిళను అగ్రస్థానంలో కూర్చోబెట్టేందుకు ఇప్పటివరకూ ఇచ్చగించకపోవడమే విడ్డూరం. అంతెందుకు, నిన్నమొన్నటి వరకూ ఆ దేశంలో మహిళలకు ఓటు హక్కు కూడా ఉండేది కాదంటే ఆశ్చర్యం కలుగుతుంది.
అమెరికా 1776 లోనే స్వతంత్ర దేశంగా అవతరించినా, మహిళలకు ఓటు హక్కు లభించింది మాత్రం దాదాపు 200 ఏళ్ల తర్వాతే. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఊహించని సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. దూకుడుగా సాగిన ట్రంప్ ప్రసంగాలు, ఆయనపై జరిగిన హత్యాయత్నం ప్రచారపర్వాన్ని వేడెక్కించాయి. డెమొక్రాటిక్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అనూహ్యంగా పోటీనుంచి వైదొలగడం, ఆ స్థానంలోకి వచ్చిన కమలా హారిస్ అనతికాలంలోనే ట్రంప్‌కు సమవుజ్జీగా ఎదగడంవంటి పరిణామాలతో అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ప్రభుత్వం మారితే ఇండియాపై ఆ ప్రభావం ఏమేరకు ఉంటుందనే చర్చ సాగుతోంది. అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచానికి జ్వరం వస్తుందనే నానుడి అతిశయోక్తిగా అనిపించినా అందులో వాస్తవం లేకపోలేదు. అంతర్జాతీయ మారకంగా అమెరికన్ డాలర్ ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తోంది.
తిరుగులేని ఆర్థికశక్తిగా, అద్వితీయమైన సైనిక సంపత్తితో అగ్రరాజ్యం పరోక్షంగా ప్రపంచాన్ని శాసిస్తోంది. ఈ క్రమంలో అమెరికాలో ప్రభుత్వం మారితే ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై ఉండటం ఖాయం. అయితే, అగ్రరాజ్యాధినేతగా ఎవరు అధికారంలోకి వచ్చినా ఇండియాపై అంతగా ప్రభావం పడే అవకాశం ఉండకపోవచ్చు. అమెరికాకు అన్నివిధాలా ప్రధాన శత్రువుగా ఎదుగుతున్న చైనాను నిలువరించాలంటే, ఇండియాతో స్నేహం అగ్రరాజ్యానికి తప్పనిసరి. శత్రువుకి శత్రువు మనకి మిత్రుడనే నానుడి అటు అమెరికాకు, ఇటు ఇండియాకు కూడా వర్తిస్తుంది. అతి ప్రాచీన ప్రజాస్వామికదేశంగా, బలమైన ఆర్థికశక్తిగా ఎదుగుతున్న ఇండియాతో స్నేహ సంబంధాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా అగ్రరాజ్యానికి ఎంతో అవసరం. భారత్ అత్యధికంగా పన్నులు విధిస్తోందని అడపాదడపా రుసరుసలాడే ట్రంప్ సైతం ఈ విషయాన్ని అంగీకరించక తప్పలేదు. తాను గెలిస్తే భారత్‌తో సంబంధ బాంధవ్యాలను మరింత బలోపేతం చేసుకుంటానని ఆయన చెబుతున్నారు.
హారిస్ విజయం సాధించినా ఈ వైఖరిలో మార్పు ఉండకపోవచ్చు. అగ్రరాజ్యంలో 54 లక్షలకు పైగా ఉన్న భారతీయుల్లో 61 శాతం మంది హారిస్ వైపే మొగ్గు చూపడానికి కారణం ఆమె భారతీయ మూలాలున్న వ్యక్తి కావడమే. వలసదారులపై ఉక్కుపాదం మోపి, అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ట్రంప్ కంకణం కట్టుకున్నారు. ఆయన గెలిస్తే, వలసవాద విధానాల్లో మార్పు రావచ్చు. పైగా మిత్రులకు పెద్దపీట వేసి, శత్రువులపై కక్ష తీర్చుకునే ఆయన విధానాలు ఇప్పటికే అనుభవైకవేద్యం. ఇందుకు భిన్నంగా కమలా హారిస్, తాను గెలిస్తే శత్రువులను కూడా మిత్రులుగానే పరిగణిస్తానంటున్నారు. పైపెచ్చు రిపబ్లికన్లకు తన కేబినెట్లో చోటు ఇస్తానంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారంనాటి ఎన్నికల్లో అమెరికన్లు ఎవరికి పట్టం కడతారనేది ఉత్కంఠగా మారింది.