Sunday, December 22, 2024

2024 అమెరికా ప్రెసిడెంట్ రేస్: ప్రధాన పోటీ ఆ ఇద్దరు పెద్దల మధ్యే?

- Advertisement -
- Advertisement -

2024 అమెరికా ప్రెసిడెంట్ రేస్
ప్రధాన పోటీ ఆ ఇద్దరు పెద్దల మధ్యే?
రిపబ్లికన్ పార్టీలో అత్యధికులు బరిలోకి
అధికార పార్టీలో బైడెన్ రెండోసారి ఖాయం?
వాషింగ్టన్ : అత్యంత శక్తివంతపు దేశం అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2024 అమెరికాకు అధ్యక్ష ఎన్నిక సంవత్సరం. ఇప్పుడు అధికారంలో ఉన్న డెమోక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్లలో ముందుగా ఆయా పార్టీలలో ఎవరు చివరికి ప్రెసిడెంట్ స్థానానికి ఖరారు అవుతారనేది కీలకం అయింది. రిపబ్లికన్ నేత, మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తాను మరోసారి పోటీలో ఉంటానని చెపుతున్నప్పటికీ, పలు రకాలుగా కేసులు ఎదుర్కొంటూ, బోనులలో నిల్చోవల్సి వస్తోంది.

తాజాగా కరోలినా సెనెటర్ స్కాట్ తాను పోటీకి దూరం అని ప్రకటించడం పార్టీ వర్గాలను విస్మపర్చింది. భారీ నిధులతో బలంగా ఉన్న ఈ అభ్యర్థి నిజానికి రిపబ్లికన్ పార్టీ తరఫున దేశాధ్యక్ష పదవికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ధీటైన అభ్యర్థి అని ప్రచారం జరిగింది, ఈ రేసులో ముందుగానే ఓ అభ్యర్థి మిస్ అయ్యారు. ఇక ఇప్పుడు వచ్చే ఏడాది జరిగే ప్రెసిడెంట్ ఎన్నికలలో రిపబ్లికన్, డెమోక్రాటిక్ నామినేషన్లకు పోటీ పడుతున్న వారి జాబితాలో ఎవరెవ్వరు ఉన్నారనేది కీలకం అయింది. ఇక థర్డ్‌ పార్టీ పోటీదార్లు ఎవరనేది ఆసక్తికరం అయింది.

ఏడాది క్రితమే డోనాల్డ్ ట్రంప్ ప్రచార బరి
ఎంతటి ప్రతిఘటన ఎదురైనా తాను వెనకకు తగ్గేది లేదని తెలియచేసుకుంటూ ట్రంప్ 2022 నవంబర్ 15ననే తాను తిరిగి పోటీకి సిద్ధం అని ప్రకటించారు. తన ప్రచారాన్ని మార్ ఎ లాగో రిసార్ట్ నుంచి ప్రారంభించారు. దీనితో రిపబ్లికను పార్టీ ఇరకాటంలో పడింది. 2020 ఎన్నికలలో పరాజయాన్ని అంగీకరించకపోవడం ఇది చివరికి యుఎస్ క్యాపిటల్ అటాక్ ఘటనకు దారితీయడం ఇప్పటికి న్యాయపరంగా తీవ్ర వివాదాస్పద అంశం అయింది. పార్టీకి ఆయన పోటీ సన్నద్థత చిక్కులకు దారితీసింది. అయితే పదునైన ప్రసంగాలతో పార్టీలో ప్రచారపర్వంలో సరైన రేటింగ్‌తో ట్రంప్ ముందుకు దూసుకుపోతున్నారు.

అమెరికా చరిత్రలో రెండు సార్లు అభిశంసనలకు గురైన నేతగా ట్రంప్ నిలిచారు. అయితే అమెరికన్ల అభిమానం పొందిన పాపులర్ ప్రెసిడెంట్ తానేనని ట్రంప్ తెలియచేసుకుంటూ పార్టీలో పోటీకి తన కర్చీఫ్ పదిలం చేసుకున్నారు. పలు అభియోగాలు తలెత్తుతున్నప్పటికీ ఇది రాజకీయ కక్షతో తనపై అధికార పార్టీ సాగిస్తున్న తంతు అని, ఈ క్రమంలో న్యాయవ్యవస్థ పక్షపాత ధోరణి స్పష్టం అయిందని కూడా ట్రంప్ విమర్శిస్తున్నారు.

తెరపైకి ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్
తాను అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లికన్ బరిలో ఉంటున్నట్లు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్ ఈఏడాది మే 24వ తేదీన ప్రకటించారు. 2024 ఎన్నికలక తన పోటీని ఆయన ఈ 24వ తేదీని ఎంచుకుని వెల్లడించారు. తాను పుట్టి పెరిగి గిట్టే ఫ్లోరిడా నుంచే తన అభ్యర్థిత్వం ప్రకటిస్తున్నట్లు సెంటిమెంట్‌ను ధట్టించారు. ఫ్లోరిడాలో తాను చేపట్టిన కన్సర్వేటివ్ పాలసీలను జాతీయ స్థాయిలో అమలు చేస్తానని తెలిపారు. ఫ్లోరిడా పబ్లిక్ స్కూళ్లల్లో అన్ని స్థాయిల్లో ఎల్‌బిబిటిక్యూ విషయాలపై క్లాసులు వద్దనే డోంట్ సే గేలాను తీసుకువచ్చారు. ఈ బిల్లును ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం డిస్నీ వ్యతిరేకించింది. అయితే ఆగేది లేదని ఫ్లోరిడా గవర్నర్ ముందుకు వెళ్లారు, అదే విధంగా గవర్నర్‌గా ఆయన అబార్షన్లను ఆరువారాల గర్భం తరువాత నిషేధించారు.

నిక్కీ హేలీ కూడా రిపబ్లికన్ స్టార్
ఐరాసకు మాజీ రాయబారి, సౌత్ కరోలినా గవర్నర్ అయిన నిక్కీ హెలీ కూడా ఇప్పుడు పోటీకి సిద్ధం అయ్యి, తన మాజీ బాస్ ట్రంప్ అభ్యర్థిత్వానికి సవాలు విసిరారు. ప్రెసిడెంట్ పోటీలో మహిళా అభ్యర్థినిగా ఇప్పుడు ఆమె తెరమీదికి వచ్చారు. ఫిబ్రవరి 15వ తేదీన చార్లెస్టన్‌లో ప్రచారం ఆరంభించారు. ట్రంప్ కేబినెట్‌లో ఆమె పనిచేశారు. తన మాజీ బాస్‌తో తాను పోటీకి దిగేది లేదని ముందుగా ప్రకటించారు. అయితే దేశ ఆర్థిక సమస్యలు , రాబోయే తరానికి ఉజ్వలభవిత గురించి తాను బరిలోకి దిగాల్సిందేనని భావించినట్లు తెలిపారు. పార్టీలో పాత తరం నేతలు పక్కకువెళ్లాల్సి ఉందని పిలుపు నిచ్చారు.

భారతీయ సంతతి వివేక్ రామస్వామి
ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ బరిలో ఎక్కువగా ప్రచారంలో ఉన్న వ్యక్తి వివేక్ రామస్వామి. సంపన్న వ్యాపారవేత్త , బయోటెక్ సంస్థ అధినేత అయిన వివేక్ రచయిత కూడా. ఫిబ్రవరిలో ప్రచారం ఆరంభించారు. భారతీయ సంతతి వలసదార్ల కుమారుడు అయిన రామస్వామి ప్రత్యేకించి పర్యావరణ, సామాజిక, కార్పొరేట్ పాలన వ్యవహారాలలో సునిశిత విమర్శలతో తనకు అంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు. నిధుల సేకరణ కార్యక్రమంలో కూడా ముందంజలో ఉన్నారు.

క్రిస్ క్రిస్టీ మరికొందరు
రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఇతర వ్యక్తులలో క్రిస్ క్రిస్టీ పేరు కూడా ఉంది. రెండుసార్లు న్యూజెర్సీ గవర్నరుగా ఉన్నారు. జూన్ 6న తన అభ్యర్థిత్వం ప్రకటించారు. ట్రంప్‌ను బాగా తిట్టిపోసే వ్యక్తిగా క్రిస్టికి పేరుంది. ట్రంప్ తుంపరి, ఒంటరి, అహంకారి అని, స్వార్థపరుడు అని విమర్శిస్తూ వస్తున్నారు. పార్టీలో ట్రంప్ ప్రాబల్యం దెబ్బతీసే శక్తి తనకే ఉందంటున్నారు. 2016 ఎన్నికల్లో కూడా అభ్యర్థిగా ఉన్న క్రిస్టి ఓ దశలో ట్రంప్ సలహాదారు కూడా. ఇతరులు ఎవరు కూడా ట్రంప్‌ను ఎదుర్కొలేరని, భయపడుతారని, తనకు ఈ భయం లేదని ప్రకటించారు.

ట్రంప్‌ను వ్యతిరేకించడం ఎందుకంటే ఆయనను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. పైగా ట్రంప్‌ను తిడితేనే ఈ రేస్‌లో గెలవగలం అని కూడా చెప్పారు. ఇక రిపబ్లికన్ బరిలో హచిన్‌సన్ కూడా ఉన్నారు. రెండుపర్యాయాలు ఆయన అర్కాన్‌సస్ గవర్నర్‌గా వ్యవహరించారు. ఎప్రిల్‌లో ప్రచారం ఆరంభించారు. న్యూయార్క్ కోర్టులో ట్రంప్ అభిశంసనకు గురి అయిన మరుక్షణమే ఆయన తన రేస్ ప్రకటించారు. కాగా రెండు సార్లు నార్త్ డకోటా గవర్నరు అయిన డౌగ్ బర్గమ్ కూడా బరిలో తాను ఉన్నట్లు తెలిపారు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సంస్థ మాజీ అధినేతగా ఆయనకు పేరుంది. ఆయన గురించి ఇతర రాష్ట్రాల వారికి ఎక్కువగా తెలియదు.

ఇక అధికార పార్టీ డెమోక్రాట్ బరిలో బైడెన్‌దే హవా
ప్రెసిడెంట్ జో బైడెన్ తన వయోవృద్ధ అశక్తత గురించి పట్టించుకోకుండా మరోసారి అధ్యక్ష స్థానానికి పార్టీలో అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఎప్రిల్ 25న ప్రచారం ఆరంభించారు. తనది మరోసారి విజయ ప్రచారం అని వెల్లడించారు. అమెరికా అధ్యక్షులలో పెద్ద వయస్సు రికార్డున్న బైడెన్‌కు ఇప్పుడు 86 సంవత్సరాలకు చేరుకుంటున్నారు. ఈ లేట్ వయస్సులో ఆయన ఏం చేయగలరని ప్రశ్నలు వేస్తున్న విమర్శకులను ఆయన పట్టించుకోవడం లేదు. ఆయన తరఫున పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ట్రంప్ కూడా పెద్దవ్యక్తి. మరి బైడెన్ అయితేనే ట్రంప్‌ను తట్టుకునే స్థాయి పార్టీకి ఉంటుందని ఆయన తరఫు వారు వాదిస్తున్నారు. అయితే అత్యధికులు ఆయన వద్దని చెపుతున్నారు. కానీ తనకు పార్టీలో ఎదురులేదని బైడెన్ ధీమాగా ఉన్నారు.

అమెరికా ఆత్మ పునరుద్ధరణ పేరిట బైడెన్ ప్రచారం సాగుతోంది. అమెరికన్ల ఘనత ప్రపంచానికి చాటడమే తన కర్తవ్యం అంటున్నారు. ఇక రంగంలోమరియెని విలియంసన్ కూడా చేరారు. డెమెక్రాట్లలో తన స్థానం పదిలం అని తెలియచేసుకుంటూ ఈ ఏడాది మార్చిలోవాషింగ్టన్ నుంచి ప్రచారం ఆరంభించారు. ఆమె 2020లో అధ్యక్ష పదవికి పోటీ బరిలో విఫలం అయింది. తాను దేశంలో శాంతి విభాగం ఏర్పాటు చేస్తానని , నల్ల జాతి అమెరికన్లకు భారీ స్థాయి ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు. మినెసోటా చట్టసభ సభ్యులు డీన్ ఫిలిప్స్ కూడా రంగంలోకి వచ్చారు. 54 సంవత్సరాల ఫిలిప్స్ బైడెన్ వైదొలగాలని, పార్టీలో యువతరానికి మరింతగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని ప్రచారం సాగిస్తున్నారు. అత్యంత సంపన్నుడిగా ఆయనకు పేరుంది. పెంపుడు తండ్రికి చెందిన ఫిలిప్ డిస్టిటింగ్ కంపెనీ వారసుడిగా ఆస్తిపరుడుగా నిలిచారు. పార్టీలో ఈ బలం ఆయనకు గుర్తింపు తెచ్చింది.

ఇక ఇండిపెండెంట్‌గా రాబర్ట్ కెనెడి ..ఇతరులు
గ్రీన్‌పార్టీ, పీపుల్స్‌పార్టీ కూడా తెరపైకి
థర్డ్‌పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు ప్రముఖ రచయిత రాబర్డ్ ఎఫ్ కెనెడీ జూనియర్ పేరు ముందుకు వచ్చింది. పలు బెస్ట్‌సేలర్ పుస్తక రచయితగా పేరున్న రాబర్ట్ పర్యావరణ విషయాల లాయర్‌గా కూడా ఉన్నారు. ముందు తాను డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీచేస్తానని ముందుకు వచ్చిన రాబర్ట్ తరువాత ఈ నిర్ణయం మార్చుకుని ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు.

దేశ మాజీ అధ్యక్ష దిగ్గజం జాన్ ఎఫ్ కెనెడీ దూరపు బంధువుగా ఆయన సమాజంలో పేరు తెచ్చుకున్నారు. యాంటీ వ్యాక్సిన్ ప్రచారంలో కీలక వ్యక్తిగా మారారు. ఇక జిల్ స్టెయిన్ పర్యావరణ ఉద్యమకారిణి. ఆమె కూడా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నారు. గ్రీన్‌పార్టీ తరఫున తన పోటీ ఉంటుందన్నారు. గతంలో ఆమె ట్రంప్, క్లింటన్‌లతో కూడా గ్రీన్‌పార్టీ తరఫున అధ్యక్ష స్థానం బరిలో దిగారు. అయితే పెద్దగా ఫలితం లేకుండా పోయింది. అయితే ఇతర పార్టీల అభ్యర్థుల బలాన్ని ఆమె ప్రభావితం చేస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇక అభ్యుదయవాది కార్నెల్ వెస్ట్ కూడా తాను సైతం అంటూ బరిలోకి దిగారు. గ్రీన్ పార్టీ తరఫున తాను పోటీకి సిద్ధం అన్నారు. అధికార పార్టీలుగా కేవలం రెండే రెండు పార్టీలు చలామణి అవుతూ దేశంలోని ప్రజాస్వామిక పంథాను దెబ్బతీస్తున్నాయని, దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం నెలకొనేందుకు తాను ముందుకు వస్తున్నానని వెల్లించారు. రెండు పార్టీల ఇనుప కబంధ హస్తాల నుంచి ప్రజటను విముక్తం చేయాల్సి ఉంది. వారికి అధికారం కట్టబెట్టాల్సి ఉందని ఇదే తన నినాదం అని తెలిపారు. ముందుగా ఆయన ది పీపుల్స్‌పార్టీ తరఫున పోటీకి దిగుతానని తెలిపిన వెస్ట్ మనసు మార్చుకుని గ్రీన్‌పార్టీ ద్వారా ముందుకు వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News