న్యూఢిల్లీ : కరోనాపై పోరులో భారత్‌కు అమెరికా తనవంతు సాయం అందిస్తోంది. మనదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు అదనంగా 25 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ బుధవారం సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో బ్లింకెన్ మాట్లాడుతూ కరోనాపై పోరుకు ఇప్పటివరకు 200 మిలియన్ డాలర్లకు పైగా సాయం అందించామని, తాజాగా మరో 25 మిలియన్ డాలర్ల సాయం అదనంగా ప్రకటించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. వ్యాక్సిన్ సరఫరాలో ఎదురౌతున్న సమస్యలను అధిగమించడంతోపాటు మరింత మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడానికి ఈ సాయం అందిస్తున్నట్టు బ్లింకెన్ తెలిపారు. ఇరు దేశాల్లో కరోనా తీవ్రత అధికం గానే ఉందని, దీన్ని అంతం చేయడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. కరోనా వ్యాప్తి చెందిన తొలినాళ్లలో భారత్ చేసిన సహకారాన్ని మరువలేమన్నారు. జైశంకర్ మాట్లాడుతూ తక్కువ ధరలకే ప్రపంచంలో టీకాలు అందుబాటులో ఉంచే అంశంపైనా చర్చించామని చెప్పారు.