వాషింగ్టన్ : భారతదేశానికి అధునాతన సాయధ డ్రోన్ల సరఫరాకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ మేరకు ఈ నెల చివరి వారంలో ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా కీలక ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని సంబంధిత విషయాలపై అవగావహన ఉన్నవారు తెలిపారు. ఈ డ్రోన్లను భారత్‌కు సరఫరా చేసే విషయంలో ఇప్పటివరకూ అమెరికా ప్రభుత్వం తాత్సారం చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఒప్పందానికి రంగం సిద్ధం అయింది. అమెరికా నిర్మిత సీగార్డియన్ డ్రోన్లను ్ల పెద్ద సంఖ్యలో కొనుగోలు చేయాలని చాలా కాలంగా ఇండియా ఉత్సాహం చూపుతూ వచ్చింది. రెండు నుంచి మూడు బిలియన్ల విలువ మేర సాయుధ డ్రోన్లను సంతరించుకోవాలని భారతదేశం ఆసక్తి చూపుతూ వచ్చింది. అయితే ఈ క్రమంలో బ్యూరోక్రటిక్ జాప్యం, రెడ్‌టేపిజంతో ఈ దిశలో ముందు అడుగుపడలేదు.
ఈ 23న ప్రధాని మోడీ అమెరికా పర్యటన తేదీ చాలా రోజుల ముందుగానే ఖరారు అయినప్పటి నుంచి అమెరికా విదేశాంగశాఖ, పెంటగాన్, వైట్‌హౌస్ అధికారులు ఈ డ్రోన్ల సరఫరాపై ఒప్పందానికి వీలుందని భారతదేశానికి సంకేతాలు ఇచ్చింది. దీనితో భారత దౌత్య వర్గాలు కూడా ముందుకు కదిలాయి. ఆయుధాలను తీసుకుని వెళ్లగలిగే సామర్థంతో ఉండే దాదాపుగా 30 వరకూ సాయుధ ఎంక్యూ 9 బి సీగార్డియన్ డ్రోన్స్ ఇప్పుడు మోడీ పర్యటన దశలో భారత్‌కు అందేందుకు రంగం సిద్ధం అయింది. ఈ డ్రోన్లను జనరల్ ఆటామిక్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రెసిడెంట్ బైడెన్ దంపతుల ఆహ్వానంపై అమెరికాకు వెళ్లుతున్న ప్రధాని మోడీ విస్తృతస్థాయి చర్చలు జరుపుతారు.
ఆయుధ, రక్షణ పాటవ అంశాలపై సహకారం గురించి కదలికకు వీలేర్పడుతుందని భావిస్తున్నారు. ప్రత్యేకించి మునిషియన్స్, గ్రౌండ్ వెహికిల్స్ సహ నిర్మాణంపై బైడెన్‌తో మోడీ చర్చిస్తారని తెలిపారు. అయితే ఇరువురు నేతల మధ్య ఆయుధాల విషయంలో చర్చలు జరుగుతాయా? లేదా అనే విషయంపై వైట్‌హౌస్, విదేశాంగ శాఖ, పెంటగాన్‌లు నిరాకరించాయి.