వాషింగ్టన్ : భారతదేశానికి ప్రయాణాల ఆంక్షలను అమెరికా సడలించింది. భారత్‌లో కొవిడ్ పరిస్థితి గణనీయంగా మెరుగుపడడంతో భారత్‌ను సుక్షిత దేశంగా పరిగణిస్తూ గతంలో లెవల్ 4లో ఉన్న ట్రావెల్ అడ్వయిజరీని లెవల్ 2 కిందకు మారుస్తూ సోమవారం అమెరికా ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌ను లెవల్ 4 కింద చేర్చిన అమెరికా తన పౌరులను భారత్‌కు ప్రయాణించవద్దని ఆదేశాలు జారీచేసిది.
ఎఫ్‌డిఎ అధికారికంగా గుర్తించిన వ్యాక్సిన్ సంపూర్ణంగా వేసుకున్న వారు భారత్‌కు ప్రయాణిస్తే కొవిడ్ సోకే అవకాశాలు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ తాజా ఉత్తర్వులో తెలిపింది. అయితే అదే సమయంలో&ఉగ్రవాద కార్యకలాపాలు, అంతర్ ఘర్షణలు చెలరేగుతున్న జమ్మూ కశ్మీరు(తూర్పు లడఖ్ ప్రాంతం, దాని రాజధాని లెహ్ మినహాయించి)కు మాత్రం ప్రయాణించవద్దని అమెరికన్ పౌరులను విదేశాంగ శాఖ కోరింది. సాయుధ ఘర్షణలు జరగడానికి అవకాశం ఉన్న భారత్-పాకిస్తాన్ సరిహద్దులకు చెందిన 10 కిలోమీటర్ల పరిధి వరకు వెళ్లవద్దని కూడా అమెరికా తన పౌరులను ఆదేశించింది.