అమెరికా పరిశోధకుల రూపకల్పన
హోస్టన్ : ఎవరి సహాయం లేకుండా స్వయంగా ఇచ్చుకోగలిగిన, మూడు నెలల వరకు గదిలో ఉష్ణోగ్రతకు స్ధిరంగా ఉండే కొత్త నాసికా ( ముక్కు ద్వారా పీల్చగలిగే ) వ్యాక్సిన్‌ను అమెరికా పరిశోధకులు రూపొందించారు. ఈ వ్యాక్సిన్‌ను నిర్వహించే ప్రక్రియ ప్రస్తుతం వాడుకలో ఉన్న కొవ్వు ఆధారిత నానోపార్టికల్స్ కన్నా ఊపిరితిత్తుల అంచులను తప్పించుకోవడంలో మరింత ప్రభావ వంతంగా పనిచేస్తుందని పరిశోధక బృందం కనుగొన్నారు. అమెరికా లోని చాపెల్ హిల్ లోగల యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కెరోలినా పరిశోధక బృందం రూపొందించిన ఈ నాసికా టీకా పరిశోధన పత్రం జర్నల్ నేచర్ బయోమెడికల్ ఇంజినీరింగ్ లో ప్రచురితమైంది.
జంతువులపై అధ్యయనం ద్వారా వ్యాక్సిన్ ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేసినట్టు, ప్రొటీన్ ఆధారిత వ్యాక్సిన్లకు ప్రభావవంతంగా ఉపయోగించవచ్చని పరిశోధకులు కె చెంగ్ చెప్పారు. ముక్కు ద్వారా పీల్చగలిగే ఈ వ్యాక్సిన్ ముక్కులో శ్లేష్మపొరను, ఇమ్యునిటీని ప్రదానం చేస్తుందని తెలిపారు. భద్రపర్చడానికి, పంపిణీకి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఈ వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడం అనేక సవాళ్లతో కూడుకుంది. మరింత పరిశోధన, అభివృద్ది వల్ల ఇది నమ్మకమైన వ్యాక్సిన్‌గా తయారవుతుందన్న ఆశాభావం వెలిబుచ్చారు. మొదటిది కండరాల ద్వారా టీకా ఇస్తే ఊపిరితిత్తుల వ్యవస్థకు చేరుకోవడంలో తక్కువ సామర్ధం ఉంటుంది. అందువల్ల ముక్కు ద్వారా ఇస్తే కొవిడ్‌కు వ్యతిరేకంగా మరింత ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు చెప్పారు. రెండోది ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్లకు కోల్డు స్టోరేజి అవసరం. శిక్షణ పొందే వైద్య సిబ్బంది ఉండాలి. ఇప్పుడీ వ్యాక్సిన్ గదిలోని ఉష్ణోగ్రతకు తగ్గట్టు మూడు నెలల పాటు నిల్వ చేయవచ్చు. వైద్యులు అవసరం లేకుండాస్వయంగా టీకా ఇచ్చుకోవచ్చు.