Monday, December 23, 2024

వెనెజులాపై ఆంక్షలు ఎత్తివేయాలి

- Advertisement -
- Advertisement -

సామ్రాజ్యవాదానికి పరాకాష్ఠగా నిలిచి తనకు అనుకూలంగా లేని దేశాలలో కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పరచి ‘ప్రపంచ పోలీసు పాత్ర’ ని పోషిస్తున్న అమెరికా నాటి నుండి నేటి వరకు ఆయా దేశాలపై ముఖ్యంగా సోషలిస్ట్ దేశాలపై నిరంతరం కఠిన ఆంక్షలు అమలు పరుస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుండటం పట్ల నేడు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. స్పెయిన్ వలస పాలన నుండి 1812లో స్వాతంత్య్రాన్ని పొందిన లాటిన్ అమెరికాలోని వెనెజులా దేశంపై అమెరికా అనేక ఏళ్లుగా, అనేక రకాల ఆంక్షలు విధిస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూనే ఉంది. ఆ వెనెజులా దేశం ఈ జూలై 11 నాడు 212వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంది. ఇన్ని సంవత్సరాల చరిత్ర గల ఒక స్వతంత్ర దేశంపై సామ్రాజ్యవాద దాహంతో అమెరికా కఠిన ఆంక్షలను నేటికినీ కూడా అమలు పరుస్తున్న తీరును దేశ ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య వ్యక్తులు చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. నేడు వెనెజులా దేశ ప్రజానీకం కలిసికట్టుగా సామ్రాజ్యవాద అమెరికా అప్రజాస్వామిక విధానాలను అడుగడుగునా నిరశిస్తూనే ఉన్నారు.

అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా శాంతి, న్యాయం కోసం వెనెజులా అనునిత్యం పోరాడుతూనే ఉంది. వెనెజులాపై అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలు, ఆర్థిక ఆంక్షలు రెండూనూ కఠినతరంగా అమలు అవుతున్నాయి. ‘ఆర్థిక ఆంక్షలు ఆదాయం, ఆయుర్దాయం క్షీణతకు దారి తీసి తద్వారా దేశ పురోభివృద్ధికి తీవ్ర ఆటంకాలు కలిగిస్తాయి. పాశ్చాత్య శక్తులు ఉపయోగించే అత్యంత ఘోరమైన ఆయుధాలలో ఆర్థిక ఆంక్షలను లక్ష్యంగా ప్రయోగిస్తున్నారు. వెనెజులాకు వ్యతిరేకంగా అమెరికా చేసిన దిగ్బంధనం క్యూబాలో మాదిరిగానే ఇంధన కొరత, వైద్య సామాగ్రి కొరత, ఆహార కొరత ఆర్థిక వ్యవస్థకు నష్టాన్ని కలిగించాయి. ఈ రకంగా దేశ ప్రజలకు నిత్యావసరాలు, మందులు, ఆహారం కూడా అందకుండా ఆంక్ష లు అమలు పరచడం ఏరకంగానూ సహేతుకం కాదు. ఈ రకంగా అమెరికా ఆంక్షల వల్ల వెనిజులా ఔషధాలు, శాస్త్ర, సాంకేతిక విషయాల్లో అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల ప్రభావాలను అధిగమించాల్సి వస్తుంది. అలాగే ఈ ఆంక్షల కారణంగా ఇతర దేశాల్లోని బ్యాంకుల ఖాతాల్లో వెనెజులా నిధులు కూడా స్తంభించిపోవడాన్ని సృష్టంగా గమనించవచ్చు. మొత్తంగా అమెరికా ఆంక్షలు వెనెజులా దేశ అభివృద్ధికి అడ్డుకట్ట వేసే విధంగా ఉండడం విచారకరం.

ప్రజానీకం శాంతియుతంగా జీవిస్తున్న వెనెజులాలో ఆంక్షల పేరుతో అమెరికా అశాంతికి కారణభూతంగా వ్యవహరించడం ఏరకంగాను సమంజసం కాదు. అందువలన ఇకనైననూ అమెరికా స్వచ్ఛందంగా ఆంక్షలను ఉపసంహరించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కాని అమెరికా ఆ విధంగా కాకుండా మరిన్ని ఆంక్షలు రుద్దే విధంగా వ్యవహరిస్తున్న తీరు దేశ ప్రజానీకాన్ని మరింతగా కలవరపెడుతుంది.
వెనెజులాపై అనైతిక, అక్రమ, నేరపూరిత ఆంక్షలన్నింటిని బేషరతుగా ఎత్తివేయాలని వెనెజులా దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో అనేక సందర్భాలలో డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ‘మా సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితాన్ని గౌరవించాలి. మా దేశంపై విధించిన అనైతికమైన, ఆమోదయోగ్యం కాని ఆంక్షలను ఎత్తివేయాలి. బేషరతుగా వాటన్నింటిని రద్దు చేయాలి. దేశంలో అంతర్గతంగా ఏం జరిగినా గాని వాటిని వెనెజులా ప్రజలు ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరించబోరు’ అని అధ్యక్షుడు నికోలస్ మదురో సృష్టంగా నొక్కి చెప్పారు. అదే విధంగా ఆ ఆంక్షలను ప్రజలు మరింత శక్తిమంతంగా ఎదుర్కొనే విధంగా నిబద్ధతతో ముందు కు సాగాలి’ అని వారిని చైతన్యోన్ముఖులని గావించే దిశగా ఉద్బోధించడాన్ని చాలా సునిశితంగా అవగతం చేసుకోవచ్చు.

ఇటీవల వెనెజులా ప్రజానీకం అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా వివిధ రూపాలలో నిరసన తెలియజేశారు. అధ్యక్షుడు నికోలస్ మదురో పౌరుల పోరాటాలకు తన మద్దుతును తెలియజేశారు. ‘మేము సామ్రాజ్యవాదానికి లొంగిపోవడం లేదు. ప్రతిఘటనలను, ప్రజా పోరాటాలను కొనసాగిస్తాము. ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ బొలివేరియన్ విప్లవాన్ని గుర్తు చేస్తున్నాను. వాలెస్ డెల్టురులోని శాంటా లూసియా వీధుల్లో పోరాట విప్లవకారులను చూసినప్పుడు నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. మాతృభూమి రక్షణలో భాగస్వామ్యమైన పౌరులందరికీ వారి ప్రేమకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీధుల్లో పౌరుల ప్రసంగాలు, వారు చూపిస్తున్న తెగువకు మేము ఖచ్చితంగా విజయాన్ని సాధించి తీరుతాము’ అని అధ్యక్షుడు నికోలస్ మదురో దృఢ విశ్వాసంతో పేర్కొనడాన్ని చాలా సునిశితంగా గమనించవచ్చు.

ఇదే క్రమంలో వెనిజులా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న అధ్యక్షుడు నికోలస్ మదురో ఇటీవల లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలు (సెలాక్), యూరోపియన్ యూనియన్ (ఇయు) మధ్య బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో జరిగిన సదస్సులో యూరపుతో దౌత్యపరంగా సంబంధాల పునరుద్ధరణను ప్రబలంగా ఆకాంక్షించడాన్ని సృష్టంగా గమనించవచ్చు. ‘యూరోపియన్ యూనియన్, వెనెజులా మధ్య దౌత్య బంధాన్ని కొత్తగా ఏర్పరచుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది’ అని ఆయన నిర్దేశిస్తూ చాలా సృష్టంగా హితవు పలకడాన్ని సునిశితంగా గమనించవచ్చు.
అనేక సంవత్సరాలుగా వెనెజులాపై అమెరికా అమలు పరుస్తున్న దమనకాండలను ఇకనైననూ నిలువరించాల్సిన అవసరం ఉంది. వెనెజులాపై సామ్రాజ్యవాద అమెరికా ఆంక్షలను బొలీవియా విప్లవం స్ఫూర్తితో ప్రతిఘటనా పోరాటాలతో తిప్పికొట్టాల్సిన అవసరం నేడు ఉంది. వెనెజులాపై అమెరికా అసహేతుక, అర్థరహిత ఆంక్షలు ఉపసంహరించే దిశగా సైమన్ బొలివర్ స్ఫూర్తితో, హ్యూగో చావేజ్ పోరాటపటిమ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులు కలిసికట్టుగా అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేసే దిశగా ప్రతిఘటిస్తూ పోరాడాల్సిన సమయం నేడు ఆసన్నమైనది.

జె.జె.సి.పి. బాబూరావు
94933 19690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News