వాషింగ్టన్: దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా తాజాగా కీలక ప్రకటన చేసింది. భారత్ సహా ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ నెగిటివ్ రిపోర్టు లేదా 90 రోజుల వ్యవధిలో వైరస్ బారిన పడి కోలుకున్నట్టు ఆధారాలు తీసుకురావడాన్ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 6నుంచి అమలులోకి వస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్(హెచ్ హెచ్ఎస్)లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) వెల్లడించింది. రెండేళ్లు, ఆపై వయసున్న ప్రయాణికులకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. నెగెటివ్ రిపోర్టు సైతం ప్రయాణానికి ఒక రోజు ముందు చేయించుకున్న పరీక్షకు సంబంధించినదై ఉండాలని చెప్పారు. దీంతోపాటు ప్రయాణికులు తాము సమర్పించిన వివరాలు సరైనవే అని ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా, అగ్రరాజ్యం లోని ఒక్క న్యూయార్క్ లోనే ఇప్పటివరకు ఎనిమిది ఒమిక్రాన్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. మసాచుసెట్స్, వాషింగ్టన్, న్యూజెర్సీ తదితర రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
US Restrictions to International Travellers