Friday, November 22, 2024

సిరియా సరిహద్దులో అమెరికా వైమానిక దాడులు..

- Advertisement -
- Advertisement -

సిరియా సరిహద్దులో అమెరికా వైమానిక దాడులు
ఇరాన్ అనుకూల దళాలకు చెందిన ఒకరి మృతి
పలు స్థావరాలు ధ్వంసం, ప్రాణ నష్టంపై వివరాలు వెల్లడించని పెంటగాన్

బాగ్దాద్: జోబైడెన్ అధికారం చేపట్టిన తర్వాత సిరియాపై మొదటిసారి అమెరికా వైమానిక దాడులకు దిగింది. ఇరాన్ అనుకూల షియా వర్గానికి చెందిన ఇరాకీ మిలిటెంట్ల స్థావరాలే లక్షంగా క్షిపణులతో అమెరికా యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. కతేబ్ హెజ్బొల్లా లేదా హెజ్బొల్లా బ్రిగేడ్స్ లక్షంగా దాడులు జరిగినట్టు ఇరాక్ అధికారి ఒకరు తెలిపారు. ఈ దాడుల్లో ఓ మిలిటెంట్ చనిపోగా, పలువురు గాయపడినట్టు ఆయన తెలిపారు. అమెరికా రక్షణశాఖ పెంటగాన్ కూడా దాడులను ధ్రువీకరించింది. తమ వైమానిక దళానికి చెందిన రెండు ఎఫ్15ఇ యుద్ధ విమానాలు ఏడు క్షిపణులను మిలిటెంట్ల స్థావరాలపై ప్రయోగించినట్టు పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్‌కిర్బీ తెలిపారు. తమ క్షిపణులు మిలిటెంట్ల బహుళ సౌకర్యాలను ధ్వంసం చేసినట్టు ఆయన తెలిపారు. అయితే, ఈ దాడుల్లో జరిగిన ప్రాణ నష్టం గురించి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. పూర్తి వివరాలు అందిన తర్వాత తెలియజేస్తామన్నారు.

ఇఎస్‌టి కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం ఈ దాడులు జరిగాయి. ఇటీవల ఇరాక్‌లో తమ అనుకూలురపై దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిపామని కిర్బీ తెలిపారు. ఫిబ్రవరి 15న ఉత్తర ఇరాక్‌లో ఇరాన్ అనుకూల మిలిటెంట్లు రాకెట్ దాడి జరపగా, ఒక కాంట్రాక్టర్ మరణించారని, అమెరికాకు చెందిన ఓ అధికారిసహా మిత్ర దళాలకు చెందిన పలువురు గాయపడ్డారని గుర్తు చేశారు. ఇరాక్‌సిరియా సరిహద్దులోని మిలిటెంట్ల స్థావరాలు, ఆయుధాలు సరఫరా చేసే ట్రక్కులు లక్షంగా క్షిపణి దాడులు జరిగినట్టు ఇరాక్ అధికారి తెలిపారు. దాడి జరిగిన స్థావరాలు యుఫ్రెటస్ నది పక్కన సిరియా భూభాగంలోని బౌకామల్ ప్రాంతంలోనివని కిర్బీ తెలిపారు. ఇప్పుడు దాడులు జరిగిన ప్రాంతం గతంలో ఇస్లామిక్ ఉగ్రవాదులకు స్థావరంగా ఉండేదని కిర్బీ తెలిపారు. షియా మిలిటెంట్లపైనే దాడులు జరిగినట్టు అమెరికా రక్షణశాఖ కార్యదర్శి ఆస్టిన్ కూడా స్పష్టం చేశారు. అయితే, ఇరాన్ అనుకూల కతేబ్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్ అనుకూల వర్గం కాదన్నది గమనార్హం. ఈ గ్రూప్ సిరియాలోని బషర్ అసద్ ప్రభుత్వ అనుకూలమైనది. కాగా, ఈ దాడుల వెనుక బైడెన్ ఉద్దేశం సిరియా అంతర్యుద్ధంలో పూర్తి స్థాయి జోక్యం కోసం అయి ఉండదని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాక్‌లోని తమ అనుకూల వర్గాలపై దాడులకు పాల్పడేలా ఇరాన్ అనుకూల మిలిటెంట్లు తెగబడకుండా ఇది ఓ హెచ్చరికలాంటిదని భావిస్తున్నారు. ఇప్పుడు దాడులు జరిగిన ప్రాంతం ఇరాక్, సిరియాల సరిహద్దున ఉన్న ప్రవేశ ప్రాంతం. అంతర్యుద్ధం జరుగుతున్న కీలక ప్రాంతం కాదన్నది గమనార్హం.

US Retaliatory Airstrike on Syria Border

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News