అవి 2023 గణాంకాలు
2024లో ఇంకా అధ్వానంగా ఉండే అవకాశం
షికాగో : షికాగోలో ప్రధాన కార్యాలయం ఉన్న గ్లోబల్ సంస్థ చాలెంజర్, గ్రే, క్రిస్ట్‌మస్ నివేదిక అమెరికా ఉద్యోగ మార్కెట్‌లో ఆందోళనకరంగా ఉన్న ఒక పరిస్థితిని అందరి దృష్టికి తీసుకువచ్చింది. 2023లో యుఎస్ సంస్థలు అంతకు ముందు సంవత్సరంలో కన్నా 98 శాతం ఉద్యోగాల కోతలు ఉన్నాయి. అమెరికా లేబర్ మార్కెట్ దీన స్థితిపై ఇది ఆందోళన కలిగిస్తోంది. ఆ నివేదిక ప్రకారం, 2023లో సంస్థలు గణనీయ స్థాయిలో 721677 ఉద్యోగాల కోతలకు ప్లాన్ చేశాయి.
2022లోని లే ఆఫ్‌ల కన్నా అది 363832 మేర అధికం. ఈ పెరుగులకు వివిధ అంశాలు కారణం. 2024లో ఈ పరిస్థితి మరింత అధ్వానంగా మారవచ్చు. అధిక వడ్డీ రేట్లు, నిరంతర ద్రవ్యోల్బణం వంటి సవాళ్లను లేబర్ మార్కెట్ ఎదుర్కొంటున్నది. ‘లేబర్ ఖర్చులు బాగా ఎక్కువ’ అని చాలెంజర్, గ్రే, క్రిస్ట్‌మస్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు ఆండీ చాలెంజర్ తెలియజేశారు.
దీనితో సంస్థల యజమానులు ఎంతో జాగరూకతతో వ్యవహరించవలసి ఉంటుందని, వ్యయ నియంత్రణ చర్యలపై దృష్టి కేంద్రీకరించవలసి ఉంటుందని ఆయన సూచించారు. కాగా, ఆ ఉద్యోగాల కోతల భారం ఎక్కువగా పడింది టెక్నాలజీ పరిశ్రమపైనే. 2022లో కన్నా 2023లో ఈ పరిశ్రమలో లే ఆఫ్‌లు 73 శాతం పెరిగాయి.