రెండవ ప్రపంచయుద్ధం నాటి అమెరికా బాంబు ఒక్కటి ఇప్పుడు జపాన్ ఎయిర్‌పోర్టులో పేలింది. జపాన్‌లోని మియాజాకి ఎయిర్‌పోర్టులో బుధవారం టాక్సీస్టాండ్ వద్ద ఈ ఘటన జరిటింది. ఈ ప్రాంతంలో యుద్ధం సమయంలో పాతిపెట్టి ఉన్న ఈ బాంబు చెక్కుచెదరకుండా ఉంటూ వచ్చింది. అనుకోని రీతిలో లోపల పేలడంతో అక్కడ పెద్ద గోతి ఏర్పడిందని జపాన్ అధికారులు తెలిపారు. సమీపంలో ఏ విమానం లేదని, ఎవరికి గాయాలు కాలేదని , ఈ ఘటన తరువాత దాదాపు 80 విమానాల రాకపోకలను రద్దు చేశారని అధికారులు వివరించారు. పెద్ద శబ్థంతో ఈ బాంబు పేలడం కలవరానికి దారితీసింది. వెంటనే అక్కడికి ఎస్‌డిఎఫ్ భద్రతా బలగాలు హుటాహుటిన చేరుకున్నాయి. పరిస్థితిని సమీక్షించారు. పరిశీలన తరువాత ఇది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇక్కడ అమెరికా సేనలు జారవిడిచిన బాంబుగా నిర్థారించారు.
ఈ బాంబు 500 పౌండ్ల బరువు ఉంది. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉంది. ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. పేలుడు ఘటన జరిగిన స్థలంలో సమీపంలో ఉన్న ఎవియేషన్ స్కూల్‌లో ఈ పేలుడు ఘటన తాలూకు దృశ్యాలు వీడియోలో భద్రం అయ్యాయి. బాంబు పేలడం, ముక్కలు చాలా ఎత్తు వరకూ ఓ ఫౌంటెన్ మాదిరిగా విరజిమ్మడం కన్పించింది. ఇక్కడ మూడు అడుగుల లోతు, దాదాపు 7 మీటర్ల వెడల్పుతో పెద్ద గుంత ఏర్పడినట్లు గుర్తించారు. విమానాల పునరుద్ధరణకు సమయం పడుతుందని అధికారులు తెలిపారు. మియజాకి ఎయిర్‌పోర్టును 1943లో అప్పటి జపాన్ రాజరికపు నావిక దళం నిర్మించింది. నౌకా దళ విమానాల పైలట్లకు శిక్షణ ఇప్పించేందుకు ఈ ఎయిర్‌పోర్టును వాడేవారు. ప్రపంచ యుద్ధం దశలో అమెరికా జపాన్ భూభాగంలో పలు ప్రాంతాలలో బాంబులు వేసింది.
వీటిలో అనేకం పేలకుండా ఉండటం , క్రమేపి వీటిలో కొన్ని భూమిలోకి జారుకోవడం జరిగింది. జపాన్‌లోని పలు ప్రాంతాలలో ఇటువంటి బాంబులు అనేకం పలు సందర్భాలలో వెలికితీశారు. ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ఇటువంటి అత్యధికంగా కనుగొన్నారని రక్షణ మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ప్రత్యేకించి కొన్ని చోట్ల భవన నిర్మాణ పనులకు భూమి తవ్వకం జరుగుతున్నప్పుడు బాంబులు పేలిన ఘటనలు అనేకం జరిగాయి. ఇక ఇప్పుడు ఈ ఎయిర్‌పోర్టు ఆవరణలో వాహనాల ప్రత్యేకించి శకటాలు ఇతరత్రా భారీ వాహనాల కదలికల ఒత్తిడితో ఈ బాంబు పేలి ఉంటుందని ప్రాధమికంగా వెల్లడైంది.