వాషింగ్టన్: భారతదేశం పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంకకు చైనా మితిమీరిన రుణాలు మంజూరు చేస్తుండడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. పెత్తనం కోసమే డ్రాగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ భారత పర్యటన నేపథ్యంలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అసిస్టెంట్ సెక్రటరీ డొనాల్డ్ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాక్‌కు బోర్డ్ ఆఫ్ చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్ 700 మిలియన్ డాలర్ల రుణాలు మంజూరు చేసినట్లు పాక్ ఆర్థిక మంత్రి ఇషాఖ్ దార్ తెలిపారు. దీని గురించి డొనాల్డ్‌ను మీడియా ప్రశ్నించింది. చైనా వ్యవహారంపై భారత్‌తో తీవ్రంగా చర్చిస్తున్నామని తెలిపారు. భారత పొరుగు దేశాలకు చైనా మంజూరు చేస్తున్న రుణాల గురించి తాము ఆందోళన చెందుతున్నామని, ఆ దేశాలపై బలవంతంగా పెత్తనం చలాయించేందుకు చైనా వాటిని ఉపయోగించే అవకాశాలున్నాయి అని ఆయన పేర్కొన్నారు.
భారత్ సహా ఆసియా దేశాలతో తాము నిరంతరం చర్చలు జరుపుతూనే ఉన్నామని, ఆయా దేశాలు తమ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేలా సాయం చేసేందుకు అగ్రరాజ్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. అంతేగానీ, చైనా సహా బయటి వ్యక్తుల బలవంతంతో ఆ నిర్ణయాలు ఉండకూడదని అన్నారు. ఇక, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో భారత్ అవలంబిస్తున్న వైఖరిపైనా ఆయన స్పందించారు. రష్యా విషయానికొస్తే భారత్ ’యుద్ధం’ అనే పదాన్ని వాడటం లేదని వస్తోన్న ఆరోపణలను ఆయన ఖండించారు. గత ఆగస్టులో మోడీ మాట్లాడుతూ ‘ఇది యుద్ధాల శకం’ కాదంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సూచించారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రి జైశంకర్ గత సెప్టెంబరులో ఐరాసలో మాట్లాడుతూ ’ఈ యుద్ధాన్ని చర్చలతోనే ముగించాలని పిలుపునిచ్చారు. మరి యుద్ధం అనే పదాన్ని ఉపయోగించట్లేదు అనడం సరికాదు కదా అని వ్యాఖ్యానించారు.