Tuesday, December 24, 2024

యుద్ధ పిశాచి అమెరికా!

- Advertisement -
- Advertisement -

సామ్రాజ్యవాదం యుద్ధాలకు నిలయం. ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. యుద్ధాలు లేకపోతే సామ్రాజ్యవాదులకు నిద్ర పట్టదు, గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థకు మనుగడ లేదు. వివిధ దేశాల సహజ వనరులను కొల్లగొట్టటం, ప్రభుత్వాలను కూల్చడం, దురాక్రమణ యుద్ధాలు చేయడం, పెద్ద ఎత్తున ఆయుధ వ్యాపారం చేయడం కోసం దేశాల మధ్య తగవులు పెట్టడం దాని సహజ లక్షణం. వీటన్నిటినీ నేడు అమలు జరుపుతున్నది అమెరికా సామ్రాజ్యవాదం.

ఆయుధ వ్యాపారం: సామ్రాజ్యవాద దేశాలకు ఆయుధాల ఉత్పత్తి, అమ్మకం అత్యంత కీలకం. అమెరికా పారిశ్రామిక ఉత్పత్తిలో ఆయుధాల ఉత్పత్తే ముఖ్య భాగంగా ఉంది. గత 63 సంవత్సరాలుగా మొత్తం అమెరికా పారిశ్రామిక ఉత్పత్తిలో ఆయుధాల ఉత్పత్తే ముఖ్య భాగంగా ఉంది. ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఐపి ఆర్‌ఐ) పరిశోధన ప్రకారం అమెరికాలోని ఆయుధ కంపెనీలు, రక్షణ రంగ సేవ సంస్థలు అంతర్జాతీయ ఆయుధ అమ్మకాల్లో 37 శాతంతో అగ్రభాగాన ఉన్నాయి. ఆయుధాల మీద, రక్షణ రంగం మీద 2020లో అమెరికా చేసిన ఖర్చు 778 బిలియన్ డాలర్లు. మన రూపాయల్లో 58 లక్షల కోట్లు. ఆ తర్వాత 10 స్థానాల్లో ఉన్న దేశాలు చైనా, ఇండియా, రష్యా, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లండ్, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్. ఈ పది దేశాల ఆయుధ ఉత్పత్తి ఖర్చులు కలిపినా అమెరికా ఖర్చు కన్నా తక్కువ. అమెరికా మొత్తం ఖర్చులో 15% పైగా ఆయుధ పరిశ్రమలకే ఖర్చు చేస్తున్నది. 2019లో దేశ రక్షణ కోసం కేటాయించిన 716 బిలియన్ డాలర్లలో 686 బిలియన్ డాలర్లు (90%) రక్షణ శాఖకే కేటాయించింది.

2023 నాటికి రక్షణ రంగ కేటాయింపుల 900 బిలియన్ల డాలర్లకు పెరిగింది. అమెరికా ఆయుధ ఉత్పత్తిలో 10 శాతం కాంట్రాక్టు ఆయుధ నిర్మాణం, అంటే ఇతర దేశాల ప్రభుత్వాల కోసం, బహుళ జాతి సంస్థల కోసం ఆయుధాలు ఉత్పత్తి చేసి ఇవ్వడం. ఆయుధ పరిశ్రమలో ఉద్యోగాలు నిలపడం కోసం నిరంతరం ఆయుధ ఉత్పత్తి జరుగుతుంది. ఈ ఆయుధాల విక్రయం కోసం ఇతర దేశాల అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవటం, ఒక దేశం పైకి మరొక దేశాన్ని రెచ్చగొట్టి యుద్ధాలను సృష్టిస్తుంది. అమెరికా పాలనా, సైన్యం 1960 తర్వాత నుంచి ‘సైనిక పారిశ్రామిక కూటమి’ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ సైనిక కూటమి ఏర్పడక ముందే అమెరికా సైన్యం ఆ దేశ రక్షణ అవసరాల కోసం ప్రైవేట్ పరిశ్రమ మీద ఆధారపడేది. ఈ కూటమి ఏర్పడిన తర్వాత ప్రభుత్వ అవసరాలు తీర్చడం దానికీ అప్పగించడం జరిగింది.

అమెరికా జరిపిన మారణకాండ యుద్ధాలు
తన సామ్రాజ్యవాద కాంక్షలకు, ఆధిపత్యానికి వ్యతిరేకంగా స్టాలిన్ నాయకత్వాన సోషలిస్టు శిబిరం ఏర్పడడం అమెరికాకు నిద్రలేకుండా చేసింది. అనేక దేశాలకు విస్తరిస్తున్న కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకోవడానికి కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాలపై దాడులకు పాల్పడింది. 1950లో ఉత్తర కొరియాపై సైన్యాలను పంపింది. చైనా వైపుకు చొరబడేందుకు ప్రయత్నించింది. ఈ యుద్ధంలో అమెరికా ఓటమి చెందడమే కాకుండా 36 వేల మంది సైనికులను కోల్పోయింది. ప్రజాచైనా, ఉత్తర కొరియాకు అన్ని రకాల తోడ్పాటును అందించింది. దక్షిణ వియత్నాంలో కమ్యూనిస్టుల ఉద్యమాన్ని అణచివేయడానికి సైనిక జోక్యం చేసుకుని 5 లక్షల సైన్యాన్ని పంపింది. ప్రజలపైన, కమ్యూనిస్టు గెరిల్లా, సైనిక దళాల పైన పాశవిక దాడులతో అనేక అమానుషాలకు పాల్పడింది. అమెరికా సైన్యాల దాడుల్లో 11 లక్షలకు పైగా మంది వియత్నాం ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 58 వేల అమెరికన్ సైనికులు హతులయ్యారు.

ఈ యుద్ధంపై అమెరికా పెట్టిన ఖర్చు 686 బిలియన్ డాలర్లు. అప్పటి రూపాయి విలువ ప్రకారం 5.5 లక్షల కోట్లు. ఎంత మంది సైన్యాలను దింపినా, మారణహోమం సృష్టించినా, వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినా వోచిమిన్ నాయకత్వాన ఉన్న ప్రజా సైన్యం చేతిలో అమెరికా ఓడిపోక తప్పలేదు. 1975లో ఒకే వియత్నాం ఏర్పడింది. ఇదే క్రమంలో లావోస్, కాంబోడియా దేశాల్లో కూడా సైనిక జోక్యం చేసుకుని ఓటమి చెంది అప్రతిష్ఠ పాలైంది. 1961లో క్యూబాలో ఫెడరల్ కాస్ట్రో ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేసింది. అంతరంగిక పోరాటం సృష్టించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఉగ్రవాదులకు సహాయం చేసి దేశంలో అస్థిర పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నించి విఫలమైంది.

అనేక దేశాల్లో అమెరికా కుట్రలు
కమ్యూనిస్టుల పోరాటాల అణచివేతకు సైనిక జోక్యం చేసుకోవడమే కాకుండా తన మాట వినని దేశాల్లోని ప్రభుత్వాల కూల్చివేతకు పాల్పడింది, సైనిక దాడులు చేసి ఆక్రమించింది. 2003లో ఇరాక్‌పై సైనిక దాడి చేసి, ఆ దేశాన్ని ఆక్రమించి దేశాధ్యక్షుడు సద్దాం హుస్సేన్ చంపింది. ఈ దాడిలోను, దాడి తర్వాత పరిణామాల్లో 4 లక్షల 61 వేల మంది ఇరాక్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 247 లక్షల కోట్ల నష్టం జరిగింది.

అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్ అఫ్ఘానిస్తాన్, ఇరాక్ దేశాలలో యుద్ధాలు మొదలు పెట్టగా, ఆ తర్వాత బరాక్ ఒబామా వాటిని కొనసాగిస్తూ లిబియా, సిరియా, యెమన్ దేశాల్లో పరోక్షం గాను, ప్రత్యక్షం గాను యుద్ధాలు చేశాడు. డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ యుద్ధాలను వివిధ రూపాల్లో కొనసాగించారు. అమెరికా 20 సంవత్సరాల పాటు అఫ్ఘానిస్తాన్‌ను దురాక్రమణ చేసింది. ఫలితంగా ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా పతనమైంది. నేడు సగం జనాభా దారిద్య్రంలో మగ్గుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం లో జరుగుతున్న మారణకాండ అమెరికా దుష్ట పన్నాగ ఫలితమే. ప్రపంచ ఆధిపత్యం కోసం ఆరాటపడుతూ, అందుకు అడ్డంకిగా ఉన్న రష్యాను దెబ్బ తీయటానికి నాటో కూటమిని ఏర్పాటు చేసింది.

గత సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. రష్యాపై యుద్ధం చేయాలంటే ఉక్రెయిన్‌ను తన వైపుకి అమెరికా తెచ్చుకోవాలి. ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు పచ్చి మితవాద భావాలు గలవాడు, పెట్టుబడిదారీ విధానాన్ని అమలు జరిపేవాడు. రష్యా వ్యతిరేకి. ఉక్రెయిన్‌ని ‘నాటో’లో చేరమని జెలెన్ స్కీ పై అమెరికా ఒత్తిడి ప్రారంభించింది. ఉక్రెయిన్ నాటోలో చేరడం తనకు ప్రమాదంగా రష్యా భావించింది. ప్రపంచ ఆధిపత్యంలో భాగం కోసం అమెరికాతో ఘర్షణ పడుతున్న రష్యా, నాటోలో చేరవద్దని జెలెన్ స్కీ ని హెచ్చరించింది. అమెరికా వ్యూహంలో చిక్కుకున్న జెలెన్ స్కీ రష్యా తో చర్చలకు తిరస్కరించి యుద్ధానికే మొగ్గు చూపిన ఫలితమే ఉక్రెయిన్‌పై రష్యా దాడి. అమెరికా, దాని మిత్ర దేశాలు ఆయుధాలు సరఫరా చేస్తూ యుద్ధాన్ని ఆరకుండా చేస్తున్నాయి. అయినా అపార ఆయుధ, సైనిక శక్తి కలిగిన రష్యా దాడులకు ఉక్రెయిన్ కకావికలవుతూ అపార నష్టాలను చవిచూస్తున్నది. వేలాది మంది సైనికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది రష్యా సైనికులు మరణించారు. ఇందుకు కారణం అమెరికా సామ్రాజ్యవాదులే.

అమెరికా జరిపిన అనేక దురాక్రమణ యుద్ధాల్లో 45 లక్షల మంది చనిపోయారని బ్రౌన్ విశ్వవిద్యాలయ 2023 మే విడుదల చేసిన ‘యుద్ధం ఖరీదు’ అనే రీసెర్చ్ ప్రాజెక్టు నివేదిక పేర్కొంది. ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవహక్కుల కోసమని అమెరికా చేస్తున్న ప్రచారం ఎంతటి మోసపూరితమో నివేదిక తేటతెల్లం చేసింది. భూగ్రహం మీద అత్యంత హింసాత్మకమైన, పరుల రక్తంతో తడిచిన శక్తి ఏదైనా ఉందంటే అది అమెరికానే అవుతుందని నివేదిక పేర్కొంది. ఉక్రెయిన్‌లో రష్యాపై పరోక్షంగా అమెరికా, దాని మిత్రదేశాల నాటో కూటమి చేస్తున్న యుద్ధం తీవ్రమైతే, గత 22 సంవత్సరాల్లో అమెరికా చేసిన యుద్ధాల్లో చనిపోయిన వారి సంఖ్య దాటి మరణాలు ఉంటాయని పేర్కొంది. యుద్ధాలకు, లక్షలాది ప్రజల మరణాలకు అమెరికా సామ్రాజ్యవాద ప్రపంచ ఆధిపత్య ధోరణే కారణం. ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాదం ఉన్నంత కాలం యుద్ధాలు కొనసాగుతూ, ప్రజల ప్రాణాలు హరించబడుతూనే ఉంటాయి. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం ప్రపంచ పోరాడి దాన్ని ఓడించినప్పుడే యుద్ధాలు ఆగుతాయి. ప్రపంచ ప్రజలు శాంతి కోసం ఆ మార్గంలో పయనించాలి.

బొల్లిముంత
సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News