Monday, December 23, 2024

అమెరికాలో మరో వెనుకడుగు!

- Advertisement -
- Advertisement -

సానుకూల వివక్ష అనే విరుద్ధ పదబంధం సమాజంలోని ఎగుడు దిగుడులను సరి చేసే పలుగు, పారల సమ్మేళనం, సమ్మిళిత ప్రగతికి, అభివృద్ధికి అత్యవసరమైన చర్య. ధనిక, నిర్ధనిక ముందుబడిన, వెనుకబడిన జనం ఒక చోట బతుకుతున్నప్పుడు ఈ రెండో వర్గానికి చేయి అందించి ముందుకు నడిపించడం కోసం వారికి విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా కేటాయించడం, ప్రభుత్వ ధనంతో ఇతర సౌకర్యాలు కల్పించడం తప్పనిసరి అవుతుంది. ఇది మానవీయ కర్తవ్యం, ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదం, ప్రజాస్వామ్య విలువలకు పట్టుగొమ్మ. ప్రపంచానికే ఆదర్శం అని చెప్పుకొనే అమెరికాలో సాక్షాత్తు సుప్రీం కోర్టే ప్రజాస్వామ్య విలువల నడ్డి విరగ్గొట్టడం కంటే ఆందోళన చెందవలసిన అంశం ఏముంటుంది? గతంలో గర్భస్రావ హక్కును రద్దు చేసిన అమెరికన్ సుప్రీంకోర్టు ఇప్పుడు కళాశాలల్లో జాతి ప్రాతిపదికగా రిజర్వేషన్లు కల్పించడాన్ని కూడా రద్దు చేసింది.

దీనితో అమెరికా అంతటా గల కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో నల్లవారికి, హిస్పియానిక్స్‌కు, మూలవాసి అమెరికన్లకు ఇస్తున్న రిజర్వేషన్లు, రాయితీలు అంతమైపోతాయి. అది అక్కడ సామాజిక కల్లోలానికి దారి తీస్తుంది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా వున్నప్పుడు తిరోగామి దృక్పథం గల వారిని సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించినందున వారి ఆధిక్యంతోనే ఇటువంటి తీర్పులు వెలువడుతున్నాయి. ట్రంప్ విధానాలు ప్రజాస్వామ్య వ్యతిరేకమైనవని బాహాటంగానే రుజువైంది. సుప్రీంకోర్టు జడ్జీల నిష్పత్తి మీద అది చూపుతున్న ప్రభావం అమెరికన్ సమాజంలో స్పష్టమైన చీలికకు దారి తీసే అవకాశాలను పెంచుతున్నది. సానుకూల వివక్షకు వ్యతిరేకంగా 2014లో ఎడ్వర్డ్ బ్లమ్ స్టూడెంట్స్ ఫర్ ఫెయిర్ అడ్మిషన్స్ అనే సంస్థను నెలకొల్పాడు. కళాశాలల అడ్మిషన్లలో జాతి ప్రాతిపదికగా రిజర్వేషన్లు కల్పించడానికి వ్యతిరేకంగా ఈ సంస్థ చాలా పిటిషన్లను దాఖలు చేసింది. వాటిలో కొన్ని సుప్రీంకోర్టు వరకు వచ్చాయి. వాటిపై తీర్పు చెబుతూ ప్రత్యేక సదుపాయాల నిబంధనను సుప్రీంకోర్టు గత వారం కొట్టివేసింది. లిండన్ జాన్సన్ దేశాధ్యక్షుడుగా వున్నప్పుడు ఆఫ్రికన్ అమెరికన్లకు అవకాశాలు పెంచడం కోసం సానుకూల వివక్ష లేదా దృఢమైన చర్య అమల్లోకి వచ్చింది. ఆ మేరకు 1964లో పౌర హక్కుల చట్టాన్ని తీసుకొచ్చారు.

నార్త్ కరోలినా యూనివర్శిటీ, హార్వర్డ్ యూనివర్శిటీల కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి జాతిపర మైన రిజర్వేషన్ల అమలును సవాలు చేస్తూ దాఖలైన రెండు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ఈ తీర్పును ఇచ్చింది. అణగారిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సానుకూల వివక్ష చిరకాలంగా భారత దేశంలో అమల్లో వుంది. వెనుకబడిన తరగతులకు చెందిన వారెవరికైనా ప్రత్యేక కోటా కల్పించడానికి అందుకోసం సానుకూల వివక్ష చూపడానికి అవకాశం కల్పిస్తూ 1951లో భారత రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ తీసుకొచ్చారు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ వల్ల శతాబ్దాలుగా దుర్భరమైన జీవితాలు అనుభవించిన ఎస్‌సి, ఎస్‌టిలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలవుతున్న సంగతి తెలిసిందే. అలాగే జన బాహుళ్యం గల వెనుకబడిన తరగతులకు మండల్ కమిషన్ సిఫార్సుల ద్వారా కేంద్ర విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చారు. మండల్ కమిషన్ నివేదికను విపి సింగ్ ప్రభుత్వం దుమ్ము దులిపి పాక్షికంగా అమలు చేసినప్పుడు కాషాయ సైన్యం దానిని అడ్డుకోడానికి ఉద్యమం చేపట్టింది. ప్రజల దృష్టిని మళ్ళించడం కోసం బాబ్రీ మసీదు కూల్చివేతకు నడుం కట్టింది. దానితో మందిర్, మండల్‌వాదుల మధ్య ఘర్షణ చోటు చేసుకొన్నది.

భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో రెండే రెండు సీట్ల బలం నుంచి దేశాధికారాన్ని కైవసం చేసుకోడానికి బాబ్రీ మసీదు కూల్చివేతే దోహదపడింది. దాని హయాంలో అగ్ర వర్ణాలు తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలంటూ వీధుల్లోకి రావడం ప్రధాని మోడీ ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% కోటా కల్పించడం తెలిసిందే. రాజ్యాంగ కర్తలు ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు కల్పించిన రిజర్వేషన్లు సామాజిక, విద్య సంబంధ వెనుకబాటుతనాన్ని తొలగించడానికి మాత్రమే ఉద్దేశించగా, బిజెపి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఆర్థికంగా వెనుకబడిన (ఇడబ్లుఎస్) వారికి కోటాను అమల్లోకి తెచ్చింది. 103 రాజ్యాంగ సవరణ చెల్లుతుందో లేదో సుప్రీంకోర్టు ఇంకా తేల్చవలసి వుంది. విద్యను కొనుక్కోడం ధనికులకు సాధ్యమవుతుంది. పేదలకు, చరిత్రలో తీవ్రమైన అణచివేతకు గురైన వారికి ఆ సామర్థం వుండదు. రాజ్యాంగంలో సానుకూల వివక్షకు అవకాశం కల్పించడం వెనుక ఈ కఠోర వాస్తవం వుంది. అమెరికాలోనూ, భారత దేశంలోనూ రిజర్వేషన్ల పట్ల ఒకే రకమైన అక్కసును గమనించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News