Sunday, January 19, 2025

ఇక అమెరికా వీసా కష్టమే!

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతోనే రెండోసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి తన ప్రభుత్వ విధానాల్లో వలసదారుల విషయంలో కఠినంగానే వ్యవహరించవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా హెచ్1బి వీసా విషయంలో కఠినమైన నిబంధనలు అమలులోకి తెస్తారని భావిస్తున్నారు. దేశాలన్నిటికన్నా అమెరికాయే తమ భవిష్యత్ గమ్యస్థానంగా భారతీయ యువత కలలు కంటుంటారు. చదువుల కోసం, అక్కడ ఉపాధి కోసం తహతహలాడుతుంటారు. అయితే ఈ విధంగా వలస జీవితాన్ని కోరుకునే వారికి ట్రంప్ విధానాలు అడ్డంకి కావచ్చన్న ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఏటా దాదాపు 10,000 మంది హెచ్1బి వీసా హోల్డర్లతో పాటు 60,000 నుంచి 70,000 మంది విద్యార్థులు అమెరికాకు వస్తుంటారు. వీరిలో 80% కంటే ఎక్కువ మంది యువత ఐటి, ఫైనాన్స్ సంస్థల్లో పని చేస్తున్నారు. హెచ్1బి ప్రోగ్రామ్‌ను ట్రంప్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అమెరికాలోని సంస్థలు వృత్తిలో నైపుణ్యం కలిగిన ఇతర దేశాలకు చెందిన వారిని హెచ్1బి వీసా ద్వారా రప్పించుకుని తాత్కాలికంగా పనిచేయించుకుంటాయి. ఇదంతా నాన్ ఇమ్మిగ్రెంట్ ప్రక్రియ. ఇప్పుడు ట్రంప్ ఈ హెచ్1బి వీసా ప్రక్రియపై ఆంక్షలు విధించవచ్చని భావిస్తున్నారు. ఈ విధంగా ట్రంప్ ఆంక్షలు విధిస్తే అమెరికాలోని భారత ఐటి సంస్థలు, ఉద్యోగులకు కష్టాలు తప్పవని ఎస్‌బిఐ తన నివేదికలో పేర్కొంది. వర్క్ వీసాల విషయంలో ట్రంప్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలను మరింత కట్టుదిట్టం చేస్తే వీసా నిబంధనల్లో చెప్పుకోతగిన మార్పులు వస్తాయి. మన దేశం నుంచి అమెరికాకు వెళ్లడానికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హెచ్1బి వర్క్ పర్మిట్, ఎఫ్1 స్టూడెంట్ వీసా, విజిటర్ వీసా, హెచ్ 4 డిపెండెంట్ వీసా, హెచ్3 వీసా, 1 వీసా, 01 వీసా, పివీసా, ఆర్1 రెలీజియన్ వీసా ఈ విధంగా అనేక నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసాల ద్వారా అమెరికాకు వెళ్తుండటం పరిపాటిగా వస్తోంది. ఇప్పుడు ఈ వీసా నిబంధనలను పటిష్టం పేరుతో ట్రంప్ కఠినం చేస్తే ఈ అవకాశాలు చాలావరకు తగ్గిపోతాయి. ముఖ్యంగా భారత్‌లోని ఐటి ప్రొఫెషనల్స్‌కు సమస్యలు ఎదురవడమే కాకుండా ఐటి కంపెనీల ఖర్చులు పెరుగుతాయన్న ఆందోళన వినిపిస్తోంది. అమెరికాలో పనిచేస్తున్న భారత ఐటి కంపెనీల నియామక సామర్థాలపై ట్రంప్ ఆంక్షల ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు. దీనివలన అమెరికాలో స్థానికంగా ఉద్యోగాల కోసం భారత సంస్థలు అత్యధికంగా వనరులను కేటాయించాల్సి ఉంటుంది. ఇది కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతుందని ఎస్‌బిఐ నివేదిక పేర్కొంది. అమెరికా ఫస్ట్ అన్న ఆశయానికి ఈ హెచ్1బి ప్రక్రియ దెబ్బతీస్తుందని ట్రంప్ అభిప్రాయం. ఆయన మొదటి దఫా అమెరికాను పాలించినప్పుడు వీసా తిరస్కరణలు అత్యధికంగా పెరిగాయి. అప్పుడు జారీ చేసిన నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసాల సంఖ్య ఏడాదికి దాదాపు 10 లక్షల చొప్పున ఉన్నాయి. 2023లో దాదాపు 14 లక్షల మంది భారతీయులు హెచ్1బి వీసాను పొందారు. దీనికి తోడు ఇటీవల అమెరికా తీసుకున్న నిర్ణయం భారతీయ కుటుంబాలకు చెందిన వేలాది మంది పిల్లల భవిష్యత్‌కు త్రిశంకు స్వర్గంగా మారింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చినవారు అక్కడే పెరిగి, చదువులు పూర్తి చేసుకుని తమకు 21 ఏళ్లు రాగానే అమెరికా ప్రభుత్వం వారిని స్వదేశానికి దయచేయండి అని చెప్పడం వివాదాస్పదంగా తయారైంది. ఇదిలా ఉండగా, అమెరికాలో ఆశ్రయం పొందడానికి దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ సమాచారం ప్రకారం 2021లో భారతీయుల నుంచి వచ్చిన దరఖాస్తుల సంఖ్య 4330 గా ఉండగా, 2023 నాటికి ఈ సంఖ్య 41,330 కి పెరిగింది. మొత్తమ్మీద 202123 మధ్య ఈ దరఖాస్తుల పెరుగుదల అత్యధికంగా ఉండడం గమనార్హం. అమెరికాలో ఆశ్రయం కోసం 2021లో 63,340 దరఖాస్తులు రాగా, వీటిలో 16,550 మందికి ఆశ్రయం కోసం అనుమతులు లభించాయి. 2023 నాటికి ఈ విధమైన దరఖాస్తుల సంఖ్య ఏకంగా 4,56,750 కి పెరిగింది. ఇందులో 54,350 మందికి మాత్రమే అనుమతి లభించింది. యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సమాచారం ప్రకారం గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ మధ్య కాలంలో ఎలాంటి అధికారిక ధ్రువీకరణ పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించే వారిలో దాదాపు 29 లక్షల మంది దొరికిపోయారు. ఇలా పట్టుబడిన వారిలో భారతీయులు 90,415 మంది వరకు ఉండడం గమనార్హం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి విధానాలు తీసుకుంటుందో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News