Monday, December 23, 2024

భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థ్ధంలో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, ఎగుమతులు, దిగుమతులు తగ్గడం వంటి ప్రతికూల పరిణామాల మధ్యలోనూ అమెరికాతో వాణిజ్యం మెరుగ్గానే కొనసాగడం గమనార్హం. వాణిజ్య శాఖ వివరాల ప్రకారం.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 11.3 శాతం తగ్గి 59.67 బిలియన్ డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే సమయంలో వాణిజ్య విలువ 67.28 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య అమెరికాకు ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 41.49 బిలియన్ డాలర్ల నుంచి 38.28 బిలియన్ డాలర్లకు తగ్గాయి. అదే సమయంలో దిగుమతులు సైతం 25.79 బిలియన్ డాలర్ల నుంచి 21.39 బిలియన్ డాలర్లకు కుంగాయి. మరోవైపు భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం కూడా 3.56 శాతం తగ్గి 58.11 బిలియన్ డాలర్లకు చేరింది. ఎగుమతులు స్వల్పంగా తగ్గి 7.84 బిలియన్ డాలర్ల నుంచి 7.74 బిలియన్ డాలర్లకు చేరాయి.

దిగుమతులు సైతం 52.42 బిలియన్ డాలర్ల నుంచి 50.47 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా గిరాకీ నెమ్మదించిన నేపథ్యంలోనే భారత్, అమెరికా మధ్య ఎగుమతులు, దిగుమతుల విలువ తగ్గిందని నిపుణులు తెలిపారు. త్వరలోనే పాజిటివ్ జోన్‌లోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధం మరింత బలపడే దిశగా చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న సంవత్సరాల్లో ద్వైపాక్షిక వాణిజ్యం లో స్థిరమైన వృద్ధి కొనసాగుతుందని తెలిపారు. భారత్‌కు వాణిజ్య మిగులు ఉన్న కొన్ని దేశాలలో అమెరికా ఒకటి. 2022- 23లో భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అగ్రరాజ్యం నిలిచింది. గత సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ 7.65 శాతం పెరిగి 128.55 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2013-14 నుంచి 2017- 18 వరకు, 2020- 21లో భారత్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి గా ఉంది. చైనా కంటే ముందు ఆ స్థానంలో యూఏఈ ఉండేది. 2022- 23లో 76.16 బిలియన్ డాలర్లతో ఆ దేశం మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య ఆ దేశంతో భారత్ వాణిజ్య విలువ 36.16 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News