న్యూయార్క్ : అమెరికాలో శుక్రవారం సంభవించిన మంచుతుపాన్(బాంబ్ సైక్లోన్) 200 మిలియన్ల మందిపై ప్రభావం చూపింది. భారీ మంచు, ఈదురుగాలుల రొద, వేడి నీళ్లు కూడా గడ్డ కడుతున్నంత చలి ప్రజలను ఇబ్బంది పెడుతున్నది. న్యూయార్క్ నగరంలో మంచు తుపాన్ కారణంగా ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీల సెల్షియస్ కు పడిపోవడంతో ఎముకలు కొరికే చలితో అమెరికన్లు వణుకుతున్నారు. తుపాను కారణంగా అమెరికా దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.యునైటెడ్ స్టేట్స్‌లో లక్షలాది మంది ప్రజలు మంచు తుపాను బారిన పడ్డారు. సెలవు రోజుల్లో అమెరికన్లు వారి ఇళ్లలో చిక్కుకుపోయారు.
తుపాన్ కారణంగా 1.4 మిలియన్ల గృహాలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలులతో చెట్లు,విద్యుత్ లైన్లు పడిపోయాయి. దీని వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం వాటిల్లింది. మంచుతుపాన్ వల్ల 3వేల విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.తుపాన్ ప్రభావం వల్ల 13 మంది మరణించారు. ఓహియోలో కారు ప్రమాదాలలో మరో నలుగురు మరణించారు. ప్రజలు ఇళ్లలోనే అప్రమత్తంగా ఉండాలని ఓహియో గవర్నర్ కోరారు.తుపాన్ కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భరించలేనంతగా మారడంతో న్యూయార్క్ గవర్నర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.