వాషింగ్టన్ : బంగ్లాదేశ్ ప్రధాని షేఖ్ హసీనా ఉద్వాసన వెనుక తమ హస్తం ఉందన్న ఆరోపణను ‘హాస్యాస్పదం’గాను, ‘తప్పు’గాను అమెరికా అభివర్ణించింది. ఉద్యోగాల్లో వివాదాస్పద కోటా పద్ధతిపై తన ప్రభుత్వంపై విస్తృత స్థాయిలో నిరసనలు వెల్లువెత్తగా హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్‌కు పారిపోయారు. ఆమె ఉద్వాసన అనంతరం నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నాయకత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది.
‘అది హాస్యాస్పదం. షేఖ్ హసీనా రాజీనామా వెనుక యునైటెడ్ స్టేట్స్ పాత్ర ఉందనడం పూర్తిగా తప్పు’ అని యుఎస్ విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ మంగళవారం స్పష్టం చేశారు. వారాల తరబడి దౌర్జన్య సంఘటనల తరువాత తన ఉద్వాసనకు దారి తీసిన సామూహిక నిరసనలను అమెరికా ప్రేరేపించిందని హసీనా చేసిన ఆరోపణ గురించి ప్రశ్నించినప్పుడు పటేల్ ఆ వ్యాఖ్య చేశారు. ‘ఇటీవలి వారాల్లో విస్తృతంగా తప్పుడు సమాచారం చూశాం. ముఖ్యంగా దక్షిణాసియాలో మా భాగస్వాములతో డిజిటల్ ఎకోసిస్టమ్ వ్యాప్తంగా సమాచారం సమగ్రతను పటిష్ఠం చేయడానికి మేము నిబద్ధులమై ఉన్నాం’ అని పటేల్ చెప్పారు.