పాతికేళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసి, డ్రగ్స్ కు బానిస చేసి ఆమెపై అత్యాచారం చేస్తున్న ఓ కిరాతకుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలోని హ్యూస్టన్ నగరానికి చెందిన లీ కార్టర్ అనే 52 ఏళ్ల వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అతని బారిన పడిన ఆ యువతి చిక్కి శల్యమై, రేపో మాపో చావడానికి సిద్ధమైన స్థితిలో ఉంది. వెంటనే పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
లీ కార్టర్ ఒక ర్యాప్ సంగీతకారుడు. వైపర్ అనే మారు పేరుతో కచేరీలు ఇస్తూ ఉంటాడు. ఐదేళ్ల క్రితం అతనికి పాతికేళ్ల అమ్మాయి రోడ్డుపై తారసపడింది. అప్పటికి ఆమె గర్భిణిగా ఉంది. తన వద్ద డబ్బులు లేవనీ, ఇంటికి వెళ్లడానికి సాయం చేయాలని ఆమె కార్టర్ ను ప్రాధేయపడింది. ఆమెపై జాలి తలచి ఒక డాలర్ ఆమె చేతిలో పెట్టిన కార్టర్, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటూ ఆమెను కారెక్కించుకున్నాడు. తిన్నగా ఆమెను తన ఇంటికి తీసుకువచ్చి గ్యారేజీలో ఆమెను బంధించాడు. అప్పటినుంచి ఆమెకు తిండీ నీళ్లు ఇవ్వకుండా హింసించడం మొదలుపెట్టాడు. ఆమెను డ్రగ్స్ కు బానిసగా చేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడు.
ఒకరోజు కార్టర్ లేని సమయంలో ఆమె అతని ల్యాప్ టాప్ తెరచి, టెక్స్ట్ నౌ యాప్ లో పోలీసులకు మెస్సేజ్ పంపించింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. కార్టర్ ఇంటికి వచ్చిన పోలీసులకు ఇంటి గ్యారేజీలోంచి మూలుగులు వినిపించడంతో కిటికీని బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించారు. అక్కడ ఆ యువతి బందీగా ఉంది.
కార్టర్ కోసం గాలింపు మొదలు పెట్టిన పోలీసులకు అతను ఒక మోటెల్ లో దొరికాడు. అతనిపై కిడ్నాప్, అత్యాచారం కేసులు పెట్టి, కటకటాల వెనక్కి నెట్టారు.