ఎఫ్‌ఐపిఎ నుంచి 5000 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు
వాషింగ్టన్ : భారత సంతతికి చెందిన అమెరికా డాక్టర్ల బృందం 5000 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను నౌకల ద్వారా భారత్‌కు పంపిస్తోంది. ఇటీవలనే ఏర్పడిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫిజీషియన్స్ అసోసియేషన్(ఎఫ్‌ఐపిఎ) ఈమేరకు శుక్రవారం వివరాలు తెలియచేసింది. తాము కొనుగోలు చేసిన 5000 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లలో 450 యూనిట్లు అహ్మదాబాద్‌కు అప్పుడే చేరుకున్నాయని, ఢిల్లీకి వెళ్లే దారిలో 325 ఉన్నాయని, మరో 300 ముంబైకు వెళ్తున్నాయని చెప్పారు. ఇవి కాక మరో 3500 యూనిట్లు నౌకల కోసం వేచి ఉన్నాయని ఎఫ్‌ఐపిఎ అధ్యక్షుడు డాక్టర్ రాజ్భయానీ తెలిపారు.లోవా కేంద్రం సెఘల్ ఫౌండేషన్ 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను పంపుతున్నట్టు ప్రకటించింది. గ్రేటర్ బోస్టన్‌లో భారత సంతతి అమెరికన్ల సామాజిక సంస్థ భారత్‌కు సహకరించడానికి వారాంతాల్లో 5 కె వర్చువల్ /రన్ ఓవర్ నిర్వహణతో నిధులు సేకరిస్తోంది. కానెక్టికట్ లోని కేరళ అసోసియేషన్ క్రిష్ణ శ్రీనివాసన్ ఆధ్వర్యంలో ఆస్పత్రుల్లో ఆక్జిజెనేటర్ల ఏర్పాటుకు 5000 డాలర్ల వరకు నిధి సేకరించాలని లక్షంగా పెట్టుకుంది. భారత సంతతి వందన కర్ణ బీహార్ గ్రామీణ ప్రాంతాల ప్రజలను కాపాడడానికి శనివారం నిధుల సేకరణ చేపట్టింది. మొదట 10,000 డాలర్లు సేకరించాలని లక్షం గా పెట్టుకుని కొన్ని గంటల్లో 8,000 డాలర్ల కన్నా ఎక్కువగా నిధి సేకరించ గలిగింది. ఆక్సిజన్ ఫ్లో మీటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సెంట్రేటర్లు , పల్స్ ఆక్సిమీటర్, శానిటైజింగ్ మెషిన్లు పిఎస్ఎ ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంట్లు భారత్‌కు పంపాలని లక్షంగా పెట్టుకున్నట్టు వందన చెప్పారు.