Monday, December 23, 2024

మోడీ రాకపై అమెరికన్ల లేఖాస్త్రం

- Advertisement -
- Advertisement -

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ రిపోర్ట్ 2022లో భారత దేశంలో అంతర్జాతీయ మతపర సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, మైనారిటీల పట్ల మతపర వివక్ష, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ద్వారా మత కల్లోలాలు, హింస ప్రేరేపించబడుతోందని ఉంది. రిపోర్టర్స్ విత్ అవుట్ బార్డర్స్ వార్షిక అధ్యయనాలలో పత్రికా స్వేచ్ఛలో ఇండియా స్థానం ముందెన్నడూ లేని విధంగా దిగజారిందని రాసి ఉంది. అదే విధంగా గత ఐదేళ్లలో ప్రజలకు ఎక్కువసార్లు ఇంటర్ నెట్ అందుబాటును నిలిపివేసిన దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని యాక్సెస్ నౌ పేర్కొంది. అమెరికా, భారత దేశ రాజ్యాంగాల్లో మానవ హక్కులు, మత స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్య్రం ప్రాథమిక అంశాలుగా గుర్తింపబడ్డాయనేది గమనించాలి.

ఈ నెల 20న ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల పర్యటనగా అమెరికా వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుండి మోడీకి ఘన స్వాగతం, ఇరువురి మధ్య గౌరవపూర్వక పలకరింపులు, విందు, వేడుకలతో కూడిన సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రవాస భారతీయుల సదస్సులో మోడీ ప్రసంగిస్తూ రెండు ప్రజాస్వామ్య దేశాల బంధం ప్రపంచ గతినే మార్చి వేస్తుందనగానే సభికుల చప్పట్లు మోగిపోయాయి. అయితే ఈ పర్యటనలో ఆనంద హేలతో పాటు ఒక నిరసన జ్వాల కూడా మెరిసింది. మోడీ అమెరికాలో దిగిన రోజే శ్వేతసౌధానికి ఒక ఘాటైన లేఖ అందింది. ఆ దేశానికి చెందిన 75 మంది శాసనకర్తల సంతకాలతో కాంగ్రెస్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆధ్వర్యంలో ఆ విజ్ఞప్తిని అమెరికా అధ్యక్షుడికి పంపింది. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది.

అమెరికా పర్యటనకు వస్తున్న భారత ప్రధాని మోడీతో మీ సమావేశానికి ముందే ఈ లేఖ అందిస్తున్నాము. భారత్ అమెరికాల మధ్య పెంపొందుతున్న వాణిజ్య ఒప్పందాల పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత వృద్ధి చెందాలి. ఇందుకోసం ఇరు దేశాలు పరస్పర నమ్మకంతో ముందుకు సాగే దిశగా చర్చలు సాగాలి. ఆర్థికాభివృద్ధితో పాటు పలు మానవ సంబంధ సున్నితమైన అంశాలను కూడా ఇందుకు పరిగణనలోకి తీసుకోవాలి. మన విదేశాంగ విధానం ప్రకారం స్నేహిత దేశాల్లోని మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, బహుళత్వం పట్ల కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం మీపై ఉంది.
అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ రిపోర్ట్ 2022లో భారత దేశంలో అంతర్జాతీయ మతపర సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, మైనారిటీల పట్ల మతపర వివక్ష, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ద్వారా మత కల్లోలాలు, హింస ప్రేరేపించబడుతోందని ఉంది. రిపోర్టర్స్ విత్ అవుట్ బార్డర్స్ వార్షిక అధ్యయనాలలో పత్రికా స్వేచ్ఛలో ఇండియా స్థానం ముందెన్నడూ లేని విధంగా దిగజారిందని రాసి ఉంది. అదే విధంగా గత ఐదేళ్లలో ప్రజలకు ఎక్కువసార్లు ఇంటర్‌నెట్ అందుబాటును నిలిపివేసిన దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని యాక్సెస్ నౌ పేర్కొంది. అమెరికా, భారత దేశ రాజ్యాంగాల్లో మానవ హక్కులు, మత స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్య్రం ప్రాథమిక అంశాలుగా గుర్తింపబడ్డాయనేది గమనించాలి.
స్వతంత్ర, విశ్వసనీయ నివేదికల ఆధారంగా భారత్‌లో గత కొన్నేళ్లుగా మోడీ పాలన కారణంగా మానవీయ విలువలు కృశించిపోతున్నాయని తెలుస్తోంది. రాజకీయ పన్నాగాలు, మత అసహనం, పౌర సమాజాల లక్ష్యంగా దాడులు కలగలిసి సాధారణ జీవితాలకు విఘాతం సృష్టిస్తున్నాయి.

అమెరికాలోని మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిశీలన విభాగం 2022 లో సమర్పించిన నివేదిక ప్రకారం భారత్‌లో రాజకీయ హక్కులపై, వ్యక్తీకరణపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా మన ఇరు దేశాల్లో మానవ నైతికత, సౌభ్రాతృత్వాన్ని పాదుకొలిపిన మహనీయులను తలుచుకోవాలి. అమెరికాలో జాతుల మధ్య ప్రేమ, బాంధవ్యాల కోసం జీవితాన్ని అంకితం చేసిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ భారత జాతిపిత మహాత్మా గాంధీ బాటలో నడిచారు. భిన్న జాతి, మత నేపథ్యాలతో ఉన్న పౌరులందరూ ఒక్కటేనని ఈ మహనీయులు చాటి చెప్పారు. వారి విశాల దృక్పథాన్ని మనం అలవరచుకోవాలి. భారత ప్రధాని మోడీని అమెరికాకు ఆహ్వానించడంలో మీతో మేము చేయి కలుపుతాం. భారత, అమెరికా ప్రజల మధ్య సన్నిహిత, గాఢ సంబంధాలుండాలి. దీని కోసం రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల పంపకాలే కాకుండా మానవీయ, సామాజిక విలువలు కూడా ఇచ్చిపుచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము ఏ భారతీయ నేతను, ఏ రాజకీయ పార్టీని ప్రస్తావించకుండా అమెరికా రాజ్యాంగంలో పొందు పరచిన విదేశాంగ విధానంలోని మౌలిక సూత్రాలను పాటించాలని మాత్రం నొక్కి చెబుతున్నాము. భారత ప్రధాని మోడీతో మీరు సమావేశమైనప్పుడు మేము ప్రస్తావించిన అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించాలని మనవి.

తద్వారా ఇరు దేశాల మధ్య బలమైన, విజయవంతమైన, దీర్ఘకాలిక అనుబంధాలు ఏర్పడే అవకాశముంది అని ముగించారు. ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో 18 మంది సెనేటర్లు, 57 మంది ప్రతినిధుల సభకు చెందిన వారున్నారు. వారిలో పాలక పక్ష డెమొక్రాట్లు కూడా ఉన్నారు.
తొలి సంతకాల్లో భారత సంతతికి చెందిన ప్రమీలా జయపాల్ ఉన్నారు. ఆమె యుఎస్ కాంగ్రెస్ సభ్యురాలు. అయితే ఇలాంటి లేఖను బైడెన్‌కు పంపిన ప్రమీలా అమెరికా పార్లమెంట్ అయిన కాంగ్రెస్‌లో మోడీ చేసిన ప్రసంగానికి నిలబడి చప్పట్లు కొట్టిన దృశ్యం ఇప్పుడు ప్రచారంలో ఉంది. ఈ లేఖ తతంగమంతా భారత జాతీయ కాంగ్రెస్ పన్నాగమే అని బిజెపి కొట్టివేస్తోంది. అంత మాత్రాన లేఖలోని అంశాలను కొట్టిపారేయలేం.

Also Read: మోడీకి అమెరికా మీడియా మొట్టికాయలు

మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా మోడీ అమెరికా పర్యటన సందర్బంగా సిఎన్‌ఎన్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ భారత దేశంలో దుర్బల జాతుల హక్కులకు భంగం కలుగుతోందని అన్నారు. భారత ప్రధానితో ప్రభుత్వ యంత్రాంగం ఈ సమస్యలపై నిజాయితీగా చర్చించాలని అన్నారు. మోడీతో సమావేశమైనప్పుడు బైడెన్ భారత దేశంలోని ముస్లిం మైనారిటీల రక్షణ గురించి తప్పక ప్రస్తావించాలని కోరారు. రాజకీయ ప్రత్యర్థులపై, మైనారిటీ ప్రజలపై, పౌర సమాజ నాయకులపై క్రూరమైన చట్టాలు ప్రయోగిస్తున్నారని ప్రధాని మోడీని వాల్‌స్ట్రీట్ జర్నల్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారని ది వైర్ పత్రిక రాసింది. అయితే ఈ లేఖలోని అంశాలు, అభ్యర్థనలు ఇరు దేశ ఏలికల మధ్య చర్చకు వచ్చినట్లుగా వార్తలేమి లేవు.

తన పర్యటనపై అమెరికాలోని అన్ని వర్గాల ప్రజలు, సకల రాజకీయ పార్టీల నేతలు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ప్రధాని మోడీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రెండో రోజున అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సభ్యులనుద్దేశించి మోడీ చేసిన ప్రసంగం సమ్మోహనమై హాలంతా జయజయ ధ్వానాలతో మోగిపోయింది. అయితే ఆ ప్రసంగాన్ని తాము బహిష్కరించినట్లు ముందే చెప్పిన సభ్యులు కూడా ఉన్నారు. సభల్లో ముందు వరుసలో నిలబడి మోడీ మోడీ అని ఆయన అనుచరులు, అభిమానులు చేస్తున్న ఉద్ఘోషతో పాటు అగ్ర రాజ్యంలోని ప్రజాస్వామ్యవాదులు నుండి మోడీ ఎదుర్కొన్న వ్యతిరేకత కూడా మన దేశ ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. మెరుపులే కాదు, మరకల గురించి కూడా ఆలోచించాలి.

 

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News