Monday, April 21, 2025

నిస్సహాయతలో ‘డబ్ల్యుహెచ్‌ఒ’

- Advertisement -
- Advertisement -

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ)కు అమెరికా అకస్మాత్తుగా నిధులు ఆపేసింది. దీంతో ప్రపంచ దేశాలకు వైద్య సహాయం తీరని ప్రతిబంధకంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థలో సంస్కరణలు తీసుకొస్తే సమర్ధత పెరుగుతుంది తప్ప ఈ విధంగా నిధుల కోత వల్ల అమెరికాకు కానీ, ప్రపంచ దేశాలకు కానీ ఎలాంటి ప్రయోజనాలు సిద్ధించవన్న అభిప్రాయాలు వైద్య నిపుణులనుంచి వస్తున్నాయి. దీని వల్ల ఔషధాలు, వ్యాక్సిన్ల తయారీ, సరఫరా, వ్యాధి గుర్తింపు సేవలు, ఆరోగ్యవ్యవస్థ నిర్వహణ, సాంకేతిక సహకారం ఇవన్నీ మూతపడతాయని, అనేక జీవితాలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని బ్రౌన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్, వ్యాక్సిన్ అలియన్స్ గవి మాజీ సిఇఒ డాక్టర్ సేథ్ బెర్కిలీ తన ఆందోళన వెలిబుచ్చారు. గవి, వ్యాక్సిన్ అలయన్స్ అనేది ప్రభుత్వప్రైవేట్ భాగస్వామ్య కూటమి.

ప్రపంచం లోని సగం మంది పిల్లలకు అత్యంత ప్రాణాంతక వ్యాధులనుండి టీకాలు వేయడంలో సహాయపడడం ఈ కూటమి ప్రధాన లక్షం. 2000లో ఇది ప్రారంభమైనప్పటి నుండి ఒక తరానికి 822 మిలియన్లకు పైగా పిల్లలకు రోగ నిరోధక శక్తిని అందించడంలో, 14 మిలియన్లకు పైగా మరణాలను నివారించడంలో గవి సహాయపడింది. అలాగే 73 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పిల్లల మరణాలను తగ్గించడంలో సహాయపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని ప్రాజెక్టు వ్యాక్సిన్ సేఫ్టీ నెట్ (విఎస్‌ఎన్)లో గవి వెబ్‌సైట్ సభ్యత్వం కలిగి ఉంది. ఈ వెబ్‌సైట్ సెక్రటేరియట్ కార్యాచరణ బడ్జెట్ ద్వారా నిధులు సమకూరుస్తుంది. అమెరికా ప్రభుత్వం ఇంతవరకు ఈ గవీ కూటమి సంస్థకు 13 శాతం వరకు నిధులు సమకూరుస్తుంది. ఇప్పుడు ట్రంప్ నిధులు నిలిపివేతకు నిర్ణయం తీసుకోవడం ఇలాంటి వ్యాక్సిన్ సహాయ సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతుందని డాక్టర్ బెర్క్‌లీ చెబుతున్నారు.

ప్రపంచ దేశాల్లో మొత్తం 75 మిలియన్ పిల్లలకు వ్యాక్సిన్లు అందకుండాపోతుందని ఆయన అంచనాగా చెప్పారు. మలేరియా, మెనింజిటిస్ వ్యాధుల చికిత్సకు ఇప్పుడు కొత్త రకమైన వ్యాక్సిన్లు తయారయ్యాయి. మెనింజిటిస్ అనేది మెదడును, వెన్నుపామును కప్పిఉంచిన కణజాల పొరలు. ఈ కణజాల పొరలు మెదడును, వెన్నుపామును రక్షిస్తుంటాయి. ఈ పొరలచుట్టూ ద్రవం సంక్రమణ పుర్రెలో మంట, వాపునకు కారణమవుతుంది. సకాలంలో దీనికి చికిత్స చేయకుంటే ప్రాణాంతకమవుతుంది. ఇప్పుడు దీనికి వ్యాక్సిన్ కనుగొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిధులు ఆపేస్తే ఈ వ్యాక్సిన్లను సరఫరా చేయడం కుదరదు. ఆఫ్రికాలో మెనింజెటిస్ ఎక్కువగా వ్యాపిస్తోంది. అలాగే మలేరియా కూడా ఆఫ్రికాలో చిన్నపిల్లల ప్రాణాంతక వ్యాధిగా ప్రబలుతోంది. ఇప్పటివరకు ఆఫ్రికాలో మలేరియా మరణాలు 94% సంభవించాయి.

ఈ విపత్తు సమయంలో మలేరియా, మెనింజెటిస్ వ్యాక్సిన్లను అందించగలిగితే కొన్ని లక్షల పిల్లల మరణాలను నివారించడానికి వీలవుతుంది. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా మలేరియా వ్యాక్సిన్‌ను తయారు చేసింది.ఇతర దేశాల మలేరియా వ్యాక్సిన్ కన్నా సీరం వ్యాక్సిన్ 60% చవక. అంతేకాదు భారీ మొత్తంలో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేయవచ్చు. ఇది గేమ్‌ఛేంజర్ కావడానికి వీలుంది. అయితే దీన్ని అందుబాటులోకి తీసుకు రావాలంటే తగిన ఆర్థిక సాయం అవసరం. కానీ ఈ ఆర్థిక సాయమే అమెరికా బెదిరింపులోపడింది. భారత దేశంలో ట్రాన్స్‌జెండర్లలో హెచ్‌ఐవి ప్రాబల్యం విపరీతంగా పెరుగుతోంది. జాతీయ సగటు 3.13 శాతంతో పోలిస్తే హైదరాబాద్‌లో హెచ్‌ఐవి ప్రాబల్యం 6.17 శాతం వరకు ఉంది. అందుకని దేశం మొత్తం మీద హైదరాబాద్‌లోనే ట్రాన్స్‌జెండర్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు అయింది.

అమెరికా ప్రభుత్వం ‘ప్రెసిడెంట్స్ ఎమర్జెన్సీ ప్లాన్ ఫర్ ఎయిడ్స్’ పథకంకింద యుఎస్ ఎయిడ్ యాక్సిలరేట్ ప్రాజెక్టు ఆర్థికంగా, సాంకేతికంగా సహకరిస్తోంది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (ఎన్‌ఎసిఒ) భాగస్వామ్యంతో 2030 నాటికి ఎయిడ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలన్న లక్షం పెట్టుకున్నారు. కానీ అమెరికా నిధులు ఆపివేయడంతో ఈ లక్షం ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పటికిప్పుడు నిధులు సేకరణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం చాలా కష్టమని వైద్యనిపుణులు చెబుతున్నారు. దీనివల్ల హెచ్‌ఐవి చికిత్స ఆగిపోతుందని అంటున్నారు. ఈ చికిత్స సుదీర్ఘకాలం ఆపేస్తే మందులకు లొంగని వైరస్ శక్తి పెరుగుతుందని, అలాగే వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోతుందని, వైరల్ ప్రాబల్యం పెరిగిపోతుందని ఆందోళనచెందుతున్నారు. వాతావరణ మార్పులు అంటువ్యాధులపై తీవ్రప్రభావం చూపిస్తుంటాయి.

అడవులను మనుషులు తమ స్వప్రయోజనాల కోసం ఆక్రమించడంతో వన్యమృగాలకు, కీటకాలకు నెలవు కరువై జనావాసాలకు చేరుకుంటున్నాయి. ఇప్పుడు జంతువులనుంచి కొత్త వైరస్ వ్యాధులు ఎక్కువగా సంక్రమించడం కొనసాగుతోంది. ఈ విధంగా కొత్త వ్యాధికారక బ్యాక్టీరియాలు 70% జంతువులనుంచే వ్యాపిస్తున్నాయి. ఈ వైరల్ వ్యాధులు చెలరేగిన సమయంలో ఎలాంటి వైద్యపరీక్షలు చేయకుండా యాంటీబయోటిక్స్‌ను విచ్చలవిడిగా వినియోగించడంతో యాంటీ మైక్రోబియల్ రిస్క్‌మరింత పెరుగుతుంది. అంటే బ్యాక్టీరియాకు లొంగని దారుణ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల మరిన్ని వైరస్ వ్యాధులు వ్యాప్తి కావడానికి దారితీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కొత్తరకం వైరస్‌ల గుర్తింపునకు, వాటి నివారణకు కొత్త వ్యాక్సిన్ల తయారీకి ప్రపంచ దేశాలు ఎక్కువగా వెచ్చించవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే వైద్యసహాయ కార్యక్రమాలు అన్ని దేశాలకు అందుతాయి. ఈ దూరదృష్టి లేకుండా అమెరికా ఏకపక్షంగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులను ఆపేయడం వైద్యసంక్షోభానికి దారితీస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News