హోస్టన్: టి20 క్రికెట్‌లో అమెరికా టీమ్ పెను సంచలనం సృష్టించింది. పటిష్టమైన బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 20 తేడాతో సొంతం చేసుకుంది. అమెరికా వేదికగా ఈ సిరీస్ జరుగుతుంది. రెండో టి20లో అమెరికా ఆరు పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై సంచలన విజయం సాధించింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్లు స్టీవెన్ టెలర్ (31), కెప్టెన్ మొనాక్ పటేల్ (42) జట్టుకు శుభారంభం అందించారు.
అరొన్ జోన్స్ (35) తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో (36), షకిబ్ అల్ హసన్ (30), తౌహిద్ హృదయ్ (25) మాత్రమే కాస్త రాణించారు. మిగతావారు విఫలం కావడంతో బంగ్లాదేశ్‌కు ఓటమి తప్పలేదు. మరోవైపు అమెరికా బౌలర్లలో అలీ ఖాన్ 25 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశారు. సౌరభ్, శాడ్లి వాన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు జరిగిన మొదటి టి20లో అమెరికా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.